Sunday, November 24, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇక ప్రత్యక్షముగా భగవానుని ఔదార్యమును తెలుసుకుందాము. ప్రళయకాలములో సకల జీవరాశులు తమ నామరూపములను అనగా శరీరములను, ఆ శరీరములకున్న నామములను వదిలి కేవలము ఆత్మలుగా పరమాత్మ ఉదరములో చేరి ఉంటారు. ప్రళయము అంటే నాశము కాదు. లయము అంటే ఒకటి ఇంకొకదానిలో కలియుట. నదులు సముద్రములో లయమవుతాయి. నీరు పాలలో లయమవుతుంది. కుండలు మట్టిలో లయమవుతాయి. ప్రకృతిలోని ఒక వస్తువు ఇంకొక వస్తువులో కలియుట లయము. ఆ ప్రకృతి, జీవులు పరమాత్మలో కలియుట ప్రళయము అందురు. ప్రళయకాలమంతా అతని ఉదరములోనే నిశ్చేష్టులుగా ఉంటారు. కోడి తన పిల్లలతో వీధిలో తిరుగుతూ ఆకాశములో గ్రద్దను, డేగను చూడగానే తన పిల్లలను పిలిచి తన రెక్కల చాటున దాచి ఉంచుతుంది. అవి వెళ్ళిపోగానే మరల బయటకు పంపుతుంది. పరమాత్మ కూడా కొంతకాలం ప్రకృతికి, జీవులకు విశ్రాంతి ఈయదలిచి తన కడుపులో దాచుకొంటాడు. ఇట్లు దాచి రక్షించుట ఔదార్యము కాదా! మన భాషలో చెప్పాలంటే ప్రకృతికి, జీవులకు షార్ట్‌ బ్రేక్‌ అన్నమాట. ఆ కాలము అయిపోయిన తరువాత పరమాత్మ ‘స ఐక్షత బహుస్యాం ప్రజాయేయ’ అని శ్రుతి చెప్పినట్లుగా ఆ పరమాత్మ తాను పలు రూపములుగా కావలయునని సంకల్పించి మొదట ప్రకృతిని బహురూపములుగా సృష్టించును. అనగా ప్రకృతి మహత్తత్త్వము, అనగా బుద్ధితత్త్వము, దానినుండి అహంకారము, దానినుండి పంచజ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచభూతములు, పంచవిషయములు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధములు సృష్టించి అనగా మొదట ప్రకృతిని, తరువాత ప్రకృతిని అనుభవించు విధానాన్ని తెలిపే బుద్ధిని, ఆ తరువాత సంకల్పించే మనసును, సంకల్పించినవాటినిఆచరించగల ఇంద్రియములను, అవి ఉండుటకు అవయవములను, ఆ అవయవములు ఉండుటకు శరీరాన్ని, ఆ తరువాత అందులోకి ఆత్మను ప్రవేశింపచేయుట. ఇది సృష్టి. ఒక మాటతో చెప్పాలంటే మొదట విడిభాగాలను సృష్టించి తరువాత వాటిని కలిపాడు. చక్షురింద్రియమును నేత్రములో, శ్రోత్రేంద్రియమును కర్ణములో (చెవిలో), ఘ్రాణేంద్రియమును నాసికలో ఇట్లే ఆయా ఇంద్రియములను ఆయా అవయవాలలో చేర్చాడు. మన భాషలో స్పేర్‌ పార్ట్స్‌ను అసెంబలింగ్‌ చేయటమన్నమాట. ఇట్లు ప్రాణుల శరీరాలు, ఆ శరీరాలను అవయవాలుగా, అవయవాలను ఇంద్రియములకు ఆధారముగా, దానికన్నా ముందు ఆ శరీరాలు అనగా ప్రాణులు ఉండటానికి మొదట భూమిని, బ్రతకటానికి నీరును, గాలిని, ఆహారం కొరకు పైరులను, వృక్షాలను, వాటిని ఆహారానికి అనువుగా చేయుటకు, ఆహారమును అరిగించటానికి అగ్నిని, అందరూ, అన్ని వస్తువులు నిలవటానికి ఆకాశాన్ని ఇలా పంచభూతాలను మొదట సృష్టించి, వాటివలన యేర్పడువాటిని తరువాత, వాటిలో బ్రతికేవాటిని, నిలిచేవాటిని ఆ తరువాత, ఇట్లు సృష్టిలో ఎంత పెద్ద యోజన (ప్లాన్‌) ఉన్నది ఆలోచించాలి. ఉండటానికి భూమిని సృష్టించి, తరువాత జీవులను సృష్టించారు. ఇదంతా ఔదార్యము కాదా! ఇట్లు సృష్టియే భగవంతుని పెద్ద ఔదార్యము.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement