ఒక్కొక్క కులానికి కొన్ని ప్రత్యేక కర్తవ్యములు, స్వభావములు, అలవాట్లు ఉంటాయి. అసలిపుడు అవేవీ లేవు కదా! కులము చెప్పుకుంటే తప్పు. ఒప్పుకుంటే తప్పు. అన్ని కులాలు పొద్దున్నే లేవాలి, స్నానం చేయాలి. టిఫిన్ చేయాలి, ఆఫీసుకు పోవాలి. అక్కడ మధ్యాహ్నం దొరికినదాన్ని భుజించాలి. మళ్ళీ డ్యూటీ చేయాలి. సాయంత్రం ఇంటికి రావాలి. పెద్ద చదువులు చదవాలి. పెద్ద ఉద్యోగాలు లభించాలి. బాగా డబ్బు సంపాదించాలి. అన్ని కులాలది, అన్ని మతాలది ఇదొక్కటే ఆశయం. మంచి ఉద్యోగం, మంచి చదువు, బాగా డబ్బు. అవకాశమున్నపుడు అందమైన అమ్మాయి. ఇవే నేటి ప్రపంచంలో కనపడుచున్నవి. ఇంకా దీనికి కులమెందుకు? మతమెందుకు? జాతి ఎందుకు? స్త్రీ పురుషులు ఎందుకు? అధికారంలో, అమ్మాయి పొందులో, అర్థార్జనలో అన్ని ధర్మాలు, అన్ని శాస్త్రాలు కొట్టుకొనిపోతున్నాయి. ఇంకా ధర్మమేమిటి? ధర్మమెవరికి? వివక్ష ఎందుకు అంటున్నారు కాని కులవివక్ష లేకుండా విద్య నేర్పుతున్నారా? ఉద్యోగాలిస్తున్నారా? దానికి కారణం వారికి అవకాశాలు సన్నగిల్లాయి. వారు దోచుకుంటున్నారు. అందుకే మేము దోచుకుంటాము అని దోచుకొనేవారికి, దాచుకునేవారికి ఏ భేదాలు లేవు. తినాలి, తిరగాలి, డబ్బు సంపాదించాలి. అధికారం సంపాదించాలి. ఇవి రాజ్యమేలుతున్నాయి.
కాని రాముడు వాటిని సమూలంగా తుడిచిపెట్టాడు. ధర్మబద్ధంగా తిను, ధర్మబద్ధంగా సంపాదించు, ధర్మంగా వివాహం చేసుకో. ఇప్పటి వివాహంలో ధర్మం కనపడుతుందా? పురోహితుడు మంత్రాలు చదువుతుంటాడు. ఇలా చేయి, ఇలా చేయి అని చెపుతుంటాడు. కాని ఎవరు వింటారు. వధూవరులు వింటున్నారా? బంధువులు వింటున్నారా? కెమెరామెన్ చెప్పినట్లు పోజులియ్యటమే వధూవరుల పని. ఒక్కొక్కసారి పురోహితుని కూడా ప్రక్కకు జరుగమని చెప్పి ఫొటోలు తీస్తుంటారు. తాళి కట్టినా, తలంబ్రాలు పోసినా జీలకర్ర, బెల్లం పెట్టినా కెమెరాను చూచుకుంటూ చేస్తారు. పిల్లను, పిల్లవాణ్ణి చూడరు. మరి ఆ కెమెరానే పెళ్ళి చుఏసుకుంటే సరిపోతుంది కదా! పురోహితుడు చేస్తున్న తంత్రమేమిటి? అక్కడ మంత్రమేమిటి, దానికి అర్థమేమిటి అడిగేదెవరు, చెప్పేదెవరు? అసలు మంత్రాలెందుకు? పెళ్ళైంది. భార్య లభించింది. తీసుకొని అమెరికా చలో అంటారు. ఆరు నెలలకో, యేడాదికో విడాకులు. తల్లిదండ్రులు లక్షలు ఖర్చుపెట్టి చేసిన కోలాహలం అంతా ఆరు నెలల వేడుకో లేదా ఏడాది కోరిక. అయ్యో! జాతకం చూసి మంచి ముహూర్తం చూసి మంచి పురోహితునితో చేయించాము. ఇలా ఎందుకైందో అంటారు. జాతకం చూస్తారు. ముహూర్తం చూస్తారు. పురోహితుడు మంచివాడే. మరి పిల్లా, పిల్లవాడు మంచివారేనా? ఒకరినొకరు నచ్చారండీ అంతే. ధర్మం పోయింది, కోరిక ముందుకొచ్చింది. అంటే ధర్మమొద్దు, అర్థమొద్దు. కామము కావాలి. రూపము వద్దు, నచ్చాలి. ఎక్కడ వంశము, వంశచరిత్ర ఇవన్నీ అవసరం లేదు.
(సశేషం)