పరమాత్మ యొక్క అనంత కళ్యాణ గుణాలలో చాలా ప్రధానమైన గుణం ఔదార్యం అని చెప్పుకొన్నాం. నారాయణుని అవతారాలలో వామనావతారం వరకు ఆయా అవతారాలలోని ఔదార్యగుణాన్ని కొంత స్మరించుకొన్నాం. ఇక ఇపుడు పరశురామావతారంలో ఔదార్యాన్ని కొంత తెలుసుకుందాం. ఆయా అవతారాలలోని స్వామి ఔదార్యాన్నే కాకుండా ఆయా అవతార రహస్యాలను కూడా కొంత తెలుసుకొంటున్నాం. పరమాత్మ అంటేనే ఉదారగుణ సంపూర్ణుడు. ఆ ఔదార్యం అవతారాలలో స్ఫుటంగా బయటపడుతుంది.
అసలు వైకుంఠంలో లేదా పరమపదంలో ఉండవలసినవాడు దాన్ని వదిలిపెట్టి మనకోసం భూలోకానికి సుర నర పశు ఋషి రూపాలలో రావటమే ఔదార్యం కదా! తాను ఆజ్ఞగా ఇచ్చిన శ్రుతిస్మృతులను తాను స్వయంగా ఆచరించి మనచే ఆచరింపచేయటం, దగ్గరుండి తల్లిదండ్రులు పిల్లలను దిద్దుబాటు చేసినట్లు దిద్దుబాటు చేయటం ఔదార్యం కాదా! పరమాత్మ అవతారమే ధర్మానికి బాధ కలిగి అధర్మం విజృంభించినపుడు ఆ అధర్మాన్ని రూపు మాపి ధర్మాన్ని వికసింపచేయటానికి అని తెలుసుకోవాలి. అధర్మం, అజ్ఞానం, అహంకారం జీవునిలో పలు విధాలుగా పుట్టుకొస్తుంది. ఈ మూడూ మానవజాతి మనుగడకే ముప్పు కలిగిస్తాయి. ముఖ్యంగా అహంకారం, అజ్ఞానం, అధర్మం ఎంతటి అధర్మాన్ని వ్యాపింపచేస్తుంది, ఎంత అనర్థం కలిగిస్తుంది, దాన్ని సహిస్తే కలిగే దుష్పరిణామాలేమిటో తెలియజేయడానికి వచ్చిన అవతారమే పరశురామావతారము. పరశురాముడు అనగా మహాకోపిష్ఠి, ప్రచండుడు అనే తెలుసు. కాని ఆ అవతారం పుట్టుపూర్వోత్తరాలను కొంత తెలుసుకుందాం!
(సశేషం)