Monday, November 25, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇపుడు పరశురామ అవతారానికి నాంది జరిగినది. అనగా ఉపోద్ఘాతం పరిచయం జరిగినది. పరమాత్మ అవతార రహస్యాలను పెద్దల ద్వారా విని తెలుసుకోవాలి కాని ఏదో పుస్తకాలు చదివితే, వక్రవ్యాఖ్యానాలు చేసేవారినుండి వింటే అపార్థాలు, అపోహలు మాత్రమే కలుగుతాయి. సత్యవతిని వివాహం చేసుకొన్న ఋచీకమహర్షి ఉత్తమ సంతానాన్ని కలిగించటానికి హోమద్రవ్యమును, దీనిని చరువు అంటారు, దాన్ని సిద్ధము చేస్తున్నాడు. ఆ సంగతి తెలిసిన సత్యవతి తల్లి నాకు కూడా పుత్రసంతానము లేదు కదా! ఉత్తమ క్షత్రియుడు, సుపరిపాలకుడైన పుత్రుడు లభించటానికి నాకు కూడా నీ భర్తతో చెప్పి చరువును అనగా హోమద్రవ్యమును మంత్రపూతముగా చేసి అందించమని కోరినది. ఋచీకుడు అలాగే అన్నాడు. రెండు పాత్రలలో వేరు వేరుగా చరువును మంత్రపూరితముగా సత్సంకల్పముతో ఒక సంవత్సరము ప్రతినిత్యము అగ్నిహోత్రుని ఆరాధించి హోమద్రవ్యమును సిద్ధము చేశాడు.
గాధి అంటే సాక్షాత్తు బ్రహ్మ అవతారమే అని, బ్రహ్మ వరముతో ఇంద్రావతారమని రెండు గాథలున్నాయి. ఉత్తమ పాలకుడు అతనికి ఉత్తమ క్షత్రియుడు, దుష్టశిక్షకుడు కలగాలని సంకల్పించాడు. దీక్ష పూర్తయిన తరువాత భార్యతో బాగా చూడు, గుర్తుంచుకో. ఇది నీవు భుజించవలసిన హవిస్సు. ఇదిగో ఇది మీ తల్లిగారికివ్వు. జాగ్రత్తగా వారు ఈ ప్రసాదం తీసుకొన్న తరువాత ఒక సంవత్సరం అత్యంత నియమనిష్ఠలతో, ఆచారంతో ప్రవర్తించాలి. అపుడు కోరుకున్న గుణాలు కల పుత్రుడు కలుగుతాడు అని చెప్పాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. స్త్రీ పురుషులకు యిలలో సంతానం కలుగుతుంది. సత్సంతానం కలగాలంటే ధర్మప్రవృత్తి, న్యాయప్రవృత్తి, సదాచారప్రవర్తన ఉండాలి. ఈ కాలంలో సంతానం వద్దురా దేవుడా అంటే కలుగుతున్నది. కాని సమాజాన్ని భ్రష్టు పట్టించేవాళ్ళే ఎక్కువగా పుడుతున్నారు. కేవలం కోరిక, సంకల్పం సరిపోదు. దానికి దైవసహకారం కావాలి. అందుకే ఋచీకుడు యజ్ఞమును ఆచరించి అగ్నిహోత్ర ప్రసాదాన్ని ఇచ్చాడు. ఒకటికి రెండుమార్లు జాగ్రత్తలు చెప్పి తాను తపస్సునకు వెళ్ళాడు. తరువాత సత్యవతి తన తల్లిని పిలిచి విషయము చెప్పి ఆమె పాత్ర ఆమెకిచ్చింది. అయితే ఆమె మనసులో ఓ ఆలోచన వచ్చినది. ఆ ఆలోచనను బిడ్డ ముందు ఉంచినది. ఎంతైనా నేను అత్తను కదా! నీవు భార్యవు. నీకు మంచి సంతానము కలగాలని మీ ఆయన కోరుకుంటాడు. అందుకే నీ చరువులో అగ్నిహోత్రశక్తి, తపశ్శక్తి ఎక్కువ ఉంచి ఉంటాడు. ఇవి మనం మార్చుకుందాం. నీ పాత్ర నాకివ్వు. నా పాత్ర నీవు తీసుకో. ఎలాగూ నీకు బ్రాహ్మణ పుత్రుడు కలుగుతాడు కదా! అతనికి బాధొస్తే మా పుత్రుడు, మేము కాపాడుతాము. రాజు పరిపాలకుడు, సమర్థుడు కావాలి కదా అని కూతురును వేడుకున్నది. తల్లి మాటను కాదనలేక అలాగే తీసుకో, దానిదేముంది. కావాలంటే నేను నా భర్తను మళ్ళీ అడుగుతాను అని తన పాత్రను తల్లికిచ్చినది. తల్లి పాత్రను తాను తీసుకొని భుజించినది. తల్లి ఆ ద్రవ్యమును భుజించి వెళ్ళిపోయినది.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement