Wednesday, November 20, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇక అన్ని అవతారాల కంటే శ్రీరామావతారం మాయామానుష విగ్రహం అంటారు. తనపై తానే మాయను కప్పుకొని నేను సామాన్య మానవుణ్ణి అనే చెప్పుకున్నారు. రావణ వధానంతరం బ్రహ్మ, శంకరుడు స్తోత్రం చేసి నీవు నారాయణుడవు అంటే ‘ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం’ అనినాడు. నన్ను నేను మనిషిగా అనుకుంటున్నాను. దశరథ పుత్రుని రాముని అన్నాడు. ఒక సామాన్య మానవుడు పరిపూర్ణ మానవుడు కావాలంటే ఆచరించవలసిన ధర్మలను తాను స్వామిగా వేదశాస్త్రాలలో బోధించటమే కాకుండా ఆ ధర్మాలను తాను స్వయంగా ఆచరించి చూపాడు. ఒక కొడుకు తండ్రి మాటను తు.చ. తప్పకుండా ఆచరించాలి అనేది ధర్మసూక్ష్మం. తండ్రి ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, అందులో స్వార్థం ఉన్నది నేనెందుకు వినాలి అనటం అవివేకం, కాదనటం నీ స్వార్థం కాదా! నీవు స్వార్థముగా కాదనటం ధర్మమా? అతను స్వార్థముగా నిన్ను కోరటం అధర్మమా? కొడుకు తండ్రి నుండి తనకు రావలసినవి, కావలసినవి తీసుకొని, తాను హాయిగా బ్రతకటం మానవత్వం కాదు. అది మృగత్వం. తాను బ్రతకటం కోసం ఇంకొక ప్రాణిని చంపేది మృగం. తన బ్రతుకు కోసం తండ్రిని హింసించేవాడు, చంపేవాడు మనిషెలా అవుతాడు? తన కొడుకు అంటే తన రక్తం, తన మాంసం, తన ఊపిరి, తన బలం, తన శక్తి, తన త్యాగం కొడుకు. తండ్రి త్యాగం లేకుంటే కొడుకెలా పుడతాడు. సుఖమునే కోరుకొని సంతానం కాదనుకుంటే కొడుకెక్కడ ఉన్నాడు? పుట్టినప్పటినుండి ఆకలిదప్పులు, ఆహారనిద్రలు, సుఖసంతోషాలు అన్నీ మానుకొని ఎన్ని త్యాగాలు చేస్తే నీవీనాడు తండ్రిని విమర్శించ గలుగుతున్నావు, నిందించగలుగుతున్నావు. ఈ బలం మీ నాన్నది. ఈ శరీరం అమ్మానాన్నలది. ఈ బుద్ధి, చివరికి నీ ముఖం, కన్నులు వారివే. ఇన్ని ఇచ్చినవారు తమకోసం ఏమడిగితే తప్పు!
అసలు అడగాలా అంటాడు రాముడు. నాన్నగారు చెప్పేవరకు ఊరుకున్నాను. నేను మూర్ఖుడిని అన్నాడు రాముడు. ‘ఉత్తమశ్చింతితం కార్యాత్‌’. తండ్రి మనసులో అనుకుంటేనే దాని కోసం అన్నీ వదిలి చేయాలి. నేను అడిగేవరకూ ఊరుకున్నాను అంటాడు. తండ్రిది స్వార్థం అంటారేమిటి? కొడుకు తండ్రి స్వార్థం కాదా! కొడుకు క్షేమంగా బ్రతకటం తండ్రి స్వార్థం కాదా! మరి కొడుకుకు గొప్ప కీర్తిప్రతిష్ఠలు అందించటం తండ్రి స్వార్థం కాదా! ఆ కోరిక పుత్రుని అడగటం పుత్రుని అదృష్టం. అందులో ఆయన స్వార్థమున్నది, కుట్ర ఉన్నది, ఆమె మీద అంటే ఆ భార్య మీద ప్రేమతో నాకు అన్యాయం చేశారు. ఇవన్నీ అవివేకం మాటలు. నీకు రాజ్యమిస్తే మంచివాడు, నిస్వార్థపరుడా! నీ తమ్మునికిస్తే స్వార్థపరుడా? అతను కొడుకు కాడా? రాజ్యం తండ్రి తలచుకున్నవానికిస్తారు. స్వార్థమేమిటి? నాన్నగారి ప్రవర్తనకు రాజు ప్రవర్తనకు హద్దులేమిటి? ప్రజల సుఖసంతోషాలకు భంగం రాకుండా రాజు ఏం చేసినా తప్పు కాదు. తన కొడుకుకు నెత్తిన సింహాసనం పెట్టి, అనగా రాజ్యం పెట్టి, దానికి గుర్తుగా కిరీటం పెట్టి సింహాసనంపై కూర్చోబెట్టచ్చు. నారచీరలిచ్చి అడవికి పంపవచ్చు. ఆయన్ను అడిగే హక్కు మనకెక్కడిది అంటాడు రాముడు. తండ్రి ముందు కొడుకు చూపవలసినది ఈ ఔదార్యమే. తండ్రి ముందు తన స్వార్థం చూచుకోవటం ఎంతటి అవిజ్ఞత! నాన్న ఉన్నంతవరకు నాన్నకు కావలసిన అన్ని అవసరాలను తీర్చటమే కొడుకు బాధ్యత. తండ్రిని సేవించటమే కొడుకు స్వార్థం. ఆశ, ఆశయం కావాలి. నాన్న వెళ్ళిపోతే తాను నాన్నగా తన పుత్రుల నుండి తగిన సేవలు పొందాలి.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement