Sunday, December 1, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

‘యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః
కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాస్సనాతనాః
ధర్మే నష్టే కులం కృత్స్యం అధర్మోభి భరత్యుతః’
అంటారు. ఈ కౌరవులు లోభము చేత వివేకము కోల్పోయి కులక్షయము వలన కలుగు దోషమును, మిత్రద్రోహమున పాతకమును చూచుట లేదు. కులము క్షయమైతే సనాతన కులధర్మములు నశిస్తాయి. ధర్మే నష్టే ధర్మము నశించినచో అధర్మము ఈ లోకమును ఆవరిస్తుంది.
‘అధర్మాభి భవాత్‌ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః
సంకరో నరకాిైువ కులఘ్నానాం కులస్యచ
పతంతి పితరోహ్యేషాం లుప్త పిండోదక క్రియాః’
అంటారు. అధర్మము ఆచరించినచో స్త్రీలు కాలుష్యమును పొందెదరు. అనగా చెరబట్టబడెదరు. చెరచబడెదరు. స్త్రీలు చెరచబడితే వర్ణసంకరం జరుగును. ఆ వర్ణసంకరమున నరకమునకే దారితీయును. ఆ నరకము కులమును చెరిచినవారికి, కులమునకు కూడా నరకము సంభవించును. ఇట్లు కులము చెడిపోయినదా పితరులకు పిండోదకక్రియలు లోపించును. పిండోదక క్రియలు లోపించనచో పితరులు నరకలోకములలో పతనమయ్యెదరు.
‘దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః
ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతా’
ఇట్లు కులమును ధ్వంసము చేసినవారి వర్ణసంకరమును కలిగించు దోషములతో జాతి ధర్మాలు, కులధర్మాలు శాశ్వతంగా నశిస్తాయి.
‘ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన
నరకే నియతం వాసో భవ తీత్యనుశుశ్రుమ’
కులధర్మములు నశించిన మానవులకు తప్పక నరకములో నివాసము కలుగును అని శాస్త్రము చెప్పగా విన్నాము. అయ్యో! మేమెంత పాపానికి వడిగట్టబోతున్నాము. రాజ్యలోభముతో సుఖలోభంతో స్వజనమును వధించి, జాతిధర్మములను, కులధర్మములను, స్త్రీ ధర్మములను, వంశధర్మములను నశింపచేయ సమకట్టినాము అంటాడు. ఎవరైనా ఈ అర్జునుని ఆర్తిని, సంతాపాన్ని వింటున్నారా? శత్రువులు తమ రాజ్యాన్ని హరించారు. వారిని వధించి, తమ రాజ్యాన్ని తాము తీసుకొని సుఖసంతోషాలతో ఉండాలి. అందుకు యుద్ధం చేయాలి. వారు అపకారం చేశారు. మనం ప్రతీకారం చేయాలి. ఇంతవరకే కథను ఆలోచిస్తారు. కాని వ్యాసభగవానుడు భారతం వ్రాసింది ఇందుకోసం కాదు. ధర్మం కోసం, న్యాయం కోసం, సత్యం కోసం, శాంతిసామరస్యాల కోసం. అవి యుద్ధం చేస్తే పోతాయి అని అర్జునుడు ఆలోచించాడు. మాకు రాజ్యం లభిస్తుంది కాని, ఈ యుద్ధంలో ఎన్ని కులాలు నశిస్తాయి, ఎన్ని వంశాలు నశిస్తాయి. కులాలు నశిస్తే కులధర్మాలు నశిస్తాయి. ధర్మము నశిస్తే అధర్మం అవతరిస్తుంది. మరి యుద్ధంలో పురుషులందరూ మరణిస్తే అనాథలు అయిన స్త్రీలు ఇతర పురుష సంగమంతో దోషభూయిష్టులౌతారు. స్త్రీలు దుష్టులైతే వర్ణసంకరమౌతుంది. సంకరం నరకాన్నిస్తుంది. దానితో పితరులకు పిండోదకములు నశిస్తాయి. పితరులు పతనమౌతారు. జాతిధర్మాలు, కులధర్మాలు నశిస్తాయి. ఇది మా యుద్ధఫలితం అన్నాడు అర్జునుడు. యుద్ధము వలన జరుగబోయే ధర్మహాని, కాలహాని, వంశహాని, తర్పణ పిండాది హాని ఇన్ని ఆలోచించాడు అర్జునుడు. యుద్ధం చేస్తాము, మేము గెలుస్తాము. రాజ్యం, అధికారం, రాజభోగాలు మావి. శత్రువులు నిశ్శేషం అవుతారు. ఇది సామాన్యులు ఆలోచిస్తారు. కాని అర్జునుడు అందుకు భిన్నంగా ఆలోచించాడు. యుద్ధం జరుగుతుంది. ఎవరో ఒకరు గెలుస్తారు. గెలిచినవారు రాజ్యపాలన చేస్తారు. అంతవరకు బాగానే ఉన్నది. ఆ రాజ్యం ఎలా ఉంటుంది. మా రాజ్యంలో ప్రజలెలా ఉంటారు? ఒక జాతి లేక నీతి లేక కాలము లేక నాశము లేక ధర్మము లేక దానము లేకుంటే ఆ ప్రజలు సుఖశాంతులతో ఉంటారా? అధర్మం విచ్చలవిడిగా విహరిస్తే వర్షాలు పడతాయా? పంటలు పండుతాయా? ప్రజలకు సుఖశాంతులు కరువైతే ప్రభువు పాలించగలడా? ఆ ప్రజలు ఆ రాజును అంగీకరిస్తారా? ఈనాడు మేము పోరాడినట్లు మీరంతా పోరాడితే భూమిమీదెవరుంటారు? వర్షాలు పడాలి అంటే బ్రాహ్మణులు సదాచార సంపన్నులు కావాలి. రాజులు ధర్మంగా పరిపాలన చేయాలి. స్త్రీలు పాతివ్రత్యాన్ని పాటించాలి. దేవతలను, పితృదేవతలను ఆరాధించాలి. వారు మనకు వర్షం, పంటలు, సత్సంతానం, సౌభాగ్యం ప్రసాదిస్తారు. ప్రజలు ధర్మప్రవర్తకులు కాకుంటే రాజుంటాడా? ఇది అర్జునుని ఆలోచన. స్త్రీలు బాగుంటేనే ధర్మం నిలబడుతుంది. అందుకే ఎక్కడ ఎవరు ఎవరిమీద దండెత్తినా మొదట స్త్రీలపై ఆక్రమణ చేయటం మనం అనాదిగా చరిత్రలో చూస్తున్నాము. స్త్రీలు చెడిపోతే సంతానం చెడిపోతుంది. సంతానం చెడిపోతే సమాజం చెడిపోతుంది. ఒక సమాజం, ఒక దేశం బాగుండాలంటే మొదట స్త్రీలు బాగుండాలి. స్త్రీలను రక్షించిన రాజ్యమే పూజించిన రాజ్యమే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, సుభిక్షంగా మనగలుగుతుంది. అందుకే యుద్ధము జరిగితే కులక్షయము, కాలక్షయముతో స్త్రీలు చెడిపోతారు అని యుద్ధానికి, స్త్రీలకు సంబంధాన్ని చూచిన అర్జునుడు ఎంత గొప్ప సంఘసంస్కర్తయో, సమాజహితమును, లోకకల్యాణమును కోరినవాడో అర్థం అవుతుంది.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement