Friday, November 22, 2024

రేప‌టి నుంచి శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు

వేంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూత న భవిష్యతి!

వేంకటాచలంతో సమానమైన పుణ్యక్షేత్రం లేదు. వేంకటేశ్వరునితో సమానమైన దైవం ఇంతవరకు లేడు. ఇక ముందు ఉండబోడు. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్ధులూ, జ్ఞానులు – అనే నాలుగు రకాల భక్తులు నిత్యం శ్రీ వేంకటేశ్వరుని దర్శించి తరిస్తూవుంటారు. ఇది ఈనాటి వైభవం కాదు. శ్రీ వేంకటాచలం వేదకాలం నుంచి పరమపావన క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన దివ్యస్థలం. ఇక్కడికి ఎంతో దూరం నుండి భక్తులు ఎంతో శ్రమకు ఓర్చి వస్తారు. శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం దర్శించగానే వారు తన్మయత్వంతో పులకించిపోతారు. అత్యంత మనోహరమూర్తి అయిన స్వామిని వెనుదిరిగి మాటిమాటికి చూస్తూ ఊర్ధ్వపుండ్రకలితమైన స్వామివారి శ్రీముఖ మండలాన్ని హృదయంలో పదిలంగా నిలుపుకొని స్వస్థలాలకు చేరుతారు.

అయితే వచ్చిన భక్తులు అందరు స్వామివారికి నివేదించే అన్ని నిత్యసేవలు, వారోత్సవాలు చూచి తరించడం సాధ్యంకాదు. కొందరు ఆర్ధిక, వయోభారాది కారణాల చేత స్వామిని మళ్ళీమళ్ళీ దర్శించుకోలేకపోతున్నారు. ఇది గ్రహించిన తిరుమల తిరుపతి దేవస్థానములు అటువంటి వారికి స్వామివారి నిత్యసేవలను, వారోత్సవాలను ఉచితంగా దర్శించుకొనే భాగ్యాన్ని కల్గించాలని ఒక మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే “శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు”

- Advertisement -

హైదరాబాద్ ప్రజల భాగ్యవశంచేత ఈ కార్యక్రమం హైదరాబాద్లోని ఎస్.టి.ఆర్ స్టేడియం నందు తేదీ 11-10-2022 నుండి 15-10-2022 వరకు శ్రీ వేంకటేశ్వరస్వామికి నిత్యోత్సవ, వారోత్సవాలు జరుపబడతాయి. భక్తులందరూ ఈ కైంకర్యాలలో పాల్గొనవచ్చును.

Advertisement

తాజా వార్తలు

Advertisement