Friday, October 18, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఋషులు, దేవతలు వరం ఇవ్వడం ఎంత ఔదార్యమో, శాపం ఇవ్వడం కూడా అంతటి ఔదార్యమే. చాలామంది తెలియక ఋషులు పరమకోపిష్టులు, తపస్సు చేసేవారికి అంత కోపము తగినదా అని అడుగుతారు. కాని శాపములో రెండు ఇమిడివున్నాయి. చేసిన తప్పునకు శిక్ష, వానిలో తప్పు చేసే గుణమును తప్పించి భక్తిని, గౌరవాన్ని కలిగించుట. న్యాయముగా ప్రతి శాపము వరమే. పెద్దల ప్రవర్తనను అర్థము చేసుకొనుటకు సంస్కారము కావాలి. స్వార్థము, ఆవేశము కాదు. ఇంద్రద్యుమ్న మహారాజును అగస్త్యమహర్షి యేనుగుగా పుట్టమని శపించాడు. హూహూ అను గంధర్వుని మకరముగా పుట్టమని మరొకరు శపించారు. ఇద్దరికీ పరమాత్మ దర్శనముతో శాపవిమోచనమును ప్రసాదించారు. పరమాత్మ దర్శనము అంటే మోక్షమే కదా! ఇంద్రద్యుమ్నుడు మోక్షమును కోరే తపస్సు చేస్తున్నాడు. అగస్త్యమహర్షి పరమాత్మ దర్శనమును శాపము ద్వారా ప్రసాదించారు. మకరమునకు పరమాత్మ చక్రముతో మోక్షమును ప్రసాదించారు. మకరము పదివేల యేండ్లు గజేంద్రుని పాదమును పట్టుకొని లోకదృష్టిలో పీడిరచినది. శాస్త్రదృష్టిలో ఒక పరమభక్తుని పాదమును పదివేలేండ్లు పట్టుకొని సేవించినది. భక్తుని పాదమును అంత కాలము సేవించినవారికి భగవంతుని దర్శనము, ముక్తి కాక మరేమి లభిస్తాయి? ఈ రెండూ ఋషిశాపము వలననే లభించాయి. ఇప్పుడిది శాపమా, వరమా ఆలోచించండి. భక్తులు వచ్చినపుడు, అందులో మహర్షులు వచ్చినపుడు భగవంతుని ధ్యానములో ఉన్నా, తపస్సులో ఉన్నా అన్నిటినీ విడిచి ఆ భక్తులను పూజించాలి అనేది ధర్మశాస్త్రము. భగవంతుడు చాలా స్పష్టముగా చెప్పి ఉన్నాడు. నన్ను పూజించకున్నా ఇంకా చెప్పాలంటే నిరాదరణ చేసినా, అవమానము చేసినా నేను పట్టించుకోను. నా భక్తులకు చిన్న అవమానము జరిగినా నేను సహించను. వెంటనే శిక్షిస్తాను అన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ అవమానానికి వారి రూపాలలో తానే శాపరూపములో అనుగ్రహిస్తాను అన్నారు. గుడిలో ఉన్న విగ్రహాలలో, చిత్రపటాలలో, ఇతర దేవతామూర్తులలో మాత్రం నన్ను చూచి ఆరాధిస్తూ కదిలి వచ్చే నా భక్తులలో నన్ను చూడలేక వారిని అవమానించేవారు నా భక్తులే కాదు అన్నాడు.
సత్యలోకములో ఒకసారి బ్రహ్మ సమస్త దేవదానవ యక్ష గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధర గరుడులను ‘‘అందరం కలిసి పరమాత్మ నామయజ్ఞం చేదాం రండి, దంపతులుగా రండి’’ అని ఆహ్వానిస్తే అందరూ బ్రహ్మ ఆజ్ఞను తలదాల్చి సకుటుంబంగా వచ్చారు. కొన్ని లక్షలమంది, ఇంకా చెప్పాలంటే కోట్లమంది వచ్చారు. అందరూ పరవశంతో నామయజ్ఞమును చేస్తున్నారు. వారిలో కుబేరపుత్రులు నలకూబర, మణిగ్రీవులు ఇంతమందిలో మమ్ములను చూచేవారెవరు, తెలిసేవారెవ్వరు అని తమ భార్యలతో కలిసి జలక్రీడలకు వెళ్ళారు. అది గమనించిన నారదమహర్షి వారికి బుద్ధి చెప్పి అనుగ్రహించాలని వారిద్దరినీ గోకులంలో మద్దిచెట్లుగా పుట్టమని, పరమాత్మ కృష్ణావతారంలో మీ వద్దకు వచ్చి శాపవిమోచనం చేసి అనుగ్రహిస్తాడని శపించి వెళ్ళాడు. ఇది ఆగ్రహమా, అనుగ్రహమా? మీరే ఆలోచించండి.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement