Friday, November 22, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

అందుకే గీతలో స్వామి ఇలా ఉపదేశిస్తారు.

                దేవాన్‌ భావయతానేనతే దేవా భావయన్తువః

పరస్పరం భావయన్తః శ్రేయః పరమవాప్స్యధ.

                ఈ యజ్ఞముతో దేవతలను ఆరాధించండి. ఆ దేవతలు మీకు కోరిన కోరికలనిచ్చి మిమ్మల్ని గౌరవిస్తారు. ఇలా ఒకరినొకరు సంభావించుకుంటూ గొప్ప శ్రేయస్సును పొందండి అన్నాడు. శ్రేయస్సును పొందండి అనలేదు. పరమ శ్రేయస్సును అన్నారు. పరమ శ్రేయస్సు అనగా మోక్షమే. పుట్టుక లేకుండా చేసుకోవటమే పుట్టుకకు పరమ శ్రేయస్సు. పుట్టుక అంటే ఆత్మను శరీరంలో చేర్చుట. శరీరాన్ని విడిచిపెట్టుట మరణం. ఇంకా బాగా చెప్పాలంటే శరీరం అంటే వస్త్రం. ఆత్మ వస్త్రమును ధరించేవాడు. శరీరమంటే ఇల్లు. ఆత్మ అంటే ఇంటివాడు. ఉత్తమ జన్మ కావాలి అని యజ్ఞం చేశాం అంటే కాస్ట్‌లీ డ్రస్‌ లేదా కాస్ట్‌లీ ఇల్లు కోరుకున్నట్లే కదా! వస్త్రం ధరిస్తే చాలా? మంచి వస్త్రం కొంటే చాలా? మంచి వస్త్రధారి కావద్దా? వస్త్రం ధరించే శరీరం రోగాలతో, రొష్టులతో, పుండ్లతో, గడ్డలతో, క్షయ కుష్టులతో ఉంటే ఎంత గొప్ప వస్త్రం ధరించినా సంతోషం కలుగుతుందా? ఇల్లు మహేంద్రభవనంలా ఉండి, ఇంటి యజమాని గుడ్డి, కుంటి అయితే ఆ ఇల్లు ఆనందాన్ని ఇస్తుందా? అంటే ఇంటి యజమాని ఆరోగ్యంగా ఉంటే ఇల్లైనా, వస్త్రమైనా సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా కొంచెం లోతుగా పోదాం. శరీరం ఆరోగ్యంగా ఉంది, అంటే మంచి ఇల్లున్నది. మంచి వస్త్రాలున్నాయి. కాని భార్య లేదా భర్త గయ్యాళి, దుష్టుడు, పుత్రుడు దుర్మార్గుడు, బంధువులు, పాలించే రాజు పన్నుల రూపంలో పీడిస్తున్నారు. సుఖశాంతులుంటాయా? ఇవన్నీ బాగున్నాయి. కాని వానికి ఆశ, కోరిక, అసంతృప్తి నిండుగా ఉన్నాయి. సుఖంగా వుండగలడా?

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement