103. జలజశ్రీ గల మంచినీళ్ళు గలవే చట్రాతిలో? బాపురే
వెలివాడన్ మఱి బాప నిల్లు గలదా? వేసాలు గా కక్కటా
నలినా రెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ (నే) నీ
చెలువం బైన గుణంబు లెంచు కొనవే శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, బాపురే- ఆశ్చర్యం, చట్రాతిలో- చట్టుబండలో/నల్లరాతిలో, జలజశ్రీ- కల- కమలాల సంపదతో కూడి యున్న, మంచినీళ్ళు- త్రాగటానికి అనువైన నీళ్ళు, కలవు- ఏ- ఉన్నాయా?, మఱిన్- ఇంకా, వెలివాడన్- వెలివేయబడినవారి వీధిలో/ అంటరానివారుండే ప్రదేశంలో, బాపన- ఇల్లు- బ్రాహ్మణగృహం, కలదా- ఉన్నదా? అక్కటా- అయ్యో! వేసాలు- కాక్స (ఉన్నాయన్నమాట అంటే)వేషాలు కదా! (నిజము కాదు), నలిన్- బాగుగా, ఆ రెండు గుణంబులు- ఎంచి- ఆ రెండు లక్షణాలని ఆలోచించి/పరిగణించి, మదిలో-మనస్సులో, నన్నున్- నన్ను, రోయంగన్- అసహ్యించుకోవటం, ఏమి?- ఎందుకు?, నీ చెలువంబు- అయిన- నీకు అందమైన / నచ్చిన, గుణంబులు- లక్షణాలు, ఎంచుకొనవు- ఏ- ఎన్నిక చేసి గ్రహించు / ఏరి తీసుకో.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! బండరాతిలో పద్మాల సొబగుతో ఉన్న తాగటానికి పనికి వచ్చే నీళ్ళు ఉంటాయా? అంటరానివారు ఉండే, వెలివేయబడినవారు ఉండే వీధుల్లో బ్రాహ్మణగృహం ఉంటుందా? ఉన్నాయి అంటే ఎంత ఆశ్చర్యం! అన్నీ వేషాలే.(ఉండవు. ఉన్నాయి అంటే వేషాలు వేయటం తప్ప వాస్తవం కాదు) చక్కగా ఈ రెండు లక్షణాలని (నిజము, వేషం) పరిగణనలోకి తీసుకొని నన్ను అసహ్యించుకోవలసిన పని ఏమి? (నేను కూడా అటువంటి వాడిని అనుకోవలసిన పని లేదు.) నాలో ఉన్న ఏదో ఒక మంచిగుణాన్ని నీవే ఏరి, నన్ను స్వీకరించ వలసింది.
విశేషం: రాతి మధ్య కొద్దిగా నీళ్ళు, అందులో కప్ప ఉండవచ్చు. కాని పద్మసరస్సు ఉండదు. వెలి అనే ఆచారం సంఘంలో ఉన్న రోజుల్లో వెలివాడలో బ్రాహ్మణగృహం ఉండదు. సద్గుణాలు కాఠిన్యం (చట్రాయి వలె) కాలుష్యం (వెలివాడ) ఉన్నచోట ఉండవు. ఆ రెండింటినే చూసి అందరూ అదేవిధం అనుకోకూడదు. ఎటువంటివారి లోనూ ఏదోఒక మంచిగుణం ఉండకపోదు. తాను మంచి అనుకున్నది మంచి అవవచ్చు, కాకపోవచ్చు. ఆ నిర్ణయం ఎంపిక భగవంతుడికే వదలటం ఉత్తమం. “ I cannot choosethebest. Best chooses me” అంటాడు విశ్వకవి రవీంద్రనాథ టాగోర్.
శ్రీ కాళహస్తీశ్వర శతకం
Advertisement
తాజా వార్తలు
Advertisement