Wednesday, November 20, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

110. కరి దైత్యున్బొరిగొన్న శూలము కరగ్రస్థంబు గాదో, రతీ
శ్వరునిం గాల్చిన ఫాలలోచన శిఖావర్గంబు చల్లారెనో
పరనిందాపరుల న్వధింప విదియున్ భావ్యంబె! వారేమి చే
సిరి నీకుం బరమోపకార మరయన్ శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! కరిదైత్యున్- గజాసురుణ్ణి, పొరిగొన్న-సంహరించిన, శూలము- త్రిశూలం, కరగ్రస్థంబు కాదు- ఓ- నీ చేతిలో లేదా?, రతి- ఈశ్వరునిన్- మన్మథుణ్ణి, కాల్చిన- దహించిన, ఫాలలోచన- నొసటి యందున్న కంటి యందలి, శిఖావర్గంబు- మంటలవరుస, చల్లారెను- ఓ- చప్పబడిందా్శ ఏమి?, పరనిందాపరులన్- ఇతరులను దూషించే వారిని, వధింపవు- చంపటంలేదు, ఇదియున్- ఈ పని, భావ్యంబు- ఎ- తగినదా?, అరయన్- పరిశీలింపగా, వారు- ఆ పరనిందాపరులు, నీకున్- నీకు, పరమ- ఉపకారము- గొప్పమేలు, ఏమి చేసిరి- ఏం చేశారు?
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! ఇతరులను నిందించే స్వభావం గలవారిని చంపటం లేదు. గజాసురుణ్ణి సంహరించిన త్రిశూలం నీ చేతిలో లేదా? మన్మథుణ్ణి దహించిన నిటలనేత్రజ్వాలలు చల్లారాయా? ఊరుకోవటం నీకేమైనా తగునా? లేక వారేమైనా గొప్పమేలు చేశారా నీకు?
విశేషం: శివుడు గజాసురుణ్ణి సంహరించి అతడి చర్మాన్నే తాను వస్త్రంగా ధరించి, అతడి తలని వినాయకుడికి అమర్చాడు. మన్మథుడి మూడోకంటిమంటతో దహించాడు. గజము అహంకారానికి, మన్మథుడు కామానికి ప్రతీకలు. వాటి సంహారం అంటే అహంకారాన్ని, కామాన్ని జయించటం. పరనిందకు కూడా ఈ రెండే కారణాలు. పరనిందాపరులు శివుడికి ఏదో మేలు చేసి ఉండాలని, అందువల్ల శివుడు వారిని ఉపేక్ష చేస్తున్నాడని ధూర్జటి నిందారోపణ చేస్తున్నాడీ పద్యంలో.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement