Sunday, November 10, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

భారతీయ జీవనము యజ్ఞముతో ముడిపడిఉన్నది అని చెప్పినాను. అసలు పరమాత్మ మనకు యజ్ఞమును పరిచయము చేయుటయే గొప్ప ఔదార్యగుణము. నీకు లభించినదానిని తీసుకొని నాది అనుకోకుండా ఎక్కడినుండి లభించినదో అక్కడ కూడా కొంత ఈయటమే యజ్ఞము అంటే. వర్షము వలన చక్కని వాతావరణమును అనగా గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశము సహకరించితే మన చేతికి పంట వస్తుంది. ఆ పంచభూతములను లోకకళ్యాణమునకు అనుగుణముగా మలిచేవారు ఆ పరమాత్మయే. పరమాత్మ సాక్షాత్తుగా కాకుండా ఇంద్రాది దేవతారూపములో మనకు పాడిపంటలనిస్తున్నారు. ఆ పంటలో కొంత పురోడాశరూపముగా, పాడిలో కొంత నెయ్యి రూపముగా దేవతలకు యజ్ఞరూపములో ఆహుతి అర్పిస్తే దానిని తీసుకున్న దేవతలు తాము తీసుకొన్నదానికి నూరింతలు వేయింతలు మళ్ళీ మనకిస్తున్నారు. మనము భూమిలో ఒక క్వింటాలు ధాన్యం విత్తనాలుగా వేస్తే 100 క్వింటాళ్ళు, ఇంకా ఎక్కువే మనకు భూమి ఇస్తున్నది. అది ఒక్క భూమే ఇస్తున్నదా? దేవతలందరూ ఇస్తున్నారు. మరి వారికి కొంత ఇస్తే వారు మరింత ఇస్తారు. ఈ విషయం తెలియక యజ్ఞాలలో క్వింటాళ్ళ నెయ్యి వ్యర్థం చేస్తున్నారు. అభిషేకాల రూపంలో పాలు, పెరుగు వ్యర్థం చేస్తున్నారు. అవి బీదవారికి ఈయవచ్చు కదా అని తమకు తోచినట్లు మాట్లాడుతున్నారు. ఎంత పండుతున్నది, ఎంత పాడి వస్తున్నది? అంతా అభిషేకాలకు, యజ్ఞాలకే వ్యయం చేస్తున్నారా? నిజంగా పేదసాదలకు ఈయాలంటే ఇవి అడ్డమొస్తున్నాయా? ప్రతి యజ్ఞంలో అన్నదానం ఉంటుంది. ప్రతి ఉత్సవంలో అన్నదానం ఉంటుంది. ఇవన్నీ యజ్ఞాలే కదా! అంతగా బాధపడిపోయేవారు ఎంతమందికి పాలు పోస్తున్నారు? అన్నం పెడుతున్నారు? తామేది చేయకుండానే కొంత చేసేవారిని విమర్శించటం కుసంస్కారం కాదా! అందుకే అన్నదానం యజ్ఞమే. క్షీరదానం యజ్ఞమే. పసిపిల్లలకు పాలు పోసి పేపర్లలో ఫోటోలు, టీవీలలో ప్రచారాలు ఎందుకు? ఎవరికి తెలియాలి? అంతర్యామి అంతరాత్మ వానికి తెలుసు. ఏమి చేస్తున్నావు, ఎంత చేస్తున్నావు? స్వామీ! నీవే చేయిస్తున్నావు అనుట కూడా యజ్ఞమే.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement