Tuesday, November 19, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

107. తమ నేత్రద్యుతి తామె చూడ సుఖమై యేకత్వమున్ కూర్చగా
విమలమ్ముల్ కమలాభముల్ జనిత సద్విద్యుల్లతాలాస్యముల్
సుమ నోబాణ జయప్రదమ్ములనుచున్ చూచున్ జలంబూని హా
రిమృగాక్షీనివహంబు కన్నుగవలన్ శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, తమనేత్రద్యుతి- తమ కన్నుల కాంతి, తామె- ఎవరికి వారె, చూడ- చూడగా, సుఖము- ఐ- ఆనందదాయకమై, ఏకత్వమున్-కలయికని/జీవాత్మ పరమాత్మల అభేదాన్ని, కూర్పగా- కలిగించగా, చలంబూని- దీక్ష వహించి, హారి- మనోహరమైన, మృగ- అక్షీ-నివహమ్ము- లేడికన్నుల వంటి కన్నులు గల స్త్రీసమూహం యొక్క, కన్నుగవలన్- కనుదోయిని, విమలమ్ముల్-నిర్మలాలు, కమల- ఆభమున్- పద్మముల వంటి కాంతి గలవి, జనిత- తమ నుండి పుట్టిన, సత్- విద్యుత్- లతా- శ్రేష్ఠమైన మెఱుపు తీగల, లాస్యముల్- వయ్యారమైన నృత్యాలు కలవి, సుమనః- బాణ- పూలుబాణములుగా గల మన్మథుడికి, జయప్రదమ్ములు- జయకారకాలు, అనుచున్- అని కీర్తిస్తూ, చూచున్- చూస్తూ ఉండిపోతారు.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! మానవులు తమ కన్నులకాంతిని తామే చూసి నప్పుడు (అంతర్ముఖ మైనప్పుడు) పరమాత్మతో తనకు అభేదస్థితి కలిగి ఆనందదాయక మౌతుంది. కాని, మృగనయనల కన్నులు నిర్మలాలనీ, పద్మపుకాంతి కలవనీ, మెఱుపుతీగల నృత్యాలని కల్పించ గలవనీ మన్మథుడికి జయకారకాలనీ, కీర్తిస్తూ వాటిని చూస్తూ ఉండి పోతారు.
విశేషం: భక్తులు, యోగులు ఆనందం పొందే విధం వివరించబడింది ఈ పద్యంలో. చూపులు అంతర్ముఖమైనప్పుడు, అంతర్నేత్రం (మూడో కన్ను)పనిచేస్తుంది. అపుడున్న దంతా ఆనందం ఒక్కటే. అదే శివుడు. కళ్లతో లోపలికి చూడక, బయట ఆనందం దొరుకుతుందని తమకళ్ళకి మారుగా స్త్రీలకళ్ల వంక చూడటం ఎంత అవివేకం!
ఇల్లు వదలి వీధినపడటం అంటే ఇదే కదా!

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement