Friday, November 22, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

గాధి అనే మహానుభావుడు కుశవంశంలో జన్మించాడు. అతని కుమార్తె సత్యవతి. ఆమె గొప్ప సౌందర్యరాశి. ఆమెను వివాహము చేసుకోవాలని భృగువంశములోని ఋచీకమహర్షి తలచాడు. వెంటనే వచ్చి గాధిని అడిగాడు. అయితే ఋచీకుడు తపస్వియే కాని భార్యను, కుటుంబాన్ని పోషించగలడా అని సందేహపడ్డాడు గాధి. తాను మహారాజు కాబట్టి ఋచీకుని చిన్నచూపు చూసి ‘ఏకతః శ్యామకర్ణానాం’ అనగా ఒకవైపు చెవులు నల్లగాను, రెండోవైపు తెల్లగానుజి తోక పసుపుపచ్చగా, వీపు భాగం తెల్లగా ఉండే వేయి గుర్రాలను ఇస్తే మా అమ్మాయినిచ్చి పెండ్లి చేస్తాను అని ఒక నిబంధన పెట్టాడు. ఋచీకుడు అలాగే, నాకు కొంత సమయమీయండి అని వరుణలోకం వెళ్ళి గుర్రాలకు, గోవులకు అధిపతి వరుణుడు కావున అతన్ని ప్రార్థించాడు.
బ్రాహ్మణోత్తమా! తప్పక ఇస్తాను. అలాగే తీసుకువెళ్ళండి. కాని ఒక మహర్షి ఒక అమ్మాయి కోసం ఇంతగా పరితపించడమేమిటి అని అడిగాడు. నిజమే, వరుణా! సత్యాన్ని గ్రహించావు. ఋషులు కామక్రోధాలకు వశమైనట్లుగా కనపడతారు. అదంతా ధర్మరక్షణలో భాగమే. అడిగావు కాబట్టి నీకు ఒక రహస్యం చెపుతున్నాను. మనసులో పెట్టుకో. మరెవరికి చెప్పకు అని హెచ్చరించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనాడు స్వామి అనగా నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి క్రీడాద్రిలో విహారానికి వెళ్ళాడు. దంపతుల విహారం కాబట్టి పరిజనం, పరివారం అందరినీ వదిలి వెళ్ళాడు. పాపం ఎపుడూ స్వామి చేతిలో ఉండే సుదర్శనుడు, అదేనండీ చక్రము ఒంటిగా ఏమి చేయాలో తోచక ఆ స్వామినే స్మరిస్తూ కూర్చున్నాడు.
ఇంతలో నారదమహర్షి వచ్చాడు. సుదర్శనుడు స్వాగతం పలికి మర్యాదలు చేశాడు. ‘‘స్వామి లేరా? ఎటు వెళ్ళారు?’’ అని అడిగాడు. దంపతులు ఉల్లాసంగా క్రీడాద్రికి వెళ్ళారు అని చెప్పాడు సుదర్శనుడు. నారదుడు ‘‘అయ్యో పాపం!’’ అని నిట్టూర్చాడు. ‘‘వారు విహారానికి వెళ్తే అయ్యో పాపమేమిటి, పుణ్యం కాని’’ అన్నాడు సుదర్శనుడు. ‘‘నేను పాపం అన్నది స్వామి గురించి కాదు. నీ గురించి. ఆయన పేరు వింటేనే పాపం పోతుంది కదా’’ అన్నాడు నారదుడు. ‘‘నేను ఎపుడూ ఆయన చేతిలో ఉంటే నాకు పాపమేమిటి?’’ అన్నాడు సుదర్శనుడు. ‘‘అందుకే పాపమంటున్నాను. నరకాసురుని ఎవరు సంహరించారు’’ అడిగాడు నారదుడు. ‘‘స్వామి’’ అన్నాడు సుదర్శనుడు. ‘‘మురాసురుని ఎవరు సంహరించారు?’’ అని అడిగాడు మళ్ళీ నారదుడు. మళ్ళీ ‘‘స్వామి’’యని సమాధానం ఇచ్చాడు సుదర్శనుడు. ఇలా ఒక పదిమంది పేర్లు చెప్పి అడిగితే స్వామి అన్నాడు సుదర్శనుడు. నారదుడు ‘‘అందుకే పాపం అంటున్నాను. స్వామి చేతితో గుద్ది చంపారా? మెడ పిసికి చంపారా? చక్రంతో చంపారు. ఇంకా అర్థం కాలేదా? అందరినీ చంపింది నువ్వు. పేరేమో ఆయనది. ఇది పాపం కాదా!’’ అన్నాడు నారదుడు. ‘‘ఇందులో పాపమేముంది? ఆయుధంతోనే అందరూ చంపుతారు. కాని కత్తి చంపింది అంటారా? కత్తికి శిక్ష వేస్తారా? కత్తితో చంపినవాడే నేరస్తుడు. కత్తి నేరస్తుడు కాదు. ఇందులో పాపమేమున్నది?’’ అన్నాడు సుదర్శనుడు. ‘‘నీవు చెప్పినది కత్తి, బాణం, గద వంటి ప్రాణం లేని చైతన్యం లేని వస్తువుల విషయంలో సరిపోతుంది. నీవు కూడా అచేతనమేనా? అచేతనమైతే నిన్నొదిలి ఎందుకు వెళ్ళాడు. నీవు స్వామికి ముఖ్య అనుచరుడవు. స్వామి తన శత్రువులందరినీ నీద్వారానే సంహరిస్తున్నాడు. కాని స్వామియే మురారి, స్వామియే నరకారి. మరి నీవు? నీకు పేరున్నదా? నీగురించి ఒక్కమాటైనా చెప్తున్నారా? ఇది అయ్యోపాపం కాదా!’’ అన్నాడు నారదుడు.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement