Monday, November 25, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

అప్పుడు సుదర్శనుడు ‘‘అసలు కాదు. పరమాత్మ తాననుకున్నవాటితో తాననుకున్న పని చేస్తుంటాడు. అక్కడ ‘కర్త కారయత కరయ’ అంతా స్వామే. అంతా స్వామి సంకల్పమే. మనం నిమిత్తమాత్రంగా ఆయన చేతిలో ఉంటాము’’ అన్నాడు భక్తితో. ‘‘నిజమేనయ్యా! అలా అయితే మరి నీవెందుకు? నీవు లేకుండా, ధనువు లేకుండా అసలు యుద్ధమే లేకుండా సంహరించమనవయ్యా!’’ అన్నాడు నారదుడు.
‘‘ఆ అలా అన్నావు బాగుంది. కాని ఎవరనాలి?’’ అన్నాడు సుదర్శనుడు. ‘‘ఎవరో ఎందుకు నీవే అను’’ అన్నాడు నారదుడు. ‘‘ఏమనాలి’’ అన్నాడు సుదర్శనుడు. ‘‘నీవు లేకుండా ఒక్క రాక్షసుణ్ణి సంహరించమను. ఏ ఆయుధం లేకుండా సంహరించమను. స్వామీ! నా కోరిక తీర్చండి అని ప్రార్థించు. నీ మాట స్వామి మన్నిస్తాడు. అపుడు స్వామి యే ఆయుధం తీసుకున్నా నీ అంత శక్తిమంతం కాదు కదా!’’ అన్నాడు నారదుడు.
‘‘ఆ శక్తి నాది కాదు, స్వామిది. స్వామి తాకితే, సంకల్పిస్తే చాలు ఏది ఏదైనా అవుతుంది. పర్వతాన్ని పామును చేయగలడు. పామును పర్వతం చేయగలడు’’ అన్నాడు సుదర్శనుడు. ‘‘ఓహో వెంకటాచలానికి వెళ్ళావా? ఒకసారి స్వామి నడుగు’’ అన్నాడు నారదమహర్షి. ‘‘మహర్షీ! నీతో కూడా ఈ మాటలు స్వామియే పలికిస్తున్నాడు. ఏం జరగాలో? ఆయన సంకల్పం లోకకల్యాణమే కదా! అలాగే ప్రార్థిస్తాను’’ అన్నాడు సుదర్శనుడు.
ఇంతలో స్వామి రానే వచ్చాడు. ఇరువురూ లేచి స్వామికి సాష్టాంగప్రణామాలు చేశారు. నారదుడు అనుమతి తీసుకొని వెళ్ళిపోయాడు.
‘‘ఏమి సుదర్శనా! నారదుని మంత్రాంగం ఏమిటి? ఊరక రారు కదా!’’ అన్నారు చిరునవ్వుతో స్వామి. ‘‘క్షమించి ఈ దాసుని విన్నపాన్ని మన్నించాలి. ఇది కేవలం నా ప్రార్థనే. మీరు సర్వకారణము, సర్వకర్త, సర్వశక్తుడవు. ఒకసారి లోకానికి మీ లీలలను చూపాలి స్వామీ! అలా కొందరు తరిస్తారు’’ అన్నాడు సుదర్శనుడు. ‘‘ఊ సరే, చెప్పు’’ అన్నాడు స్వామి. అందరిని, రాక్షసులను నాతోనే సంహరిస్తున్నారు కదా! నేను లేకుండా, నన్ను తీసుకోకుండా ఒకరిని సంహరించి చూపండి స్వామీ! నా కోసం, నా వేడుక కోసం’’ అన్నాడు చేతులు జోడిస్తూ సుదర్శనుడు. ‘‘ఓహో! నారదుడు సూత్రధారుడయ్యాడు. సంతోషం! అలాగే నీ మాటను మన్నిస్తాను. ఎవరినో ఎందుకు నిన్నే సంహరిస్తాను. నీ సందేహం తీరుతుంది కదా’’ అన్నాడు స్వామి.
‘‘నన్నా! సంహరిస్తారా?’’ అడిగాడు ఆశ్చర్యంగా సుదర్శనుడు. ‘‘అవును నాయనా! కంగారుపడకు. ఇపుడు భూలోకంలో ఒక అవతారం కావాలి. నీవే వెళ్ళి నా పని పూర్తిచేయి. నీ కోసం నేను రెండుసార్లు పుడతాను. ఒక అవతారంలో నీకు తపస్సు, సర్వశక్తులు ప్రసాదిస్తాను. దానితో గర్వం పెరుగుతుంది. నీ గర్వాన్ని, నిన్ను తుదముట్టించడానికి ఇంకో అవతారం ఎత్తుతాను. అపుడు మళ్ళీ నీవు నా చేతిని ఆశ్రయిస్తావు. సరేనా!’’ అన్నారు స్వామి. ‘‘చిత్తం! తమ ఆజ్ఞ’’ అన్నాడు సుదర్శనుడు.
అపుడు స్వామి ఆజ్ఞతో ఆ సుదర్శనుడే హైహయవంశములో కృతవీర్యుని పుత్రుడుగా అర్జున నామధేయముతో అవతరించారు. అతనే కార్తవీర్యార్జునుడు. అతన్ని, అతని వంటి చాలామందిని అనుగ్రహించటానికి స్వామి అత్రి అనసూయలకు దత్తుడైనాడు. అనగా దత్తాత్రేయునిగా అవతరించారు. యోగమును, అవధూత సంప్రదాయాన్ని చక్కగా ప్రచారం చేశాడు. కార్తవీర్యార్జునుడు అతన్ని ఆశ్రయించాడు. అఖండమైన బలసంపద, సహస్ర బాహువులు, ఎంతటివారితోనైనా ఓటమిని పొందని వరమును పొందాడు. అన్నీ పొందగానే ఎంత గొప్పవారికైనా రవ్వంత గర్వం వస్తుంది కదా! స్వామీ! నాకు ఓటమే లేకుంటే మరణం ఉండదు కదా! ఎట్లా అన్నాడు. నీ కోసమే నేను ఇంకొక రూపంలో వస్తాను. నీవు తప్పు చేస్తావు. అహం ఎంతటివారినైనా తప్పు చేయిస్తుంది. అపుడు నేనొచ్చి నిన్ను శిక్షించి అంతమొందిస్తాను అన్నాడు దత్తాత్రేయుడు.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement