Wednesday, November 20, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇంద్రజిత్తు యుద్ధానికి బయలుదేరే ప్రతిసారీ యజ్ఞం చేసే బయలుదేరి విజయం సాధించాడు. ఆ యజ్ఞం పూర్తికాకుండా అడ్డుపడితే ఇంద్రజిత్తు మరణించాడు. ఇవి చదవాలి, తెలుసుకోవాలి. ఇంద్రజిత్తును లక్ష్మణుడు చంపినాడా, యజ్ఞం చంపినదా? ఆలోచించండి. రావణాసురుడు యజ్ఞం చేసే తన శిరస్సును అగ్నికి ఆహుతి ఇచ్చి దివ్యవరాలను పొందాడు. రాముడు పర్ణశాల కట్టినపుడు, చిత్రకూట ఆశ్రమంలోనూ వాస్తు యజ్ఞం చేసే ప్రవేశించాడు. హోమధూమాన్ని చేసే భరతుడు రాముని ఆశ్రమాన్ని గుర్తించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణమంతా యజ్ఞవైభవమే. యజ్ఞవైభవాన్ని వివరించటానికే రామాయణం ఆవిర్భవించింది. అంతెందుకు? పుత్రకామేష్టి యాగముతో రామావతారం ఆవిర్భవించింది. అశ్వమేధయాగంతో రామావతారం సమాప్తమైంది. అందుకే శాస్త్రమర్యాద తెలిసినవారు యజ్ఞావిర్భావమే రామావిర్భావము, యజ్ఞ విస్తరణస్త్ర రామధర్మాచరణ. యజ్ఞసమాప్తి రామావతార సమాప్తి అంటారు. అంతగా భారతీయ జనజీవనస్రవంతిలో యజ్ఞం అంతర్లీనంగా సాక్షాత్కరిస్తుంది. ప్రతి ఆశ్రమంలో యజ్ఞం, ప్రతి ఒంటిలో నిత్యాగ్నిహోత్రం, వైశ్వదేవ దర్శపూర్ణ మాసములు, ఇంట్లో హోమాగ్ని ఎపుడూ చల్లారదు. జమదగ్ని ఒకసారి తన ఆశ్రమంలో యజ్ఞం చేసి బయటకు వెళ్ళాడు. అంతలో పెద్ద ఎత్తున వాన, గాలి వచ్చాయి. జమదగ్ని ఆశ్రమం పైకప్పు ఎగిరిపోయింది. పాపం, రేణుక హోమాగ్నిని రక్షించమని వరుణుడిని ప్రార్థించింది. అంతే, ఆ ప్రాంతంలో వర్షం లేదు. రాజభటులు వచ్చి మళ్ళీ ఆశ్రమానికి పైకప్పు నిర్మించారు. ఎవరు పంపారు అంటే రాజుగారు అన్నారు. అగ్నిని, జలమును అంత దీక్షతో కాపాడుతారు భారతీయులు. దేవతలు రక్షిస్తారు.
అయితే కలియుగంలో ఇలా ప్రతిరోజూ, ప్రతి చోటా, ప్రతి ఇంట్లో, ప్రతి ఆశ్రమంలో, ప్రతి ఆలయంలో యజ్ఞాలు చేయటం మరిచిపోయాం. ఆపద వస్తే అది తొలగటానికి యజ్ఞం చేస్తున్నారు. అది కూడా కొందరే. ఆపదలు కలిగించుకోవటం, నివారణకు యజ్ఞాలను ఆచరించటం కాదు మన సంప్రదాయం. అసలు ఆపదలు రాకుండానే యజ్ఞాలు ఆచరించాలి. పూర్వకాలంలో ఋషులు యజ్ఞాలను పూర్తిచేసుకొని బయటకు వెళ్ళేటపుడు భార్యాపిల్లలను, ఆశ్రమాన్ని అగ్నిహోత్రునికే అప్పగించి రక్షించమని వెళ్ళేవారు. నిత్యజీవనంలో అగ్నిహోత్రుడు అంతటి ప్రముఖుడు. కాని ఈనాడు ఆ స్థితే మారిపోయింది. చాలామంది ఇండ్లలో స్టౌ వెలిగించటమే మరిచిపోయారు. పూర్వము పొయ్యి మండలేదు అంటే దారిద్య్రానికి సూచన. కాని ఈనాడు పొయ్యి వెలకపోవటం ఐశ్వర్యానికి గుర్తు. అమెజాన్‌, జొమాటో, రూయోలకు ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి ఆహారపదార్థాలను తెప్పించుకుంటున్నారు. ఇక వారికి అగ్ని ఎందుకు? ఇంట్లో అగ్ని లేకుంటే వంట్లో అగ్ని అనగా తేజస్సు శక్తి తగ్గుతుంది. దానితో జ్ఞాపకశక్తి, జీర్ణశక్తి, వాచకశక్తి, శరీరశక్తి అన్నీ తగ్గుతున్నాయి. దానికి తగ్గట్టుగానే వ్యాపారప్రకటనలు ఉంటున్నాయి. బాగా బురదలో పొర్లి బట్టలనుండి బురద మరకలు అంటించుకొని వాటిని తొలగించుకోవటానికి డిటర్జెంట్‌ పౌడర్లు కొనాలి. బజార్లో దొరికినదంతా వేళాపాళా లేకుండా తిని ఎసిడిటీ రప్పించుకొని ఈనో, పెంటాల్‌ కొనుక్కొని వాడాలి. వారికి డిటర్జెంట్‌ అమ్ముడుపోవటానికి లేదా కొనటానికి మన బట్టలు మరకలు చేసుకోవాలి. పదార్థాలు తింటూ బట్టలకు పూసుకొని పౌడర్లతో పోగొట్టుకోవాలి. ఈనో కొనాలి. ఇంకొకటి కొనాలి. అందుకు అడ్డమైనవన్నీ తినాలి. మేము మీ వస్తువులు కొనటానికి తినాలి. మరకలు అంటించుకోవాలా? సమాజాన్ని మీ లాభాపేక్షతో భ్రష్టు పట్టించటం లేదా అని అడిగేదెవరు? అందరూ చూసి ఆనందిస్తున్నారు. దానికి పేరు మోసిన పెద్ద నటులు, ప్లేయర్లు భాగస్వాములు. పదార్థాల ఫ్యాక్టరీలే వాళ్ళవి. ఒక్కరైనా ఈ వ్యాధులు రాకుండా ఈ ఆహారాన్ని తీసుకోండి. రోజూ మూడుమార్లు స్నానం చేయండి. రెండుమార్లు బట్టలు ఉతుక్కోండి, ఇంట్లో వండిన పరిశుద్ధ ఆహారాన్ని తీసుకోండి, బురదకు, మురికికి దూరంగా ఉండండి అనే ప్రకటనలున్నాయా? ఎపుడైనా ఉంటాయా? రప్పించుకొని మా ఉత్పత్తులను కొనండి అంటున్నారు. రోగాలకు కావలసినవాటిని అమ్ముతారు. రోగాలు పోవటానికి మందులు అమ్ముతాం అంటున్నారు. దాన్ని మనం ఆనందంగా కొంటున్నాం. వారు ఇంకొకరి దగ్గర తింటున్నారు. రోజూ యజ్ఞధూమాన్ని వాసన చూస్తే 75% రోగాలు మటుమాయమౌతాయి. యజ్ఞశిష్టమును భుజించినవారికి యెసిడిటీ ఉండదు. ఇతర వ్యాధులుండవు. మన పూర్వకాలంలో ఋషులకు వ్యాధులున్నాయా? రాజుకు వ్యాధులున్నాయా? ఋషుల ఆశ్రమాలలో గలగలా పారే సెలయేర్లు అవన్నీ మెడికేటెడ్‌ నీరు, ప్రకృతి పులకించి ఇచ్చిన పండ్లు, కాయకూరలు కందమూలాలు, పరిశుద్ధమైన గాలి. ఒక ఆశ్రమానికి, ఇంకో ఆశ్రమానికి కనీసం 4 యోజనాలు అనగా 48 కిలోమీటర్ల దూరం ఉండేది. ఇపుడు చెప్పుకుంటున్న సోషల్‌ డిస్టెన్స్‌ అపుడు వారిలో ఉండేది. జీవనమే ఆరోగ్యసేతువు కావాలి. జీవనంలో ఆరోగ్యసేతువు కాదు.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement