Home భక్తిప్రభ ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

0
ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

పరమపురుషుని ఆరాధనారూపమైన ధర్మమును ఆచరించుట పుణ్యము. పరమపురుషుని ఆరాధనకు వ్యతిరేకమైన కర్మలను ఆచరించుట పాపము. ఒక్క మాటలో చెప్పాలంటే పరమాత్మ ఆజ్ఞను పాలించుట పుణ్యము. పరమాత్మ ఆజ్ఞను ధిక్కరించి ఆయన చేయరాదు అనువాటిని ఆచరించుట పాపము. ఇంకా చెప్పాలంటే పరమాత్మకు అనుగ్రహం, ఆనందం కలిగే పనులు పుణ్యము. పరమాత్మకు ఆగ్రహం కలిగే పనులు పాపములు అని భావము. పరమాత్మ చేయరాదు అనుచు చెప్పిన పనులను అనగా పాపములను ఆచరించినచో పరమాత్మకు ఆగ్రహము కలుగుతుంది. పరమాత్మ ఆగ్రహం మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ దుఃఖాన్ని తప్పక అనుభవించి తీరాలి. ఈ జన్మలోనేనా, మరొక జన్మలోనా అనునది స్వామి నిర్ణయము అంటే మనం పుణ్యాన్ని, పాపాల్ని ఎఫ్‌.డి. చేసుకొనే అవకాశం పరమాత్మ కలిగిస్తున్నాడు. అయితే ఎఫ్‌.డి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఆయనే చేస్తాడు. ఇంట్రస్ట్‌ ఆయనే ఇస్తాడు. కచ్చితంగా ఇస్తాడు. మనము వద్దన్నా ఇస్తాడు. అయితే ఆయనకే అర్పణం చేస్తే మనకు సుఖదుఃఖాలు తప్పుతాయ్‌.
ఫలములను పొందగోరి కర్మలతో ఆ భగవంతునికి ప్రీతి కలిగించినచో ప్రీతి పొందిన భగవంతుడు కోరిన ఫలమును లేదా కర్మానుగుణఫలమును ప్రసాదించును. 5 రూపాయలిచ్చి తులం బంగారం కావాలంటే రాదు కదా! అట్లే కొద్ది పుణ్యం చేసి పెద్ద సుఖం కావాలంటే కలుగదు. నీవు చేసిన కర్మకు అనుగుణమైన అనగా తగిన సుఖాన్ని అనుగ్రహిస్తాడు. అది అవకాశమున్నపుడే. ఎవరికి? పరమాత్మకా, మనకా? పరమాత్మకు ఎపుడూ అవకాశమే. ఇదివరకు ఆచరించిన కర్మఫలములను అనుభవించుచున్నపుడు ఈ ఫలితాన్ని అనుభవించే అవకాశము ఉండదు కదా! అపుడు నీవు అనుభవించు వేరే కర్మఫలము లేనపుడు ఈ కర్మఫలితాన్ని భగవంతుడు అందిస్తాడు. మనం తింటున్నపుడు ఇంకొక పని చెప్పితే అన్నం తిన్న తరువాత చేస్తాము కదా! ఒక పని అయిన తరువాత కదా ఇంకో పని చేసేది. రెండు పనులు ఒకేసారి చేయలేము. చేయరు కూడా. ఈ విషయమును భగవద్గీతలో భగవానుడే స్వయముగా చెప్పియున్నాడు. ‘యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్‌ స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః’ అని సకల చరాచర జగత్తు ఎవరి వలన పుట్టినదో ఎవరి వలన అనంతకోటి బ్రహ్మాండములుగా విస్తరించుచున్నదో ఆ పరమాత్మను తనకు శాస్త్రము విధించిన కర్మను చేసి ఆరాధించినచో సిద్ధిని పొందును అనుచున్నారు. ఇక్కడ భగవంతుడు తనను ప్రత్యేకించి ఆరాధించి అనుట లేదు. నన్ను ఆరాధించుటకు నీ వర్ణాశ్రమాచారరూప కర్మలను విడువమని చెప్పలేదు. నీకు విధించబడిన కర్మతోనే తనను ఆరాధించితే సిద్ధి పొందును అనినారు.

(స‌శేషం)

Exit mobile version