Wednesday, November 27, 2024

శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పము

పూజాసామాగ్రి
పసుపు, కుంకుమ, అక్షతలకి బియ్యం, జేగంట, 2 ఆచమన పాత్రలు, 2 ఉద్ధరిణలు, అగరుబత్తీలు, హారతి కర్పూరం బిళ్ళలు, 2 కొబ్బరికాయలు (వాటిని కొట్టేందుకూ, ఆ నీళ్ళు పట్టేందుకూ ఏర్పాట్లు చేసుకోవాలి) అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, లోతు ఉండి వెడల్పుగా ఉన్న పళ్ళాలు (నైవేద్యానికీ, పత్రికీ) 2, దీపారాధన వస్తువులు, యథో చితంగా పత్రి (మొత్తం నీటితో కడిగి ఏ జాతికి ఆ జాతిని విడివిడిగా పెట్టుకోవాలి). చేయి తుడుచుకోవడానికి ఒక వస్త్రం.
పత్తి (దూదిని) సన్నని దారంగా చేసి మధ్యమధ్యలో పసుపు కుంకుమలను అద్దిన యజ్ఞోపవీతాలు రెండు చేసుకోవాలి. రూపాయి బిళ్ళ లంతటి పరిమాణంలో దూదిని తీసుకుని తడిపి, నీటిని ఒత్తి పసుపు అద్దిన వస్త్రాలు 2, అగరుబత్తి పుల్లలకు దూదిని చుట్టి నేతిలో/ నూనెలో ముంచి పొడిగా ఉండేలా ఒత్తిన ‘కైవత్తులు’ 2 తయారు చేయాలి. 3 తమలపాకుల్లో రెండు వక్కలూ, 2 అరటిపళ్లు చొప్పున పెట్టి తాంబూలాలు 6 సిద్ధం చేసుకోవాలి.

అవసర నైవేద్యానికి:
చలిమిడితో చేసిన ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకం, పళ్ళు, కొబ్బరికాయ
మహానైవేద్యానికి:
అన్నం, పప్పు, పచ్చడి, కూర, పులుసు, వినాయకుడికి ఉండ్రా ళ్ళన్నా, జిల్లేడుకాయలు అన్నా, తెల్ల నువ్వులు కలిపి చేసిన మోదకాలన్నా చాలా ఇష్టం. ఇవి కాక, అప్పాలు, లడ్డూలు, పరమాన్నం, కుడుములు, అటుకులు కూడా ఇష్టమే. యధాశక్తి ఎవరికి కలిగింది వాళ్లు పెట్టొచ్చు.

ఇలా సిద్ధం కావాలి:
వినాయక చవితి నాడు వేకువజామునే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని ఇంట్లో అందరూ తలంటుస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి. దేవుడి గది ఉంటే దాన్ని లేదా ఈశాన్యమూల స్థలాన్ని శుద్ధి చేసి అలికి, బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు పెట్టాలి. పాలవెల్లి కట్టాలి. దానికింద దేవుణ్ణి ఉంచడానికి ఒక పీట వేయాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమబొట్టు పెట్టి, ముగ్గు వేయాలి. దానిపైన తమలపాకులు వేసి గణపతి విగ్రహాన్ని ఉంచాలి.
మొదట పూజచేసేవాళ్ళు బొట్టుపెట్టుకోవాలి. కూర్చునేందుకు మరోపీట తీసుకోవాలి. దానిపై నూతనవస్త్రం (పంచె లేదా తువ్వాలు) పరిచి, అక్షతలు వేయాలి. మూడు ఆకులు (తమలపాకు కొసలు వేళ్ల ను తాకాలి) రెండు వక్కలు, రెండు పళ్లు, దక్షిణ పట్టుకోవాలి.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|

ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే||
అయం ముహుర్త: సుముహూర్తోస్తు…
తదేవ లగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతేతేంఘ్రియుగం స్మరామి
యశ్శివోనామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో స్సంస్మరణాత్సుంసాం సర్వతో జయమంగళమ్‌
అని చదువుతూ పీటమీద తూర్పుముఖంగా కూర్చోవాలి. ముం దుగా పసుపుతో గణపతిని తయారుచేసి, కుంకుమబొట్టు పెట్టాలి.
ప్రార్థన: సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక:
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప:
ధూమకేతు ర్గణాధ్యక్ష: ఫాలచంద్రో గజానన:
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబ: స్కంద పూర్వజ:
అని చదివి పసుపు గణపతి దగ్గర తాంబూలాలు పెట్టాలి.
బొటనవేలు, ఉంగరం వేలు, మధ్యవేళ్లతో అక్షతలు తీసుకుని పసుపు గణపతి మీద వేసి నమస్కారం చేయాలి. సుముహూర్త కాలే సూర్యాధీనం నవానాం గ్రహాణాం అనుకూల్య ఫలసిద్ధిరస్తు…అని నమస్కారం చేయాలి.

- Advertisement -

శ్రీ వినాయక వ్రతకథ ప్రారంభం

వ్రతకథ చదువుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తరువాత వాటిని శిరసుపై వేసుకోవాలి.
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ, తమ్ములతోనూ వన వాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌన కాది రుషులకు అనేక పురాణ రహస్యాలను, బోధిస్తున్న సూత మహామునిని దర్శించి, నమస్కరించి ”రుషివర్యా, మేము రాజ్యా ధికారాన్నీ సమస్త వస్తు వాహనాలనూ పోగొట్టుకున్నాం. ఈ కష్టా లన్నీ తీరి, పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి” అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు… వినాయకవ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలూ కలు గుతాయంటూ ఇలా చెప్పసాగాడు.

”ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి ‘తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలనూ విజయాలనూ, వైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి” అని కోరాడు. అందుకు శివుడు ‘నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్ధ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొక టుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆరోజు ఉదయమే నిద్రలేచి, స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గానీ, వెండితోగానీ, మట్టితోగానీ, విఘ్నేశ్వ రుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మా న్ని ఏర్పరచాలి. అందులో గణశుని ప్రతిమను ప్రతిష్టించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు మొదలైన ఫలములను, రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివే దించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనాదులతో పూజను ము గించి, యధాశక్తి వేదవిదు లెన బ్రాహ్మణులకి దక్షిణ, తాంబూ లాదులు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య, భోజ్యాదులతో భోజ నం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పున: పూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈవిధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తా రో వాళ్లకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకీ అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధర్వాదులందరి చేతా ఆచరింపబడింది అని పరమ శివుడు కుమార స్వామికి చెప్పాడు.

కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్ల యితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలనూ పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్ల నే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది. శ్రీకృష్ణు డంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో బాటు గా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను” అంటూ ఇలా చెప్ప సాగాడు.

”పూర్వం గజముఖుడయిన గజాసురుడు శివుడినికోసం తప స్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు ‘స్వామీ నువ్వు నా ఉదర మందే నివసించాలి’ అని కోరాడు. దాంతో భక్తసులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసు కుంది. ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీమహావిష్ణు వును ప్రార్థించినది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చిం చాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణ యించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియైన హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానందభరితుడై ‘ఏమి కావాలో కోరుకోండి. ఇస్తాను’ అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ‘ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు’ అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెర పోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసు కున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ‘స్వామీ, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి, నా చర్మాన్ని నువ్వు ధరించు’ అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీ కారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవత లకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్లగా, శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్లాడు.

వినాయకోత్పత్తి
కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయా లనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ట చేసింది. ఆ దివ్యసుందరుని వాకిట్లో ఉంచి, ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పిలోపలకు వెళ్లింది. కాసేపటికి శివుడు వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమ శివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయా డు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి, లోపలికి వెళ్లాడు. జరిగిం ది తెలుసుకుని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతిం చాడు. వెంటనే తన వద్ద నున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండే నికి అతికించి, ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్నీ త్రిలోక పూజ్యతనూ కలిగించాడు. గణశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దుల పట్టి యైనాడు. ఆతర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మిం చాడు.

విఘ్నేశాధిపత్యం
ఒకనాడు దేవతలు, మునులు, మానవులు, పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజానను డు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు. గజా ననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్ధుడు కాబట్టి ఆధి పత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులనుద్దేశించి ‘మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందు గా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుం’దని చెప్పాడు. అంత కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. గజాననుడు అచే తనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదుల న్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమనీ తరుణోపా యం చెప్పమనీ తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మ తకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహిం చాడు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని అధీనములు- అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షి ణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావాన ప్రతి తీర్థం లోనూ కుమారస్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావ డం ప్రారంభించాడు. ఇలా మూడుకోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమార స్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్లాడు. తండ్రి పక్కన ఉన్న గజాన నుణ్ణి చూసి, నమస్కరించి, ‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను. క్షమించండి. ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వం డి’ అని ప్రార్థించాడు.

చంద్రుని పరిహాసం
అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేవతలు విఘ్నేశ్వరునికి కుడుములు, ఉండ్రాళ్లు మొదలైన పిండివంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవి సమ ర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి, కొన్ని వాహ నముకిచ్చి కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కానిన చేతులు భూమికానక ఇబ్బందిపడు తుండగా, శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి నవ్వాడు. రాజ దృష్టి సోకిన రాళ్లు కూడా నుగ్గవుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి, లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతిచెందాడు. అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి, ‘పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసినవారు పాపాత్ము లై నీలాపనిందలు పొందుదురు గాక’ అని శపించింది.

