ఆనాటి కాలంలో ప్రాణులకు, మానవులకు ప్రకృతితో ఎంత చక్కని అనుబంధమున్నదో కొంత తెలుసుకున్నాము.
అరణ్యవాసమున శ్రీ సీతారామలక్ష్మణులు పంచవటికి చేరిన తరువాత రామచంద్రుడు లక్ష్మణస్వామితో లక్ష్మణా అనువైన ప్రదేశం చూసి పర్ణశాల నిర్మించుము అనినారు. ఆ అనువైన ప్రదేశమునకు రాముని వివరణము ్
వనరామణ్యకం యత్ర జల రామణ్యకం యథా
సన్నికృష్ట జలాశయం, సమిత్ పుష్ప
కుశాదికమ్, సౌమ్యా మృగాశ్చ యత్రైతే
పక్షిణ స్సజలాశయాః విహరన్తే రమంతే చ
రమతే యత్ర వైదేహీ భవాంశ్చస తథాహ్యహమ్ ॥
అనినారు. వనసౌందర్యము, జల సౌందర్యము, జలాశయాలు సమీపములో ఉండవలయును. సమిధలు, పుష్పఫలములు, దర్భలు పుష్కలంగా ఉన్న చోటు, సౌమ్యమైన మృగములు, పక్షులు, జలములో ఉండు పక్షులు, చక్కని పద్మములు, తామరలు, వాటిలో విహరించు మృగములు, పక్షులు, చక్కని పర్వతములు దగ్గరలో ఉండాలి. ఉత్పాతములు వచ్చినపుడు ఆపద కలిగినపుడు తలదాచుకొనుటకు పర్వతాలు, గుహలు, సీత, నీవు, నేను ఆనందించు ప్రదేశమును చూచి పర్ణశాల నిర్మించమని అనినారు.
ఆనాటి ప్రకృతి అందించిన వనరులను తమ ప్రశాంతజీవనానికి అనుగుణముగా మలుచుకున్నారు. అంతేకాని ఆ వనరులను ధ్వంసము చేయలేదు. చెట్లు దట్టముగా ఉంటే ఏ/సి అవసరము లేదు. ప్రకృతిసిద్ధమైన చల్లని వెచ్చని గాలి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నదీజలము, సెలయేర్ల జలము, తటాకముల, సరస్సుల జలము మెడికేటెడ్ వాటర్. ఇంక వేరే క్యూర్ అవసరం లేదు. నిరంతరం పద్మాలు సరస్సులలో, చెరువులలో ఉంటే ఆ నీరు సుగంధభరితమౌతుంది. వేపాకు, రాగాకు, జువ్వి ఆకు, ఉత్తరేణి ఆకు, గుంటకరివేరు, పొన్నగంటి, మందారము జలములో పడి సువాసన, సురుచి, సుందర పవిత్రత ఉంటుంది. మనము వనము కనపడితే కొట్టేస్తున్నాము. నరుకుతున్నాము. చెరువులను, సరస్సులను, కాలువలను, జలాశయాలను పూడ్చి ఆవాసం యేర్పరచుకుంటున్నాము. ఉన్న నీరును నివాసములతో ఆక్రమించుకొని, మరల నివాసములలో బోరు తీస్తున్నాము. ఇదేమిటి, అవివేకము కాదా! పచ్చని చెట్లను నరికి భవనాలు కట్టుకొని, ఆ భవనాల చల్లతనం కోసం ఏ/సి పెట్టుకుంటున్నాం. చల్లతనాన్ని కాంక్రీట్‌తో కప్పివేసి చల్లదనం వెతుక్కుంటున్నాము. మహావనాలను నరికేసి ఇంట్లో కొందరు చిన్న చిన్న మొక్కలు నాటుతున్నారు. ఇది దరిద్రం కొనితెచ్చుకోవటం కాదా!
వనాలలో పూలుంటాయి, కాయలుంటాయి, పండ్లు ఉంటాయి. కాని మనకు అవి వొద్దే. సహజ పంటలను వద్దంటున్నాము. పాతరోజుల్లో ఎవరింటికైనా వెళ్ళితే కాళ్ళు కడిగి, చల్లని మంచినీళ్ళు ఇచ్చి, అరటి, జామ, మామిడి, సీతాఫలాలు, సపోటా, బొప్పాయి, పనస పండ్లు ఫలహారంగా ఇచ్చి, ఆ తరువాత పక్కనే కాలువలో చల్లని నీటిలో స్నానం, పెరటి కూరగాయలతో వంట, ఆరుబయట చాప వేసుకొని పడుకుంటే యే ఏ/సి పనికొస్తుంది? ఇలా దీన్ని మనమే సంపాదన మీద యావతో ప్రకృతి ఇచ్చిన సౌకర్యాలను ధ్వంసం చేసుకుంటున్నాము. నీళ్ళలో ఇల్లు కట్టుకొని ఇళ్ళలోకి నీళ్ళొస్తున్నాయి. ప్రభుత్వం సాయం చేయాలి అంటున్నాము. ఇల్లు కట్టుకుంటున్నపుడు చెపుతున్నామా? నీళ్ళలో ఇల్లు కట్టుకొని అంటే చెరువుల్లో, కాలవల్లో ఇల్లు కట్టుకొని ఇండ్లలోనికి నీళ్ళు వచ్చినాయంటే నవ్వు రాదా? సంపాదించుకోవాలి, సౌకర్యాలు పెంచుకోవాలి.
(సశేషం)