Friday, November 22, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

109. నిను నిందించిన దక్షుపై దెగవో!వాణీనాథు శాసింపవో
చనునా నీ పదపద్మసేవకుల తుచ్ఛంబాడు దుర్మార్గులం
బెనుప న్నీకును నీదుభక్త తతికిన్ భేదంబు గానంగ వ
చ్చెనో! లేకుండిన నూరకుండ గలవా? శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, నిను- నిన్ను, నిందించిన- దూషించిన, దక్షుపై- దక్షప్రజాపతి మీద, తెగవొ- దండెత్తలేదా?/ విజృంభించలేదా?, వాణీనాథు- సరస్వతి భర్త అయిన బ్రహ్మను, శాసింపవు- ఓ- శిక్షించ లేదా? నీ పదపద్మసేవకుల- నీ పాదపద్మాలని కొలిచే నీ భక్తులని, తుచ్ఛంబు-ఆడు- నీచంగా మాట్లాడే/ నిందించే, దుర్మార్గులన్- దుష్టులని, పెనుపన్- వృద్ధి పరచటం / బాగు చేయటం, చనును- ఆ- తగునా?/న్యాయమా? నీకును- నీకు కూడా, నీదు- నీ యొక్క, భక్తతతికిన్-భక్తుల సమూహానికి, భేదంబు-తేడా/అంతరం, కానంగ వచ్చెను-ఓ- కనిపించినదా?, లేక- ఉండినన్- లేని యెడల / లేక పోతే, ఊరక- ఉండన్- కలవా‍- ఉపేక్ష చేయగలవా/ పట్టనట్టు ఉంటావా?
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! పూర్వం దక్షప్రజాపతి నిన్ను దూషించి, అవమానించగా, అతడిని శిక్షించ లేదా? బ్రాహ్మదేవుణ్ణి కూడా అణచి వేయలేదా?ఇప్పుడు నీ పాదసేవకులను చులకన చేస్తున్న దుర్మార్గులకు మేలే చేస్తున్నావు. నీకు నీ భక్తులకు మధ్య తేడా కనపడుతున్నది కాబోలు. లేకపోతే చూస్తూ ఊరకుంటావా? (నీ భక్తులని నిందించిన వారిని శిక్షించకుండా).
విశేషం: దక్షప్రజాపతి తన యజ్ఞంలో శివుణ్ణి దూషించి అవమానిస్తే, సతీదేవి యాగాగ్నిలో దగ్ధం కాగా, వీరభద్రుడి చేత ఆ దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు శివుడు. శివుడు తనను నిందించి నప్పుడు ఊరకున్నాడు. సతీదేవిని అవమానించి నందుకే దక్షుణ్ణి శిక్షించాడు. అదేవిధంగా బ్రహ్మను కూడా శిక్షించాడు. ఇప్పుడు తన భక్తులను నిందించినవారి నేమీ చేయటం లేదు. పూర్వం భక్తుల నేమైనా అంటే శివుడు సహించ లేదు. ఇప్పుడు ఊరకున్నాడు అంటే భక్తులను, వారి మానావమానాలను పట్టించుకోవటం లేదని ధూర్జటి ఆవేదన.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement