Thursday, November 21, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

అసలు మానవజీవితమే ఇంకా చెప్పాలంటే ప్రాణి జీవితమే సేవాధర్మము, సేవాస్వరూపము. పశువులు చెప్పినట్లు వింటాయా? ఆవులు తన జీవితాన్ని మానవరక్షణకే ఉపయోగిస్తున్నాయి. వృషభాలు పొలం దున్ని, బండి మోసి, నాగలి, కర్రు కలుపు పంట తొక్కి ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద ఇత్తనం పడటం మొదలు పంట ఇంటికొచ్చేవరకూ వృషభాల సేవే కానవస్తున్నది. ఈనాడు యంత్రయుగం వచ్చినది. వాటిని మరిచిపోతున్నాం. అయినా ఇప్పటికీ చాలా చోట్ల యంత్రాలు వాడలేనివారికి వృషభాలే దిక్కు. ఇక గేదెలు, దున్నపోతులు సరేసరి. మేకలు, గొఱ్ఱెలు, చివరికి విశ్వాసంతో కుక్కలు, ఎలుకలను పారద్రోలుచు పిల్లులు, పురుగులను తింటూ ఎలుకలు, బల్లులు, కొన్ని క్రిములు అన్నీ నిరంతర సేవతోనే బ్రతుకుతున్నాయి. ఒక్కనాడైనా ఎదురుతిరుగుతాయా? ఆహారం పెట్టకున్నా, నీరియ్యకున్నా సేవ చేస్తూనే ఉన్నాయి. సేవ చేయలేనినాడు కటికవానికి ఇస్తే మౌనంగా ప్రాణాలు అర్పించి, మాసం, చర్మం, గిట్టలు, కొమ్ములు మనకే ఉపయోగిస్తున్నాయి. అవి ఆహారం కోసం ప్రయత్నిస్తున్నాయా? యజమాని వేస్తే తింటున్నాయి. నీరు పోస్తే త్రాగుతున్నాయి. పని చెప్తే చేస్తున్నాయి. మరి ఏ ప్రాణికీ లేని స్వార్థం, ఆశ, అడియాస, కోరిక, కోపం మనిషికెందుకు అంటాడు. ఒక్క నాన్ననే కాదు, పెద్దలు ఎవరు ఏమి చెప్పినా మౌనంగా, సంతోషంగా అంగీకరించి ఆ పని చేయాలి అంటాడు. అనటమే కాదు తాను ఎవరు ఏమి చెపితే అది విని చూపించాడు. అందరినీ శాసించేవాడు, రక్షించేవాడు అందరి ఆజ్ఞను పాలించాడు. ఇది ఔదార్యము కాదా!

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement