ఇక గోయజ్ఞాలు. ఆనాటికాలంలో ప్రతి ఇంటిలో నాలుగు ఆవులుండేవి. ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవునెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు పంచగవ్యం అంటారు. సర్వరోగహరము. ఆవుపేడతో ఇల్లు అలికి, ఆవు పేడనీరు ఇంటిముందర కల్లాపి చల్లి, ఆవు పేడలతో గోపెమ్మలను పెడితే ఆవు పేడతో పాములు, విషక్రిములు వస్తాయా? ఇంటి ముందర వేపచెట్లు, ఇంటి లోపల, ప్రాకారాల లోపల ఆవులు, గేదెలు, ఇంకొంచెం లోపల పూలచెట్లు, పండ్లచెట్లు, పెరట్లో కూరగాయల చెట్లు, బాటసారులకు ఉదకకుంభం, పండ్లబుట్ట, అతిథి పూజ. ఇది భారతీయ జీవనము. ఇదియే భారతీయ యజ్ఞము. ఇందులో సమిధలు అగ్నిగుండం, నెయ్యి, ఋత్విక్కులు అవసరం లేదు. ప్రతివారు జాతి మత కులవర్గ వర్ణ వివక్ష లేకుండా ఆచరించవలసిన యజ్ఞాలు. భారతీయ జీవనంలో యజ్ఞం ఒక భాగం. కాదు కాదు, యజ్ఞంలో జీవనం ఒక భాగం.
రామాయణంలో చెపుతారు. రాముడు అడవికి పోతుంటే చెట్లు వాడిపోయినవి. ఆకులు రాలినవి. మొక్కలు ఎండిపోయినవి. అదే రాముడు తిరిగి అయోధ్యకు వస్తే ‘అకాల ఫలినో వృక్షాః ఫలవంతశ్చ పాదపాః’ అంటారు. కాలం కాని కాలంలో చెట్లు పండ్లను ఇచ్చాయి, అన్ని చెట్లు పండ్లు, పూలతో నిండినవి. ఎండిన సెలయేర్లు గలగలా పారాయి. కాళిదాసు వ్రాసిన అభిజ్ఞానశాకుంతలంలో శకుంతల అత్తవారింటికి వెళ్ళేటపుడు చెట్టు చెట్టును, లేడిని, జింకను, ఇతర మృగాలను పేరుపేరునా పిలిచి చెప్పి కన్నీరు పెడుతుంది. అవి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తాయి. రావణాసురుడు సీతను అపహరించినపుడు సీత చెట్టుకు, పుట్టకు, గుట్టకు, గోదావరికి చెపుతుంది ్ రావణాసురుడు సీతను హరిస్తున్నాడు అని రామునికి చెప్పమని. సీత దక్షిణదిక్కు వెళ్ళింది అని రామునకు మృగాలు, పక్షులే చెపుతాయి. ఆనాటి మానవజీవనంలో ప్రకృతిలో మమేకం అయ్యేవారు, చెట్లు, గుట్టలు, మృగాలు, పక్షులు మానవుల మనుగడను సాగించేవి.
(సశేషం)