రుషిపత్నులకు నీలాపనిందలు
ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ, తమ భార్య లతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు రుషిపత్నులను మోహించి, శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక, మిగిలిన రుషిపత్నుల రూపం ధరించి పతిని సంతోష పెట్టేం దుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవాళ్లు తమ భార్యలే యని శంకించి, రుషులు తమ భార్యలను విడనాడారు. రుషిపత్ను లు చంద్రుని చూడటం వల్లే వారికి ఈ నీలాపనింద కలిగింది. రుషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలూ, మునులూ పర మేశ్వరునికి తెలుపగా, అతడు అగ్నిహోత్రుని భార్యయే రుషిపత్ను ల రూపం ధరించిందని చెప్పి రుషులను సమాధార పరిచాడు. అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు. అంత దేవాదులు ‘పార్వతీ, నీ శాపం వల్ల ముల్లోకా లకూ కీడు వాటిల్లుతోంది. ఉపసంహరించుకోవా’ లని ప్రార్థించా రు. వినాయకచవితి నాడు మాత్రమే చంద్రుని చూడ రాదు అని శాపాన్ని సడలించింది.

శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగంలో భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీర ప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పిదుకుతున్నాడు. అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబిం బాన్ని చూసి ‘అయ్యో నాకెలాంటి అపనింద రానున్నదో అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతక మణి ని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్లాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకిమ్మని అడగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్తు. తరువాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ము డు ప్రసేనుడు ఆ మణిని ధరిం చి వేటకు వెళ్లాడు. ఒక సింహం దాన్ని మాంస ఖండమనుకుని అతణ్ణి చంపి మణిని తీసుకుపోతోంది. అప్పుడు ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి, మణిని, తన కుమార్తె జాంబతికి ఇచ్చింది. ఆ తరువాత మణికోసం తన తమ్ముణ్ణి కృష్ణుడే చంపాడని సత్రాజిత్తు తన పట్టణంలో చాటించాడు. అది విన్న కృష్ణుడు, చవితి చంద్రుణ్ణి దోష ఫలమే ఇది అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకునేం దుకు బంధు సమేతుడై అడవికి వెళ్లి వెదకగా ఒకచోట ప్రసేనుని కళేబరం, సింహం కాలిజాడలు, ఎలుగుబంటి అడుగులు కనిపిం చాయి. ఆ దారినే వెళ్తూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి కృష్ణుడు గుహ లోపలికి వెళ్లి మణిని చూశాడు. దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది. అది చూసి, జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు. ఇద్దరి మధ్యా ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకుని దేవా త్రేతాయుగంలో నామీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు. నీతో ద్వంద్వ యుద్ధం చేయాలనీ కోరుకున్నాను. అప్పట్నుంచీ మీ నామస్మరణ చేస్తూ యుగాలు గడిపాను. ఇన్నా ళ్లకు నా కోరిక నెరవేరింది’ అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు ‘శమంతకమణిని అపహరించి నట్లు నాపై ఆరోపణ వచ్చింది. మణికోసం ఇలా వచ్చాను. ఇవ్వ’ మని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబ వతినీ కానుకగా ఇచ్చాడు. పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజి త్తును రప్పించి పిన్నపెద్దలను ఒకచోట చేర్చి యావత్‌ వృత్తాంత మును చెప్పాడు. శమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు ‘అయ్యో, లేనిపోని నింద మోపి తప్పుచేశా”నని విచారించి, మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి, క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామ ను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు. ఒక శుభముహూర్తాన జాంబతీ సత్యభామలను పరిణయమాడాడు. దేవాదులు, మునులు, కృష్ణు ణ్ణి స్తుతించి ‘మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకొన్నారు. మా పరిస్థితి ఏంటి’ అని అడగ్గా భాద్రపద శుద్ధ చతుర్ధినాడు ప్రమా దవశాత్తూ చంద్రుణ్ణి చూసినవాళ్ళు గణపతిని పూజించి ఈ శమం తకమణి కథను విని, అక్షతలు తలపై చల్లుకుంటే నీలాపనిందలు పొందరు’ అని చెప్పాడు కృష్ణుడు. అప్పట్నుంచీ ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధినాడు దేవతలూ, మహర్షులూ మానవులూ తమ తమ శక్తికొద్దీ గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖసంతోషాలతో ఉన్నారు.

వినాయక నిమజ్జనం :-
భాద్రపద శుద్ధ చవితి తరువాత వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తరువాత, మట్టి వినాయకులను ఆడంబరంగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కాని సముద్రంలో కాని నిమజ్జనం చేస్తారు.

సర్వేజనా సుఖినోభవంతు

Advertisement

తాజా వార్తలు

Advertisement