అసలు పుణ్యపాపములు అంటే తెలిసినవారు చాలా తక్కువ. మంచి చెడు అని అనుకుంటాము. దానికి పరమాత్మ ఎంతో ఉదారముగా వ్యవస్థను ఏర్పరిచారు. దానినే శాస్త్రము అంటారు. పుణ్యమంటే ఏమిటి, పాపమంటే ఏమిటి అనేది శాస్త్రము వలననే తెలియాలి. శాస్త్రమంటే యేదో నాలుగు విషయాలను, నాలుగు గ్రంథాలను చదివి తనకు కలిగిన కొద్దిపాటి జ్ఞానముతో చెప్పిన నియమాలు కాదు. శాస్త్రమంటే ఆద్యంతాలు లేనిది, నిరంతరము సకల జనులచే అధ్యయనము, మననము చేయబడుచు ఏ మాత్రం ఒక్క క్షణము కూడా మననము చేయకుండా ఉండనిది. గురుశిష్య సంప్రదాయముతో పఠించబడుచున్నది. ప్రమాదము, భ్రమ, సందేహము, విపర్యయము అనగా విపరీత జ్ఞానము, అన్యధా జ్ఞానము మొదలగు దోషములను వాసన కూడా చూడనిది వేదమను అక్షరరాశిని శాస్త్రము అంటారు. ఆ శాస్త్రము అనగా వేదము రెండు భాగములు. పూర్వభాగము, ఉత్తరభాగము. పూర్వభాగము ధర్మమును వివరించును. ఉత్తరభాగము పరమాత్మ స్వరూపమును తెలుపును. ధర్మము అనగా పరమాత్మ ఆరాధనయే. మనము ఆచరించే ప్రతి ధర్మము భగవంతుని ఆరాధనగా భగవంతుని ప్రీతి కొరకు చేసేదే ధర్మము. ఇట్లు పూర్వభాగము పరమాత్మ ఆరాధనను తెలుపుచున్నది. ఇక ఉత్తరభాగము ఆరాధించబడు భగవానుని స్వరూపమును తెలుపుతుంది. పూర్వభాగము ధర్మవిచారము. ఉత్తరభాగము బ్రహ్మవిచారము అనగా వేదాన్తశాస్త్రము అంటాము. అంటే భగవంతుని ఎలా ఆరాధించాలో పెద్దల వలన తెలుసుకొని భగవంతుని ఆరాధించుచూ గురువుల నాశ్రయించి భగవంతుని తెలుసుకొని ఆ భగవంతుని చేరుటయే మోక్షము. ఈ విధానమును బోధించునదే వేదము. ఈ వేదమే శాస్త్రము. ఆ శాస్త్రము పుణ్యపాపములు అంటే ఏమిటో తెలిపినది. ఇపుడు వాటిని తెలుసుకుందాము.
(సశేషం)