రావణుని వధించగల నరవానరులు ఎవరు అని అడుగగా, దేవతలలోనే ఒకరు నరునిగా అవతరించి అతన్ని వధించాలి అనినారు. అయితే ఆ పని ఎవరు చేస్తారు? మీరు చేస్తారా, మీరు చేస్తారా అని తమలో తాము ఆలోచించుచుండగా ‘ఏతస్మిన్నన్తరే విష్ణురుప యాతో మహాద్యుతిః’ అంటాడు వాల్మీకి. ఇంతలోనే మహాతేజస్సుతో శ్రీమన్నారాయణుడు అచటికి వచ్చాడు అని అర్థము. ఇంతలోనే అనగా వారు అలా చర్చించుకుంటుండగానే ఇంకా ఒక నిర్ణయానికి రాకముందుగానే జగమును కాపాడే అవకాశం లభిస్తున్నదని సంతోషముతో గొప్ప తేజస్సు నలుదిశలా వ్యాపించగా స్వామి ఆవిర్భవించాడు. స్వామిని చూడగానే అందరి దిగులు తీరిపోయింది. ‘త్వాం నియోక్ష్యామహే విష్ణో!’ అనినారు. స్వామీ! నీన్ను ప్రార్థించుచున్నాము. మానవునిగా పుట్టి రావణాసురుని వధించు అని ప్రార్థించారు. ఆయన వచ్చినదే అందుకు. వారిలో వారు చర్చించుకొని ఎవరో ఒకరు నేనంటూ ముందుకు వచ్చి మానవునిలా పుట్టి రావణునితో యుద్ధము చేసి వధించజాలకుంటే మళ్ళా ఇంకొకరు. ఇలా ఒక్కొక్కరు అంటే ఎన్ని వేల సంవత్సరాలు కావాలి? అన్ని సంవత్సరాలు గడిచినా పని కాదు. దేవతల, ఋషుల బాధ తీరదు. దానిని స్వామి సహించజాలక తనకు తానుగానే వచ్చాడు. ఇతరులను కష్టపెట్టి, ఇబ్బందిపాలు చేయటం ఎందుకు? నేనే ఆ ఇబ్బంది పడుతాను అనినాడు. ఇది ఔదార్యము కాదా! ఒకరు అడుగక ముందే, కోరక ముందే తనకు తానుగా వారికి సహకరించాలి అనుకోవటం, సహకరించటం ఔదార్యం కాక మరేమిటి?
(సశేషం)