ఈనాడు మనం ఎవరైతేనేమి, ఎక్కడైతేనేమి స్త్రీ అయితే చాలు, కంటికి నచ్చితే చాలు, యువకుడైతే చాలు కులం, వంశం ఎందుకు, సంతానం ఆడా మగా ఎవరైతేనేమి అని ఉదారవాదం చేస్తున్నాము. కబుర్లు, ఉపన్యాసాలు చెప్తున్నాము. కాని స్త్రీ పురుష వివక్ష పోయినదా? స్త్రీని సమానంగా చూస్తున్నారా? ఒక్క వివాహంలో, సంతానంలోనే స్త్రీ పురుష సామ్యమా? వంశం లేకుంటే, పురుషసంతానం లేకుంటే పిండోదకాలెవరివ్వాలి? ఏం మగవారే ఈయాలా? ఆడవారీయకూడదా? ఆడవారెందుకు ఈయకూడదు? లాజిక్‌తో, మ్యాజిక్‌తో ధర్మము కాపాడబడదు. శాస్త్రానికి, ధర్మానికి హేతువాదం పనిచేయదు. అగ్నే ఎందుకు వేడిగా ఉండాలి? నీరు ఎందుకుండకూడదు అంటే ఏమి చెప్తాం. అది ప్రకృతి ధర్మము. ఆ ప్రకృతి ధర్మంలో సంతానం పురుషుని ద్వారా స్త్రీ అందిస్తుంది. స్త్రీనే నేను కూడా ఇస్తానంటే నవ్వరా? అట్లే పిండప్రదానానికి వంట భార్య చేయాలి. భర్త పిండప్రదానం చేయాలి. నువ్వులు, దర్భలు భార్య ఈయాలి. భర్త తర్పణం విడవాలి. భార్య వంట చేయాలి. భర్త వడ్డన చేసి భోజనం చేయునట్లు చూడాలి. ఇలా ఇరువురికి సమాన ధర్మాలు పంచారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కిరీటం గొప్పది, చెప్పులు తక్కువ అనుకొంటే పొరబాటు. ఆ కిరీటం, దాన్ని ధరించిన తల కాళ్ళ మీదనే నిలబడాలి. కాళ్ళకు రక్షణ ఉంటేనే ఆ కాళ్ళు తలను సురక్షితంగా కాపాడుతాయి. కిరీటం తలకెందుకు, కాళ్ళకు పెట్టుకుంటామంటే ఎలా ఉంటుంది? ఇది మగవాళ్ళే చేయాలా అంటే అలాగే ఉంటుంది. కాళ్ళ మీదనే మనుషులు నిలబడతారు.
స్త్రీని ఆధారం చేసుకొనే సమాజం నిలుస్తుంది. ఇలా అనగానే మళ్ళీ స్త్రీని పాదాలతో పోలుస్తారా అనే ఒక దుర్వాదం వస్తుంది. కాళ్ళు తక్కువని అనుకొంటే తప్పు. కింద ఉన్నదే గొప్పది. భూమి క్రింద ఉన్నది. వేల నగరాలు, గ్రామాలు పైన ఉన్నాయి. ఆధారం భూమి. అట్లే ఆధారం స్త్రీ. అది గొప్ప గౌరవము. ఇట్లు పురుష సంతానం, స్త్రీ సంతానం రెండూఉంటే కులం ఉంటుంది. మనకు సూర్యవంశం,చంద్రవంశం, జనక వంశం, ఇక్ష్వాకువంశం, రఘువంశం ఇలా వంశాలు చెప్పుకొంటున్నాము. ఆ వంశానికి అందులో ఆ జాతికి ఒక విశిష్ట లక్షణం, సంస్కారం ఉంటుంది. ఇంత గొప్ప ధర్మవ్యవస్థను ఏర్పరిచిన భగవానుని ఔదార్యాన్ని ఎంత పొగడుదాము! ఆలోచించండి. ఇక రాముని అరణ్యగమనంలోని ఔదార్యాన్ని చూతాము.
(సశేషం)