108.పటవద్రజ్జు భుజంగవద్రజత విభ్రాంతి స్ఫురచ్ఛుక్తి వ
ద్ఘట వచ్చంద్రశిలా జపాకుసుమ రుక్ సాంగత్య వత్తంచు వా
క్పటిమ న్నేర్తురు చిత్సుఖం బనుభవింపన్ లేక దుర్మేధను-
చిటు కన్నం దలపోయ జూతురధముల్ శ్రీకాళహస్తీశ్వరా!
-దుర్మేధసుల్ అనే పాఠాంతరం కూడ కనిపిస్తుంది.
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! అధముల్- నీచులు, దుర్మేధనున్- చెడ్డదారి పట్టిన తెలివితో, చిత్- సుఖంబు- జ్ఞానానందాన్ని, అనుభవింపన్ లేక- అనుభవించటం చేత కాక, చిటుకు- అన్నన్- చిటుక్కు మని చిన్నచప్పుడైనా, తలపోయన్- ఏవో అర్థాలు చెప్పటానికి, చూతురు- ప్రయత్నం చేస్తారు, పటవత్- వస్త్రంలాగా, రజ్జుభుజంగవత్- త్రాడును చూచి పామనుకొన్న విధంగా, రజత విభ్రాంతి స్ఫురత్ శుక్తివత్- వెండి అనే భ్రమ కలిగించేట్లు మెరిసే ముత్యపుచిప్ప లాగా, ఘటవత్- కుండలాగా, చంద్రశిలాజపాకుసుమ- రుక్- సాంగత్యవత్- దాసానిపువ్వు (మందారం) కాంతి ప్రతిఫలించే చంద్రకాంతశిల లాగా, అనుచు- అంటూ/వాదిస్తూ, వాక్పటిమల్- మాటలలో పరాక్రమాన్ని, నేర్తురు- నేర్చుకుంటారు.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! జ్ఞానం వల్ల కలిగే ఆనందాన్ని అనుభవించటం చేతకానివారు, అధములై, తమ జ్ఞానాన్ని, తెలివిని వక్రమార్గంలో వినియోగిస్తూ ప్రతిచిన్నదానికి పెద్దపెద్ద వ్యాఖ్యానాలు చేయటానికి ప్రయత్నిస్తారు. ద్వైతజ్ఞానంతో సంసారం మాయ అని, అది రజ్జుసర్పభ్రాంతి, శుక్తిరజతభ్రాంతి, చంద్రశిలాజపాకుసుమభ్రాంతుల వలెను, వస్త్రం, కుండ వలెను సత్యం కాదని మాటల నేర్పుతో వాదిస్తూ ఉంటారు.
విశేషం: సంసారం మాయయే. కాని, ఈ మాయ కూడా భగవద్విలాసమే కదా! ఈ జ్ఞానం లేనివారికి ఆనందం అనుభవం లోకి రాదు. వట్టి శాస్త్రజ్ఞానం మాత్రమే ఉన్నవారు తమకున్న జ్ఞానాన్ని, తెలివితేటలని వక్రమార్గం పట్టించి, వాక్చాతుర్యంతో ప్రతిచిన్నదానికి పెద్దవ్యాఖ్యానాలు చేస్తూ తమ గొప్పతనాన్ని ప్రకటిస్తూ ఇతరులని అయోమయంలో పడేస్తూ ఉంటారు. తమకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టటం, జీవితంలో అన్వయించటం చేతకాదు. వారు చిలకపలుకు ల్లాగా ఉపయోగించే మాటలు ఇవి. వారికే అర్థం కానివి వినే వారి కేమి అర్థ మవుతాయి? 1) ఘటవత్, 2) పటవత్ వంటివి. కుండ, వస్త్రం వాస్తవాలు కావు. అవి భ్రమ. నిజానికి వాటిలో ఉన్నది మట్టి, పత్తి. ఈ జగత్తు కూడా అంతే. కుండ లాగా, వస్త్రం లాగా ఉన్నట్టు కనపడుతుంది తప్ప నిజంగా లేదు. కుండ మట్టితోను, వస్త్రం పత్తితోను ఏర్పడినట్టే ఈ జగత్తు పరమాత్మతో ఏర్పడింది. మూలమైన ముడిపదార్థం పరమాత్మే నని, భగవంతుడికి జగత్తుకి ఉన్న సంబంధం చెప్పటానికి ఉపయోగించే ఉపపత్తులు ఇవి.
3) రజ్జుసర్పభ్రాంతి: తాడుని చూసి పాము అనుకోటం. నిజానికి అక్కడ పాము లేక పోయినా మనసులో సర్పభావన ఉంది కనుక పోలిక కారణంగా తాడుని పాము అనుకోటం జరుగుతోంది. ఈ ప్రపంచం కూడా అంతే. నిజానికి అది లేదు. కాని, ద్రష్ట మనస్సులో ఉన్న భావన కారణంగా ఉన్నట్లు కనపడటమే కాదు, అనుభవం కూడా కలుగుతుంది. ఇది వస్తుపరమైన భ్రాంతి.
4) శుక్తిరజతభ్రాంతి: ముత్యపుచిప్ప మిలమిలా మెరుస్తూ వెండివస్తువు అనే భ్రాంతి కలిగిస్తుంది. సంసారమూ అంతే. కనులు మిరుమిట్లు గొలుపుతూ విలువైనది అనే భ్రాంతి కలిగిస్తుంది. పరిశీలించి చూస్తే వెండి కాదు. కనీసం ముత్యమైనా కాదు. విలువేమాత్రం లేని ముత్యపుచిప్ప మాత్రమే అని అర్థ మయినట్టు, సంసారం సారవిహీనం అని అర్థ మవుతుంది. కాంతి లేక గుణపరమైన భ్రాంతి ఇది.
5) చంద్రకాంతశిలాజపాకుసుమ భ్రాంతి: జపాకుసుమం (తెలుగువారు మందారం అంటారు. సంస్కృతంలో మందారం అంటే వేరు)ఎర్రగా ఉంటుంది. ఎర్రని జపాకుసుమం పక్కన ఉన్న తెల్లని చంద్రకాంతశిల కూడా ఎర్రగా కనపడుతుంది. కాని, అది దాని రంగు కాదు. అదే విధంగా జగత్తులోని రంగులన్నీ. వాస్తవానికి ఏ వర్ణము లేదు. ఇది వర్ణపరమైన భ్రాంతి.
శ్రీ కాళహస్తీశ్వర శతకం
Advertisement
తాజా వార్తలు
Advertisement