Tuesday, December 3, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

శ్రీ రామావతార ఔదార్యాన్ని గురించి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ
ఇంతవరకు పరశురామావతారంలోని ఔదార్యగుణాన్ని తెలుసుకున్నాము. ఇక శ్రీరామావతారంలో అద్భుతంగా ఈ ఔదార్యగుణం సాక్షాత్కరిస్తుంది. అన్ని అవతారాలకు ప్రధాన బీజం యజ్ఞమే. వామనావతారానికి అదితి, కశ్యపుల యజ్ఞమే కారణము. బలి నిగ్రహానికి బలి యజ్ఞమే వేదిక అయింది. యజ్ఞములోనే బలిని అనుగ్రహించారు. బలిని అనుగ్రహించిన తరువాత కూడా బలి యజ్ఞాన్ని దగ్గర ఉండి పరిపూర్ణం చేశారు. దీనితో భారతీయ సంప్రదాయంలో యజ్ఞానికున్న ప్రాధాన్యం వేనోళ్ళ చాటబడుతున్నది. రామావతారానికి కూడా పుత్రకామేష్టి, దానికన్నా ముందు అశ్వమేధం కారణము అని తెలియాలి. అశ్వమేధం అనగానే గుఱ్ఱాన్ని అగ్నిలో ఆహుతి ఈయటమే అందరికీ తెలిసిన విషయము. కాని బృహదారణ్యకోపనిషత్తు అశ్వమేధమును అద్భుతముగా వర్ణించినది.
‘ఉషా వా అశ్వస్య మేధ్యస్య శిరః’ అని ప్రారంభిస్తారు. కాలమును అశ్వముగా రూపకము చెప్పినారు. కాలము అనే అశ్వమునకు ఉషఃకాలము శిరము. ఇట్లు సూర్యోదయము కంఠము. సంగవనము నేత్రములు, ప్రాతఃకాలము శ్రోత్రములు, పూర్వాహ్ణము కేసరములు అనగా జూలు. ఇట్లు సకలావయవములను అశ్వముగా పోల్చి ఆ కాలమును పరమాత్మయను అగ్నిలో ఆహుతి చేయుట అనగా భగవంతుని ఆరాధనతో కాలమును గడుపుట అశ్వమేధము అనినారు. ఇక ఇంకొక అశ్వమేధము ‘ఇంద్రియాణి హయాన్యాహుః’ అని శ్రుతివాక్యము. ఇంద్రియములు అశ్వములు, జ్ఞానము అగ్ని. ఇంద్రియములను అశ్వములను జ్ఞానాగ్నిలో ఆహుతి చేయుట అశ్వమేధము యజ్ఞమే. భోగ్యమైన పదార్థమును భుక్త అయిన పరమాత్మలో ఆహుతి చేయుట అశ్వమేధము. పరమాత్మే అగ్ని, సకల జీవులు, ప్రకృతి అశ్వములు. అశ్వము అనగా శ్వ లేనిది. అనగా రేపు లేనిది. అనగా రేపటికి లేనిది అనిత్యమైన ప్రకృతి, దానితో జీవునికున్న సంబంధము అనిత్యమే. ఇదంతా అశ్వమే. ఆ అశ్వమును పరమాత్మకు అర్పించుటే అశ్వమేధము. ఇలా ప్రపంచము అశ్వము, పరమాత్మ అగ్ని. అర్పించుట యాగము. మనది అనుకున్నదల్లా పరమాత్మకు అర్పించుట యాగము. ఇది మనది అనుకొనుట భోగము. భోగము అశాశ్వతము. యాగము శాశ్వతము. అందుకే రామావతారమంతా యాగవైభవమే. అశ్వమేధయాగము పుత్రకామేష్టితో రామావతారము ప్రారంభించబడుచున్నది.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement