అంతేకాదు లక్ష్మణస్వామి చాలా ఆగ్రహంతో నీ రాజ్యాన్ని ఈయను అనటానికి ఆయన ఎవరు? నిండుసభలో రేపే పట్టాభిషేకం అన్నవారు అంతఃపురంలో అడవికి పో అంటే ఆ మాటకు విలువ ఉందా? అడ్డమొచ్చినవారిని నేను సంహరిస్తాను. నాకు, నీకు వ్యతిరేకముగా నిలిచి ఎవడుండగలడు?
‘న శోభార్థా వివౌ బాహూ న ధనుర్భూషణాయమే
నా సిరాబద్ధనార్థాయ న శరాస్తంభ హేతవః’
అంటారు. నాకు ఈ బాహువులు అలంకారము కోసము కాదు. ధనువు ఒక భూషణముగా ధరించలేదు. ఖడ్గము నడుముకు కట్టుటకే కాదు, శరములు మూపున మోయుటకు కాదు. నీకు నేను ముందుంటాను. అవసరమైతే ‘హనిష్యే పితరం వృద్ధం బాలభావేన సంస్థితం’ అంటారు. ఆవేశం హద్దుమీరినది. అవసరమైతే బాల్యభావముతోనున్న వృద్ధుడైన తండ్రిని వధించెదను అన్నాడు. తనకు అన్న కావాలి. అన్న రాజు కావాలి. దానితో ఏదో మాట్లాడాడు. ఇప్పటికాలం అయితే వెంటనే ఊ, చంపు. నేను రాజును, నీవుయువరాజువు అనేవారు. కాని ఆయన రాముడు కదా! తనకు రాజ్యము పోయినందుకు అతనిలో బాధ లేదు. తమ్ముడు ధర్మము తప్పుచున్నాడే. తన కుటుంబంలో ధర్మాన్ని తప్పేవాడు ఒకడున్నా ఆ పాపం అందరికీ సమానమే. పాపం అటుపోనిమ్ము. తన తమ్ముడు ధర్మం తప్పితే ఎట్లా? ఇది అతని బాధ. తమ్ముని ధర్మములో నిలపాలి. అందుకే నాన్నా! తప్పు, తండ్రి ఎక్కడ చెప్పినా, ఎలా చెప్పినా తండ్రి మాట పాటించటమే పుత్రధర్మం. రాజ్యమిస్తే, ఆస్తి ఇస్తే, సంపద ఇస్తేనే తండ్రా? తాను వాటితో పుట్టాడా? ఎవరైనా పుట్టేది రక్తమాంసాదులు. అవి ఇచ్చేది తల్లిదండ్రి లేదా ఇదిగో మన శరీరం నాన్న ఆస్తియే. మన వివేకం నాన్న ఆస్తియే. నాన్న ఇచ్చిన హరించుకుపోతారు. శరీరాన్ని, వివేకాన్ని, విజ్ఞానాన్ని హరించరు కదా! మరి తల్లిదండ్రుల వద్ద నుండి ఆస్తి కావాలని అడుగటం, ఆశపడటంలో అర్థమున్నదా? అయినా ఆస్తి ఉన్నా, ఆస్తి లేకున్నా తలిదండ్రులుంటారు. వారి సేవ మనం చేసినంతకాలం ఉంటుంది. వారున్నపుడు సేవ చేయలేకుంటే వారు పోయిన తరువాత మళ్ళీ ఆ సేవ చేసే భాగ్యం దొరుకుతుందా?
‘సహస్రాణాం సముద్రాణాం స్నానాత్తు దానాస్తు మానవ
మాతా పితృ ప్రమోదోహి వరా వరా న సంశయః’
అంటారు ఋషులు. వేయి సముద్రస్నానాల కంటే సముద్రతీరమున వేలదానముల కంటే తలిదండ్రులు సంతృప్తి శ్రేష్ఠము అన్నారు.
‘మేరుర్ద్రవతి అబ్ధీశ్చ క్షుభ్యతేగ్నిశ్చ శామ్యతి
నదీః శుష్యన్తి లోకేతు పితామాతా న నశ్యతి’
అంటారు. అంత పెద్ద మేరుపర్వతము కరిగిపోతుంది. అంటే రోజంతా బంగారం తీసుకుంటుంటే అయిపోతుంది. సముద్రము క్షోభపడుతుంది. అగ్ని చల్లారుతుంది. నదులు ఎండిపోతాయి. తల్లిదండ్రుల ప్రేమ తరిగిపోదుచ అనేది పురాణవాక్యము. పారగా పారగా నదులు ఇంకిపోతాయి. తల్లిదండ్రుల ప్రేమ ఇంకిపోదు. నీవు హాని చేసినా వారి ప్రేమ తరుగదు. నీవు చేసిన సేవ వలన తల్లిదండ్రులు ఒక్క క్షణము తృప్తిగా నిట్టూర్చినా నీ జన్మ ధన్యము. ఆస్తి ఉన్నా, లేకున్నా పొయ్యేది అయిదువేళ్ళు నోట్లోకే. నీ అయిదువేళ్ళు నీ నోట్లో పెట్టుకొనేలా సంపాదించటం గొప్ప కాదు. ఎదుటివారి నోట్లో పెట్టాలి. అందులో తల్లిదండ్రులకు ఒక పిడికెడు మెతుకులు తినిపిస్తే నీ బ్రతుకు సార్థకం. అన్నప్రాశన నుండి నీకు ఎన్ని ముద్దలు తమ ముద్దలను తగ్గించుకొని పెట్టారో ఆలోచించు. నీవు నీ తండ్రిని చంపి, నిన్ను నీ కొడుకు చంపి ఇదియా పుత్రధర్మము. తండ్రి నాకు అడవి ఇచ్చారు. ఎంత అదృష్టం! వ్యవసాయంతో పనిలేదు. అన్ని పండ్లు, అన్ని పూలు, అన్ని నీళ్ళు, కందమూలాలు ఆయాచితంగా లభిస్తాయి. వాటిని చూచి మనం నేర్చుకోవాలి, ఇతరులకిచ్చినదే సంపద అని.
(సశేషం)