Friday, November 29, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

కశ్యప ప్రజాపతి అదితి సంధ్యాసమయంలో సంగమించుట వలన వారు ప్రజాపతులైనా ప్రజాపతి వంశంవారైనా వారు చేసిన దోషం వారి పుత్రులకు అనగా హిరణ్యకశ్యప హిరణ్యాక్షులకు సంక్రమించి లోకపీడాపరాయణులైనారు. అదే హిరణ్యకశ్యపుడు దుర్మార్గుడైనా భార్యాసంగమంతో, భార్య ప్రోత్సాహంతో తనకు తెలియకుండానే నారాయణ నామసహస్రం స్మరించాడు కావున పరమభక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు పుట్టాడు. మనం చేసిన ధర్మాధర్మాలు ఊరికే పోవు. మనకూ ఫలితాన్నిస్తాయి. మన పిల్లలకూ ఇస్తాయి. ఇప్పుడు కాలం హాయిగా గడిస్తే చాలు అనుకునేవారు వివేకశూన్యులు అంటున్నది పురాణం. ఇపుడు కష్టాలు వచ్చినా ముందు నేను, నా పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు సుఖసంతోషాలతో, శాంతిసౌభాగ్యాలతో తులతూగాలి అని ఆచరించేవాడే నిజమైన మానవుడు. ఇపుడు ఎవరు చూస్తున్నారు? కాపురం చేసేది నేనా మీరా, కలిసుండేది నేనా మీరా, నాకు నచ్చకుంటే ఎలా, మీకునచ్చితే నాకెందుకు అనే వాదం పుట్టుకొచ్చింది. అంతవరకే ఆలోచించేవారు ఆలోచనాశూన్యుడు. నీకు నచ్చటమెందుకు? ఆమెతో లేక అతనితో కలిసి బ్రతకటానికి. అంతేనా! అంతటితో అయిపోయిందా? అలా కలిసుంటే సంతోషంగా ఉంటే సంతానం కలుగుతుందే. మరి వారు మీకు నచ్చాలా, వద్దా? వారు మీ ఇష్టప్రకారం మెలగాలి. మీరు చెప్పినట్లు వినాలి. మీరు మాత్రం మీ పెద్దల మాట వినరాదు. ఇదెక్కడి న్యాయం. వారు కూడా నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతాను. నా బ్రతుకును మీరెందుకు శాసిస్తున్నారు అని అడుగుతున్నారు. ఆ స్వేచ్ఛనే వారికిస్తున్నారు. అందుకే ఎనిమిదియేండ్ల వానికి మద్యపానం, గర్ల్‌ఫ్రెండ్స్‌, ద్యూతం, ఇంకేవో అలవాట్లు.
పరలోకం గురించి ప్రక్కన పెట్టినా కనీసం తాను బ్రతుకుతున్న సమాజం కోసం ఏమైనా చేస్తున్నారా? వారితో నాకెందుకు, నేను బాగుంటే చాలు అని తన బాగు తాను చూచుకుంటే మనిషి బ్రతుకగలడా? మీ నాన్న తన బాగే చూచుకుంటే నీవెక్కడుంటావు? నీ బాగు చూసుకో, నలుగురి బాగుతో కలిపి నీ బాగు చూసుకో. పుట్టిన శరీరాన్ని సుఖంగా పెంచుకోవాలి అనుకోవటం తప్పు కాదు, ఆ సుఖంలో ఇంకా చెప్పాలంటే ప్రతిదీ శరీరం కోసం కాదు. అందులో ఆత్మ ఉన్నది అని తెలుసుకుని చేయాలి. శరీరం కోసం చేసేవి ఆత్మ తెలియని పశుపక్షులు. మరి మనం పుట్టాం, తేరగా తిన్నాం, తిరిగాం, చచ్చాం. అంటే నీవు హాయిగా బ్రతుకుతున్నది సమాజంలో. ఆ సమాజానికి కొన్ని కట్టుబాట్లున్నాయి. వాటిని అందరూ ఆచరించాలి, అనుసరించాలి.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement