Saturday, October 26, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇక వామనావతారం ఔదార్యానికి పరాకాష్ఠ. గోదాదేవి తన ప్రబంధం తిరుప్పావులో వామనస్వామిని ఉత్తమన్‌ అంటుంది. తన పనికి భంగం కలుగకుండా ఎదుటవాని పనిని చేసేవాడు సామాన్య మానవుడు. తన కార్యమును ఆపుకొని ఎదుటివారి పనిచేసేవాడు మధ్యముడు. తన కార్యాన్ని, తనను చెడగొట్టుకొని ఎదుటివారి పనిని చేసేవాడు ఉత్తముడు. తనకు ఏ ప్రయోజనమూ లేకున్నా ఎదుటివాని పని చెడగొట్టేవాడు అధముడు. ఇందులో వామనుడు ఉత్తముడు అట. ఇంద్రునికి త్రౌలోక్య రాజ్యాన్ని అందించాలి. అది బలి చేతిలో ఉంది. బలి మహాధర్మాత్ముడు. పరమదాత కూడా! అటువంటివానితో యుద్ధము చేయరాదు. ధర్మయుద్ధం చేయాలి. మహాదాత, ధర్మాత్ముడే కాని ఇంద్రుని రాజ్యాన్ని హరించాడు. అది వీరధర్మం అన్నాడు. వీరత్వం నాలుగు విధాలు. దానవీరం, ధర్మవీరం, దయావీరం, యుద్ధవీరం. ఇక బలితో దానవీరత్వాన్ని, ధర్మవీరత్వాన్ని ప్రకటింపచేసి ఇంద్రుని పని పూర్తిచేయాలి అనుకున్నాడు. అందుకే సాక్షాత్తు లక్ష్మీపతి, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, ఐఖిల ఐశ్వర్య పరిపూర్ణుడు ఇవన్నీ విడిచి భిక్షాటనకు వచ్చాడు. లక్ష్మిని వక్షస్థలంలో జింకచర్మం చాటున దాచుకొని మరీ భిక్షాటనకు వచ్చాడు. తన ఐశ్వర్యాన్ని, అధికారాన్ని వదులుకున్నాడు. ఆజానుబాహు అని చెప్పినట్లు శ్రీమహావిష్ణువు పొడగరి. అంత పొడగరి దాన్ని కూడా వదులుకొని పొట్టివాడయ్యాడు. అవాప్త సమస్త కాముడు అనగా తాను పొందవలసిన కోరికలేవీ లేనివాడు భిక్ష కోరి వచ్చాడు. మూడు లోకాలకు ఇంకా చెప్పాలంటే 14 భువనాలకు అధిపతి మూడు అడుగులు యాచించాడు. అడిగినంతనే అఖిలలోకాధిపత్యమును కూడా ఇచ్చేవాడు యజ్ఞం చేసుకుంటాను, మూడు అడుగులు భూమి కావాలి అన్నాడు. అఖిల యజ్ఞాలకు అధిపతి. అసలు ఆయనే యజ్ఞము కదా! ‘యజ్ఞ భృత్‌ యజ్ఞః’ అని చెపుతుంది భారతం. అనంతకోటి జీవరాశితో భక్తకోటితో స్తుతించబడుటవవాడు బలిచక్రవర్తిని స్తుతించాడు. ఇలా స్వామి భక్తుల కోసం అన్నీ వదులుకున్నాడు. ఒక బికారిలా బిచ్చమడిగాడు. అతనినుండి దానము తీసుకున్నాడు. ఇన్ని విధాలుగా తనను చెడగొట్టుకొని, తక్కువ చేసుకొని బలిచక్రవర్తిని గొప్పగా చేసి త్రైలోక్యరాజ్యాన్ని భిక్షగా తీసుకున్నాడు. దానం అడిగేవరకే వామనుడు. దానం తీసుకోగానే త్రివిక్రముడు. అంటే మూడు అడుగులతో కొలవాలి అంటే ప్రపంచ అనంత విశ్వం రెండు అడుగులకే సరిపోయింది. మూడో అడుగుకోసం బలినే వరుణపాశంతో బంధించాడు. ఆడినమాట తప్పావు అన్నాడు. తన పాదమును అతని తలపై పెట్టి బ్రహ్మాదులకు లభించని భాగ్యాన్ని అతనికి ఇచ్చాడు. దానం తీసుకున్నవాడు దానమిచ్చినవానికి మహాభాగ్యాన్ని ప్రసాదించటం ఔదార్యం కాదా అంటే కాదు. సుతలాధిపత్యం ఇచ్చాడు. ఇంద్రునికిచ్చిన మూడు లోకాలు హ్మ్రకు ఒక పూట మాత్రమే ఉంటాయి. సుతలం బ్రహ్మకు నూరేళ్ళు నిండేదాకా ఉంటుంది. అంటే మహాప్రళయం వరకూ బలి సుతలాధిపతి. పరమాత్మకు అర్పిస్తే లఘువైనా అఖండం అవుతుంది అనటానికి బలిచక్రవర్తి సుతలాధిపత్యమే దృష్టాంతము. ఒక పూట ఉండే రాజ్యాన్ని భిక్షగా తీసుకొని నూరేళ్ళ రాజ్యాన్నిచ్చాడు. ఎవరండీ ఉదారుడు? బలిచక్రవర్తా, శ్రీమహావిష్ణువా? అతను తీసుకున్నది కూడా బలి సొమ్ము కాదు కదా! స్వామి సొమ్మే కదా. తన సొమ్మే ఇదంతా అని బలికి, లోకానికి తెలుపటానికి తన భూమిని తన పాదాలతో కొలిచి ఇదంతా నాదే అని చూపారు. కొండ గోడు, రాయి రప్ప, ముళ్ళు దర్భలు ఆ పాదానికి ఎన్ని గాయాలయ్యాయో ఒక్కరైనా అడిగారా? నా రాజ్యం వచ్చింది అని ఇంద్రుడు, నా రాజ్యం వచ్చిందని బలిచక్రవర్తి వెళ్ళారు. తన పాదానికి చికిత్స ఎవరు చేయాలి? అది కూడా తానే చేసుకున్నాడు. బ్రహ్మలోకం దాకా పాదాన్ని పంపించాడు. నాన్నగారి పాదమని బ్రహ్మ పాదమును కడిగాడు. తాతగారి పాదతీర్థమని శంకరుడు శిరమున దాల్చాడు. అంటే ఉత్త రాజ్యం ఇస్తే ఇంద్రుడే పాలిస్తాడు. నీరు కావాలి కదా! అఖిలలోకాలకు ఆకాశగంగను ప్రసాదించాడు. నేను ఇచ్చేవాడిని అని అహంకరించినందుకు బంధించాడు. అడిగినదానిని ఇచ్చినందుకు అనంత సంపద రాజ్యం ఇచ్చాడు. తానే అతనికి ద్వారపాలకుడయ్యాడు. న్యాయంగా అందరి ద్వారపాలకుడు ఆ నారాయణుడే కదా! మనం శరీరంలోనికి రావటానికి ద్వారం కర్మ. దాన్ని పాలించేవాడు ఆ పరమాత్మే కదా! ఇలా చెప్తూపోతే వామనావతారం ఒక భారతం అవుతుంది. అందుకే ఔదార్యానికి పరాకాష్ఠ వామనావతారం.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement