Saturday, November 9, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

అశ్వమేధమును గురించి చెప్పుకున్నాము. పుత్రకామేష్టి గురించి తెలుసుకుందాము. పుత్రకామనతో చేయు ఇష్టి పుత్రకామేష్టి అని సామాన్యార్థము. పుత్రులను కోరి యాగమును చేయుట. ఇది సామాన్యార్థము. పుత్రకామననే ఇష్టిగా చేయుట. అనగా పుత్రకామననే అగ్నికి అర్పించుట. అనగా ప్రతి ప్రాణికి మూడు కోరికలుంటాయి. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని. దాంపత్యమును కోరుట, అనగా దాంపత్యసుఖమును కోరుట, ధనమును కోరుట, పుత్రులను కోరుట. ప్రపంచమంతా ఈ మూడు కోరికలతోనే నడుచుచున్నది. ఈ మూడు కోరికలను అగ్నికి అనగా పరమాత్మకు అర్పించుటే పుత్రకామేష్టి. అందుకే దశరథుడు పుత్రుల కోసం యాగం చేశాడా. పుత్రులు పోవాలని యాగం చేశాడా ఆలోచించండి. పుత్రులు కావాలి అని చేస్తే పుత్రులు పుడితే కోరిక తీరుతుందా? ఆ పుత్రులు జీవితాంతం తనవద్ద ఉండొద్దా మరి! ఉన్నారా? అందుకే దశరథుడు పుత్రులను కోరి యాగము చేయలేదు. పుత్రుల కోరికను యాగము చేసినాడు. పరమార్థాన్ని పుస్తకాల ద్వారా తెలియజాలము. పుస్తకములలో దాని వ్యాఖ్యానములలో ముఖ్యముగా నేటి వ్యాఖ్యానములలో విపరీత వ్యాఖ్యానములు, వక్రవ్యాఖ్యానములే దర్శనమిస్తాయి. రాముడు విదేశీయుడని, మన దేశంమీద దాడిచేశాడని కొత్తవాదం ప్రచారంలో ఉంది. రావణాసురుడు దళితుడు అని… ఇటువంటి విపరీత వ్యాఖ్యానాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అసలు రామాయణకావ్యం వ్రాసిన వాల్మీకి ఇప్పటివారికి తెలియదు. వేదము చెపుతుంది ‘అలూక్షాః ధర్మకామాస్స్యః’ అని. లోభము లేనివారు, ధర్మమును కోరువారు మాత్రమే ధర్మమును ఉపదేశించవలయును. అందుకే అటువంటివారితోనే ధర్మమును, ధర్మరహస్యమును తెలియాలి, వినాలి. తనకు తోచిన దేశకాలానుగుణ వ్యాఖ్యలు ధర్మవివరణ కాదు. తాము ఆచరించుచున్న, అనుసరించుచున్న, ఆచరించాలి అనుకుంటున్న వాటిని సమర్థించుకొనుటకు తమకు తోచిన వ్యాఖ్యానము చేయుచున్నారు. దానివలననే ఈ అశాంతి, అలజడి, కలహాలు, కలతలు, కల్లోలాలు, కరోనాలు కూడా!

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement