105. క్షితిలో దొడ్డతురంగ సామజములే చిత్రమ్ము లాందోళికా
తతులే లెక్క విలాసినీజన సువస్త్రవ్రాత భూషా కలా
ప తనూజాదిక మేమి దుర్లభము నీ పాదమ్ము లర్చించుచో
జితపంకేరుహ పాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, జిత- గెలువబడిన, పంకేరుహ- పద్మాలు కలిగిన, పాద- పాదాలు అనే, పద్మ-తామరల యొక్క, యుగళా- జంట కలవాడా!, నీ పాదమ్ములు- నీ అడుగులని, అర్చించుచోన్-సేవించి నట్లైతే, క్షితిలో- భూమి యందు, దొడ్డ- గొప్ప/పెద్దవైన/ ఘనమైన, తురంగ- గుఱ్ఱములు, సామజములు- ఏనుగలు, ఏ- ఏమంత, చిత్రమ్ములు- ఆశ్చర్యకరాలు?, ఆందోళికాతతులు- పల్లకీల సమూహాలు, ఏ లెక్క- ఏమంత పరిగణింప దగినవి? విలాసినీజన- విలాసవతులైన స్త్రీలు, సువస్త్రవ్రాత- మంచిబట్టలకుప్పలు, భూషా-నగలు, కలాప- మైపూతలు మొదలైన పరిమళద్రవ్యాలు, తనూజ- బిడ్డలు, ఆదికము- మొదలైన వాటిలో, ఏమి దుర్లభము- పొందరానివి ఏమున్నాయి?
తాత్పర్యం: పద్మాలసౌరుని గెలుచునట్టి శుభప్రదమైన పాదాలుగల శ్రీకాళహస్తీశ్వరా! నీ పాదాలని అర్చించే వారికి గొప్పగుఱ్ఱాలు, ఏనుగలు, పల్లకీలు, స్త్రీలు, మంచివస్త్రాలు, అలంకారాలు, మైపూతలు, సంతానం మొదలైనవి ఏవి కూడా గొప్పవి, ఆశ్చర్యకరమైనవి, పొందరానివి కావు.
విశేషం: లోకంలో భోగచిహ్నాలుగా, ప్రయోజకత్వాలుగా, ఘనమైనవిగా పరిగణించబడేవి ఏవీ కూడా శివుడిపాదాలు భజించేవాడికి గొప్పవిగా అనిపించవు. వాటన్నింటిని మించిన ఘనమైన ఐశ్వర్యం ఈశ్వరదాసుడికి ఉంది. పైగా అల్పంగా అనిపించే ఈ విషయాలన్నీ శివపాదస్మరణతో అనాయాసంగా లభిస్తాయి. శివభక్తి, శివపాదమహత్వం ఈ పద్యంలో వివరించ బడింది.
శ్రీ కాళహస్తీశ్వర శతకం
Advertisement
తాజా వార్తలు
Advertisement