Friday, November 1, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

సాయంత్రం ఋచీకమహర్షి ఇంటికి వచ్చాడు. భార్యను చూశాడు. ఆమె మోములోని తేజస్సును చూసి ఆశ్చర్యపోయాడు. జరిగినదాన్ని తెలుసుకున్నాడు. సత్యవతీ! చాలా తప్పు చేశావు. నా మాటను, నా తపస్సును, నా యజ్ఞాన్ని ప్రక్కన పెట్టావు. శత్రుసంహారం చేయగల ప్రచండక్షాత్రమున్న కొడుకు పుట్టాలని మీ తల్లి హవిస్సును సిద్ధం చేశాను. ఉత్తమ బ్రాహ్మణుడు, తపస్సంపన్నుడు కావాలని నీ హవిస్సు మంత్రించాను. ఇప్పుడు ఆ హవిస్సును తారుమారు చేశావు. నీ తల్లికి క్షత్రియుడు పుట్టినా హవిః ప్రభావం వలన బ్రాహ్మణుడౌతాడు. నీకు బ్రాహ్మణుడు పుట్టినా మహా ఉగ్రుడు, క్షత్రియధర్మాన్ని ఆచరించేవాడు పుడతాడు అని చెప్పాడు. నన్ను క్షమించండి స్వామి! మీ ప్రభావాన్ని తెలియక కన్నతల్లి మీద ప్రేమతో అలా చేశాను. నాకు అలాంటి కొడుకు వద్దు. హవిః ప్రభావం తప్పదు అంటే అంతటి ఉగ్ర క్షత్రియగుణ సంపన్నుడు మనవడుగా పుట్టనీయండి. అలాంటి కొడుకొద్దు అని ప్రాధేయపడిరది. భార్య మాటను మన్నించి అలాగే మనవడు మహోగ్రుడు అవుతాడు అన్నాడు. అలా సత్యవతి, ఋచీకుల పుత్రుడే జమదగ్ని. మహాతపస్సంపన్నుడు. ఆ జమదగ్ని, రేణుకల పుత్రుడు పరశురాముడు. బ్రాహ్మణునిగా పుట్టి కూడా క్షత్రియధర్మంతో దుష్టసంహారం చేశాడు. ఇక గాధికి పుట్టిన పుత్రుడే విశ్వామిత్రుడు. సుక్షత్రియునిగా పుట్టి కూడా హవిః ప్రభావముతో శుద్ధమైన బ్రాహ్మణుడై రామునికే గురువయ్యాడు.
ఇలా సంతానం సంసారం, సౌభాగ్యం, సౌజన్యం, సంస్కారం, సంపదలు, సార్వభౌమాధికారం ప్రపంచంలోని సకల సౌకర్యాలు సకల మానవాళి జీవితాలు మూడు పూవులు ఆరు కాయలుగా వెలిగాయంటే అందుకు మూలం యజ్ఞమే. యజ్ఞాలతో మానవులు దేవతలను ఆరాధిస్తే ఆ దేవతలు వర్షాలతో, పంటలతో, పాడితో ఇతర సంపదలతో ప్రాణులను సంతోషపెడ్తాయి. ఇది నా మాట కాదు. సాక్షాత్తుగా శ్రీకృష్ణభగవానుడే గీతలో ఇలా ఉపదేశించాడు.
సహ యజ్ఞేౖః ప్రజాస్సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః
ఆనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తు ఇష్టకామధుక్‌.
అని. అనగా సృష్టి ప్రారంభంలో బ్రహ్మ యజ్ఞములతో ప్రజలను సృష్టించి ఈ యజ్ఞములతో ఆరాధించండి. ఈ యజ్ఞమే మీ ఇష్టమైన కోరికలను ప్రసాదిస్తుంది అని చెప్పారు. అంతేకాదు బ్రహ్మ సృష్టించబడిన తరువాత నారాయణుని కొరకు తపస్సు చేశాడు. తపస్సు అన్నా యజ్ఞమే కదా! ‘యజదేవ పూజాయాం’ అని కదా ధాతువు. దైవారాధనే యజ్ఞం. అలా నారాయణుని గూర్చి తపస్సు చేస్తే నారాయణుడు సాక్షాత్కరించాడు. అతన్ని పూజించాలి కదా! స్వామీ! పూజాసామగ్రి లేదు. మీరు ప్రసాదిస్తే మిమ్ములను పూజిస్తాను అని ప్రార్థించాడు. స్వామి తన దివ్య అవయవాలనుండి యజ్ఞసామగ్రిని బ్రహ్మకు అందించాడు. స్వామి ఇచ్చిన ద్రవ్యంతో స్వామినే పూజించాడు బ్రహ్మ. ద్రవ్యములతో పూజించటం యజ్ఞము కదా! ఆ ద్రవ్యములు స్వామియే కదా! పూజించబడే స్వామి కూడా యజ్ఞమే అంటే యజ్ఞముతోనే యజ్ఞమును పూజించారు అంటుంది వేదం. ‘యజ్ఞేన యజ్ఞమయజన్త దేవా’ అంటుంది. దేవతలు యజ్ఞముతోనే యజ్ఞముని ఆరాధించారు అని అర్థము. అంటే సృష్టికి మూలం యజ్ఞము సృష్టి యజ్ఞము. యజ్ఞముతో సృష్టి. ఇది ఒక చక్రము.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement