సైన్స్ అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. సైన్స్ అభివృద్ధి చెంది మనం పరిశోధనలు చేసి, సౌకర్యాల పేరుతో ప్రకృతిని ధ్వంసం చేసి, చల్లతనాన్ని, కమ్మతనాన్ని, ఇంకా చెప్పాలంటే అమ్మతనాన్ని కూడా అమ్ముకుంటూ తుఫానులు, భూకంపాలు, సైక్లోన్లు, సునామీలు, అంటువ్యాధులు పెంచుకొని సంపాదించిన డబ్బును వాటిని అంతమొందించటానికి వ్యయం చేస్తున్నాము. కడుపు నిండా తినలేము. కంటినిండా నిద్ర పోలేము. సహజమైన చల్లగాలిని, కమ్మని నీరును రుచి చూడలేము. నదుల జలము కలుషితం, గాలి కలుషితం, ఆహారం కలుషితం, ఇది కలుషితం కాదు అనేది లేదు. ఆరుబయటకు రారాదు. ఇంటిలోనే ఉండాలి. గాలి పీల్చరాదు, నీరు త్రాగరాదు. ఇదా నేను చూపిన ఔదార్యం అని స్వామి బరువుగా నిట్టూర్చే పరిస్థితి. ప్రకృతిని, అన్ని సౌకర్యాలను ప్రసాదించిన పరమాత్మ ఎంత ఉదారుడు! ఆయన ఔదార్యం మరిచిపోతున్నాము. డబ్బుతో అన్నిటిని తులతూస్తున్నాము. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అనుభవాన్ని ప్రసాదించలేని ధనపురాశులు, బ్యాంక్ అకౌంట్లు ఎందుకు? బ్యాంకు నిండా డబ్బున్నది. ఇంట కూడా వనరులున్నాయి. కాని మనసు నిండా ఈర్ష్య, అసహనం, అసూయ, ద్వేషం, స్వార్థం ఉన్నాయి. ఇంకా సంపాదించాలి అని ఎందుకు ఆ యావ. సంపాదించినదానితో సౌఖ్యము లేనపుడు సంపాదన ఎందుకు?
చల్లనినీరు, కమ్మని పండ్లు, అనుగుణమైన గాలి, అడిగినంత ఆహారం ఇచ్చే ప్రకృతిలో ఉండటం మరిచిపోయి పండ్లు కొనాలి, నీరు కొనాలి, గాలి కొనాలి, కల్లాపి చల్లే పేడ కొనాలి. ఆ డబ్బుతో వారు ఆహారం కొనాలి. ఇది భగవంతుడిచ్చిన బ్రతుకు కాదు. ఇన్ని సహజవనరులు ఇచ్చిన భగవానుడు ఎంత ఉదారుడు! నైమిశారణ్యములో గోమతీనదీ తీరానికి వెళ్ళితే ఆ నీటిలో స్నానం చేసి, ఆ చెట్ల క్రింద కూర్చొని, భాగవతం చెప్పుకొని, ఆ చెట్లు ఇచ్చిన పండ్లు తిని, ఆ చెట్ల క్రిందనే పడుకుంటే అసలు బ్రతుకు ఇది కదా అనిపించేది. నదీతీరంలో నివాసం ఆనాటి జీవనం. అందుకే ప్రతి నగరానికి ఒక నది. అయోధ్యకు సరయు, మధురకు యమున, చిత్రకూటానికి గోదావరి, వేదాద్రి, వాడపల్లి, మట్టపల్లులకు కృష్ణానదులు. ఈ నదులన్నీ భగవంతుని ఔదార్యమే. వాటిని పాడు చేసి, ఆ భగవంతుడు మాకేం చేస్తున్నాడంటే ఆ దేవుడు నవ్వడా? ప్రకృతి వనరులను చెడగొట్టుకోకుండా సైన్స్ ఉపయోగించుకోండి.
(సశేషం)