Tuesday, November 26, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

‘అహం సీతాం చ రాజ్యం చ ప్రాణానిష్టాన్‌ ధనాని చ
హృష్టో భ్రాత్రే స్వయం దద్యాం కింపునః ప్రేరితేనచ.’
నేను రాజ్యమును, ప్రాణములను, ధనములను సంతోషముతో నా తమ్ములకు ఇస్తాను. ఇక తండ్రే చెప్పితే ఇంకా చెప్పాలా? అయినా అమ్మను, నాన్నను తప్పు పట్టడం తప్పురా. ఈ రోజు ఉదయం వరకు నా మీద అంత ప్రేమ చూపినవారు, హఠాత్తుగా కైక మారింది అంటే అది ఆమె దా తప్పు. ‘దైవం తత్రాపరాధ్యతి’ అంటాడు. అమ్మ మీద ఒక అపనింద వచ్చినా రాముడు సహించడు. ప్రేమ, అభిమానం, ద్వేషం, అసూయ, సంతోషం, సుఖం మన అధీనంలో ఉండవు. దైవాధీనంలో ఉంటాయి. అప్పటిదాకా ప్రేమిస్తాము. అంతలోనే ఏదో ఒక సాకు తీసుకొని ద్వేషిస్తాము. ఇది మనము ఆచరించిన కర్మానుగుణముగా ఇచ్ఛాద్వేషాలు కలుగుతాయి. మన అనుభవం ఎదుటివారి ద్వారా కలగాలి అన్నపుడు వారిలో ఆ వికారాలు కలగాలి కదా! దైవం బలీయము నాన్నా! దైవాన్ని పురుషహంకారంతో గెలుస్తాను అంటున్నావు. అసలు దైవమంటే యేమిటో తెలుసా?
‘అసంకల్పిత మేవేహ యదకస్మాత్ర వర్తతే
నివర్త్యారాబ్ధమారంభైః ననుదైవస్య కర్మతత్‌.’
అంటాడు రాముడు. మనము ఆరంభించిన పనిని మన ప్రయత్నములను ఆపేసి అనుకోకుండా అంటే మనము సంకల్పించకుండా అకస్మాత్తుగా ప్రవర్తించేదే దైవము. ఒక మాటలో చెప్పాలంటే జరిగిన తరువాత తెలిసేది దైవము. జరిగేదాకా తెలియనిదానిని ఎట్లా ఆపుతావు. అటువంటి ఆలోచన చేయకు.
‘ధర్మార్థ కామాః ఖలు తాత లోకే
సమీక్షితా ధర్మఫలోదయేషు
యే తత్ర సర్వేస్యుర సన్నివిష్టా
భార్యేవవశ్యా అభిమతా సుపుత్రా.’
అంటాడు. ఈ వాక్యము సర్వకాలములలో అనువర్తించునది. ధర్మార్థ కామములు, పురుషార్థములు మూడు అని శాస్త్రము చెప్పుచున్ననూ రాముని సిద్ధాంతము ఒక్క ధర్మమే. అంటే అర్థకామముల కొరకు విడిగా ప్రయత్నించవలసిన పనిలేదు. వాటిని విడిగా ఆచరించవలసిన పనిలేదు. ధర్మమును నిబద్ధతతో ఆచరించినచో అర్థకామములు ధర్మఫలములుగా అవే సమకూరుతాయి. ధర్మాచరణకు ఫలములే అర్థకామములు. మళ్ళీ విడిగా అర్థకామములకు అవకాశమీయరాదు అంటాడు రాముడు. దృష్టాంతంగా ధర్మాచరణలో భాగంగా వివాహము చేసుకుంటే ధర్మబద్ధంగా చేసుకొనిన భార్య ఇష్టురాలు, వశ్యురాలు అవుతుంది. ఆమె వలన మన అన్ని కోరికలు తీర్చుకొనవచ్చును. ఆ కోరికలతో సత్పుత్రుడు కలుగుతాడు. ఆర్యధర్మము. ఆమెను స్వీకరించినచో కామము లభిస్తుంది. కామము వలన పుత్రుడు లభిస్తాడు. మనము ఒక ధర్మమును ఆచరించినచో కామ అర్థములు ఆ ధర్మము వలననే లభిస్తాయి. ఇంకా విడిగా అర్థకామములకై యత్నించవలసిన పనిలేదు. అంటే కామము కూడా ధర్మబద్ధమే కావలయును. వివాహము కూడా ధర్మవిధిగా చేసుకోవాలి. ధర్మవిధితో చేసుకుంటేనే అనుకూలమైన భార్య లభించును. భార్య లభించుట కాదు, అనుకూలమైన భార్య లభించాలి అంటే వివాహము ధర్మబద్ధముగా చేసుకోవాలి. రామాయణం చెపుతుంది ‘తుల్యశీల కులేజాతాం తుల్యాభి జన లక్షణాం’ అని హనుమంతుడు చెపుతాడు. సమానమైన కులము కావాలి. సమానమైన శీలము కావాలి. సమానమైన వంశము కావాలి. సమానమైన లక్షణాలు కలది కావాలి.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement