Thursday, November 28, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

వంశములో ఒక్కరు తప్పుగా ప్రవర్తిస్తే, స్వార్థముగా ప్రవర్తిస్తే ఆ ఫలితం సంతానానికి వర్తిస్తుంది. దశరథుడు యవ్వనంలో రాత్రిపూట వేటకు వెళ్ళి, అక్కడ యేనుగు అనుకొని శ్రవణకుమారుని వధిస్తే సీతారాములకు అరణ్యవాసం ప్రాప్తించింది. దిలీప మహారాజు కామధేనువును ఆరాధించి ఆకాశంలో రాముని కొరకు యజ్ఞం చేయకుండా, గో ఆరాధన చేయకుండా సంతానం కలుగలేదు. అందుకే వివాహానికి ముందు అమ్మాయి తండ్రి, అబ్బాయి తండ్రి కూర్చొని వంశవృత్తాన్ని చెప్పుకొంటారు. సీతారామ కళ్యాణంలో వసిష్ఠ మహర్షి సూర్యవంశ చరిత్రను జనకునకు, శతానందునకు చెపుతారు. జనకమహారాజు తన వంశచరిత్రను దశరథునకు, వశిష్టునకు చెపుతారు. అపుడు ఎటువంటి వంశము, ఎటువంటి కులము, ఎటువంటి వయస్సు, ఎటువంటి నడవడి అని తెలుస్తుంది. అప్పుడు ఏమైనా అభ్యంతరాలుంటే అవి తొలగించుకొని అనగా దోషపరిహారం చేసుకొని వివాహం చేసుకొనేవారు. వివాహం అర్థం కాదు, వివాహం కామం కాదు. వివాహం ధర్మం. ధర్మం కోసం వివాహం. వంశం కోసం వివాహం. సమాజ శాంతిసౌభాగ్యాల కోసం వివాహం. వివాహంలో కోరికకు అవకాశం లేదు. కోరిక కూడా ధర్మబద్ధంగానే తీర్చుకోవాలి. సంతానం కలగటం కాదు. సత్సంతానం కలగాలి. కులానికి, వంశానికి వన్నె తెచ్చేవారు కావాలి. ఇపుడు సంతానం కాదు ముఖ్యం, సంతోషం. సంతోషం ముఖ్యం కాదు సంపాదన. సంపాదనలో సంసారం, సంతానం రెండూ గాలికి వదిలేస్తున్నారు.
వివాహమంటే ఎలా ఉండాలి? దేని వివాహమంటారు? ఎందుకు చేసుకోవాలో తనను దృష్టాంతముగా చేసుకొని చెప్పాడు రాముడు. తనకు కన్య నచ్చటం, కన్యకు వరుడు నచ్చటం మన భారతీయ సంప్రదాయంలో ముఖ్యం కాదు. ఉన్నతవంశంలో పుట్టినదా, సద్వంశములో పుట్టినదా, సమానకులంలో పుట్టినదా? తల్లిదండ్రులు సచ్చరిత్ర కలవారేనా, తల్లిదండ్రులు, తాతలు ముత్తాతల వరకూ చూస్తారు. అందుకే వివాహంలో ప్రవర చెప్తారు. ముత్తాత, తాత, తండ్రి ఇద్దరికీ తెలియాలి. మొదట కన్యనీయాలి అనుకుంటే ఇవన్నీ తెలుసుకోవాలి. తాత, ముత్తాత, అతని తండ్రి ఎవరు? దుష్టచరిత్ర కలవాడైనా ఆ దోషం సంతానానికి కలుగుతుంది. తన ప్రవర్తన తమవరకే కాదు, తమ పిల్లలకు, వారి పిల్లలకు, వారి పిల్లలకు వర్తిస్తుంది. ఆస్తిని దక్కించుకొంటేనే దక్కుతుంది. పుణ్యపాపాలు, సంస్కారాలు వద్దన్నా అంటుతాయి. అందుకే ప్రతి మానవుడు తన తరతరాలవారు బాగుండాలి. బాగా బ్రతకాలి అని తాను ధర్మంలో ప్రవర్తించాలి.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement