Tuesday, November 5, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

మన వక్షస్స్థలము యజ్ఞవేదిక, రోమములు దర్భలు, భుజించాలి అనే కోరిక నెయ్యి, శ్రద్ధ పప్పు, రుచి కూర, ఆకలి చారు, దీక్ష మజ్జిగ. ఇట్లు యజ్ఞసామగ్రితో చేసేది అన్నయజ్ఞము. ఇందులో గొప్ప విజ్ఞానశాస్త్రము ఉంది. వైశ్వానరుడు ప్రాణాహుతులకు ఆధారం. మన కడుపు పాత్ర. ఆ పాత్రలో ఆచమనము అనే నీరు పోయాలి. తరువాత ప్రాణాహుతులతో అన్నమును వేసి ప్రాణాది వాయువులతో అగ్నిని ప్రజ్జ్వలింపచేయాలి. సరిగ్గా ప్రజ్జ్వలించటానికి నెయ్యి వేయాలి. ఇట్లు అడుగున జలము, ఆ అడుగున పాత్ర, పాత్రలో జలము. పాత్ర అడుగున అగ్ని, అగ్ని మండటానికి ప్రాణాహుతిగా వాయువు. పాత్ర, నీరు, బియ్యము, అగ్ని, గాలి ఇది వంట చేసే విధానం. అలా వండిరది ఆ పరమాత్మకు అర్పించాలి. కాదు కాదు పరమాత్మే వండి అనగా వైశ్వానర రూపములో ఉడికించి మనకు పెడుతున్నాడు. ఇది అన్నయజ్ఞము. ఈ భావనతో వైశ్వానర ఆరాధన చేయాలి. భోజనం చేయటమంటే ఇది. ఎందరికి తెలుసు? తెలిసినవారు కూడా ఎందరు ఆచరిస్తున్నారు? మొదట గొంతు జారటానికి, అడ్డు తొలగటానికి ఆచమన రూపంలో నీరును గొంతునుండి కడుపులో జారుస్తాము. ద్రవం లోపలికి వెళ్ళి అన్నవాహికను అనగా అన్ననాళికను అన్నద్వారాన్ని శుభ్రం చేసిన తరువాత ఘనాన్ని ఆహారరూపంలో పంపుతాం. తరువాత అనగా భోజనం అయిన తరువాత మళ్ళీ ఆచమనం చేస్తాం. దీనివల్ల మనం చేసిన భోజనంలో గొంతులో యేదో మూలలో చిక్కుకున్న పదార్థాలు తొలగుతాయి. ఇది సైన్సు. అది ఆచారము. రెండు ఆరోగ్యసూత్రాలు తెలుసుకోవాలి. ఆచరించాలి. అందుకే యజ్ఞముతో ప్రజలను సృష్టించాను అన్నాడు పరమాత్మ. ఈ యజ్ఞాన్ని అందరూ చేయాలి. అందరూ చేస్తారు. దీనికి పైన చెప్పినట్లు మన కడుపే యజ్ఞగుండం. వైశ్వానర రూప పరమాత్మయే అగ్నిహోత్రుడు. మన ఆహారమే హవిస్సు. అందుకే పూర్వకాలములో యజ్ఞములే జీవనము. యజ్ఞముల కోసం రాజ్యాలను, రాజులను, ప్రాణాలను త్యాగం చేశారు. భారతదేశ సంపద అంటే యజ్ఞమే. ఆ యజ్ఞమునకు కావలసిన హవిస్సును అందించేది గోవు. అందుకే గోవును ‘మాతా రుద్రాణాం దుహితా వసూనాం’ అంటూ వేదం స్తుతిస్తున్నది.
ఆ యజ్ఞ హవిః ప్రభావంతో పుట్టిన పరశురాముడు, విశ్వామిత్రుడు ఎంత ఆరాధన చేశారో తెలుసుకుందాం. విశ్వామిత్రుడు క్షత్రియునిగా పుట్టి కూడా వసిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ నందిని అనే గోవును చూసి అది తనకు కావాలని, దాని కొరకు యుద్ధం చేసి ఆ యుద్ధంలో పరాజయం పాలై తపస్సు చేసి బ్రాహ్మణత్వాన్ని పొందాడు. యజ్ఞ హవిస్సుతోనే అనగా ఆవు నెయ్యి, గోవుల వలన అనగా వృషభాల వలన వచ్చిన పంటతో సిద్ధమైన పురోడాశంతో పుట్టిన విశ్వామిత్రుడు ఆ గోవు ప్రభావంతోనే బ్రాహ్మణుడయ్యాడు.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement