దేవతలందరూ కోరితే వైకుంఠాన్ని వదిలి భూలోకంలో దశరథునికి పుత్రునిగా పుట్టాడు. దశరథుడు చెప్పితే విశ్వామిత్రుని వెంట అడవికి వెళ్ళాడు. విశ్వామిత్రుడు చెప్పినట్లు వినమని తండ్రి చెపితే తండ్రి మాట ప్రకారం విశ్వామిత్రుడు చెప్పినట్లు తాటకను వధించాడు. అతను ప్రసాదించిన శస్త్రాస్త్రములను స్వీకరించాడు. విశ్వామిత్రుని యాగసంరక్షణ అతని ఆజ్ఞ ప్రకారమే చేశాడు. తన ధర్మం కన్నా శాస్త్రం కన్నా పెద్దల ఆజ్ఞయే శాస్త్రమంటాడు రాముడు. తాటకను చంపాలి అంటే ‘స్త్రీ చేతి మన్యమానేన’ అని స్త్రీని చంపాలా అని, స్త్రీ వధ పాపం కదా అని సందేహించాడు. ‘పాతకం వా సదోషం వా కర్తవ్యం రాజసూనునా’ అంటే దోషమైనా, పాపమైనా రాజు రాజపుత్రులు లోకరక్షణ చేయాలి అనినాడు. నీకు పాపం వస్తుంది అని ఊరుకుంటే ఎన్ని లోకాలు తాపాన్ని పొందుతాయి. లోకతాప నివారణ కొరకు నీవు పాపమైనా భరించాలి అన్న గురువుగారి ఆజ్ఞను తలదాల్చాడు. అయినా అతనిలో దయ దోబూచులాడినది. ఎందుకు చంపటం, ముక్కు చెవులు, చేతులు, తీసేస్తాను. అంగవికలురాలుగా ఉంటుంది. ప్రాణం తీయటమెందుకు అన్నాడు. మళ్ళీ అందులోనూ ఔదార్యమే. అపుడు విశ్వామిత్రుడు అది రాక్షసి. కామరూపి. అంటే తలచుకున్న రూపాన్ని పొందగలదు. నీవు తీసేసిన అవయవాలను తన విద్యతో మరల పొందగలదు. పాపి మీద దయచూపుతారా? నీ దయ చాలు, ఈమెను వధించు అని గట్టిగా చెప్తే ఏమీ ఆలోచించకుండా చంపేశాడు. విశ్వామిత్ర యాగసంరక్షణలో కూడా మొదట వచ్చిన మారీచుని సముద్రం అవతలికి పారద్రోలాడు, చంపలేదు. కావలసింది యాగరక్షణ కదా! దానికి వాడు దూరంగా పోతే చాలు కదా! యాగసమాప్తి అవుతుంది అని అక్కడ ఔదార్యం చూపి, మారీచుని బ్రతికించాడు. ఒక అపుడే కాదు, స్వయంగా మారీచుడే రావణాసురునితో చెప్పాడు. రాముడు చిత్రకూటంలో ఉన్నపుడు, పంచవటిలో ఉన్నపుడు కూడా రెండుసార్లు నేను అతన్ని బాధించాలని చూచాను. యేదో బాణంతో కొట్టి పారదోలాడు కాని చంపలేదు. మాయలేడిగా వచ్చినపుడు కూడా చాలా దూరం ప్రాణాలతో చిక్కుతాడేమో, బంధించాలని చూచాడు. ఇక వినకపోయేసరికి సంహరించాడు. ఇది ధర్మరక్షణలో, దుష్టశిక్షణలో కూడా రాముడు చూపిన ఔదార్యం.
(సశేషం)