కలియుగంలో యజ్ఞాలను మరిచిపోయామని అందరికీ అనుగుణంగా వ్యాసభగవానులు కొన్ని యజ్ఞాలను వివరించారు. మనది అనుకున్నది పదిమందికి అర్పించటమే యజ్ఞము. అది దేవతలకు కావచ్చు, దైవరూపంలో ఉన్న ప్రాణులకు కావచ్చు. జలయజ్ఞం, స్థలయజ్ఞం, వృక్షయజ్ఞం, ఆవాసయజ్ఞం, అన్నయజ్ఞం, వస్త్రయజ్ఞం, ఉపకారయజ్ఞం అని సప్త యజ్ఞాలను చెప్పారు. అవసరమున్న చోట బావులు, చెరువులు త్రవ్వించటం, నీరు కావలసిన చోట నీరును పారించే ఏర్పాటుచేయటం జలయజ్ఞం అంటారు. ఒకరు త్రవ్వించిన బావులలో, చెరువులలో, జలాశయాలలో ఎంతకాలం ఎన్ని ప్రాణులు ఆ జలాన్ని తాగి సేదదీరుతాయో ఆ పుణ్యాత్ముడు అంతకాలం స్వర్గంలో ఉంటాడు అని శాస్త్రం. బావులు, చెరువులు త్రవ్వించలేనివారు కనీసం తన శక్తి మేరకు రోజూ నలుగురికి దాహం తీర్చినా అది జలయజ్ఞమే. పాతరోజులలో నా బాల్యంలో ఊళ్ళలో ప్రతి ఇంటి ముందు ఒక నీటికుండ, ఒక మట్టిదో, కొబ్బరిదో గ్లాసు, దానిపై ఒక మూత ఇసుకమీద పెట్టి ఉంచేవారు. దారినపోయేవారికి దాహమైతే చల్లని నీరు తాగి ఇంటియజమానిని ఆశీర్వదించి వెళ్ళేవారు. ఆ నీరైపోతే మళ్ళీ కుండ నింపేవారు. ఒక వేసవిలోనే కాదు, చలికాలంలో, వర్షాకాలంలో కూడా అలాగే ఉండేది. ఇదంతా జలయజ్ఞమే. ఒక పదిమంది ఆ నీరు తాగినా ఇంటి యజమాని పదికాలాలు స్వర్గంలో ఉంటాడు. ఇపుడు నీరు కూడా అమ్ముతున్నారు. ఇంకా జలయజ్ఞం ఎక్కడ? నీరు లేనివారికి, కొనలేనివారికి ఒక్కరికి నీరందించినా అది జలయజ్ఞమే. ఈ యజ్ఞం అందరూ చేయవచ్చు.
(సశేషం)