Thursday, November 21, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

  1. దంతంబుల్పడ నప్పుడే, తనువు నం దారూఢి యున్నప్పుడే
    కాంతాసంఘము రోయ నప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే
    వింత ల్మేన చరించ నప్పుడె, కురుల్వెల్వెల్ల గానప్పుడే
    చింతింప న్వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!
    ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, దంతంబుల్- పళ్ళు, పడనప్పుడు- ఏ- ఊడిపోక ముందే, తనువునందు- శరీరంలో, ఆరూఢి- పటుత్వం, ఉన్నప్పుడు- ఏ- ఉండగానే, కాంతాసంఘము- స్త్రీలు, రోయనప్పుడు- ఎ- అసహ్యించుకోక ముందుగానే, జర- ఆక్రాంతంబు- ముసలితనం చేత ఆక్రమించబడటం, కాని- అప్పుడు- ఏ- జరగక ముందే, మేన- శరీరంలో, వింతలు- విచిత్రాలు(ఊహించని మార్పులు), చరించని- అప్పుడు- ఏ- మొదలు కాక ముందే, కురుల్- వెంట్రుకలు, వెల్వెల్ల- కాన్- అప్పుడు- ఏ- మిక్కిలి తెల్లబడక ముందే, నీ పాద- అంబుజముల్- నీ పాదపద్మాలని, చింతింపన్- వలెన్- ధ్యానించాలి.
    తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! పండ్లు ఊడిపోక ముందే, శరీరంలో ఇంకా పటుత్వం ఉండగానే, స్త్రీలు చూచి ఏవగించుకోక ముందే, ముసలితనం మీదపడక ముందే, శరీరంలో కొత్త, కొత్త వింతలు చోటుచేసుకోక ముందే, జుట్టు నెఱిసిపోక ముందే నీ పాదపద్మాలని ధ్యానించాలి.
    విశేషం: పరమేశ్వర ధ్యానం శరీరంలో జవసత్వాలు ఉండగానే చేయాలి. ఎప్పుడో చేస్తాం అంటే, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా! పైగా శరీరానికి వార్ధకం వచ్చినప్పుడు మనసు కూడా సరిగా పని చేయదు. అపుడు ధ్యానం చేయటం వీలవదు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఓపిక ఉన్నప్పుడే భక్తి నెరపాలి అని ధూర్జటి తనని తాను హెచ్చరించుకుంటూ మానవుల నందరిని కూడా హెచ్చరించాడు. ఇదే భావం శపించబడిన నత్కీరుడి తీర్థయాత్రా సంరంభంలో దర్శన మిస్తుంది.
    వార్ధకం సమీపిస్తోంది, తనపనులు త్వరగా పూర్తి చేయాలనే తపన ఈ పద్యంలో కనపడుతుంది.
    ఈ పద్యం శతకానికి భరతవాక్యం, ఫలశ్రుతి కూడా.
డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement