Tuesday, November 26, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

101. చెడుగుల్ గొందఱ గూడి చేయగ పనుల్చీకట్లు దూరంగ బా
ల్పపడితిం గాన గ్రహింప రాని నిను నొల్లం జాల బొమ్మంచు ని
ల్వెడలం ద్రోచిన జూరు పట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కి, గో
రెడి యర్థంబులు నాకు నేల యిడవో శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, చెడుగుల్- చెడుప్రవర్తన కలవారు, కొందఱన్- కూడి- కొంతమందితో కలసి, పనుల్- (చెడు) పనులు, చేయంగన్- చేయటానికి, పాల్పడితిన్- పూనుకున్నాను, కాన- అందువల్ల, గ్రహింపరాని-స్వీకరించతగని (అనుగ్రహించతగని), నినున్- నిన్ను (అనగా కవిని), ఒల్లన్- చాలన్- అంగీకరించలేను, పొమ్ము- అంచు-వెళ్ళుము అని, ఇల్- ఇంటినుండి, వెడలన్- త్రోచిన- బయటకు నెట్టినా, కోర్కిన్- కోరికతో/ ఇష్టంతో, చూరు పట్టుకొని- ఇంటిచూరుని పట్టుకొని, వ్రేలాడుచున్- కొద్దిఆధారంతో నైనా నిలిచి ఉంటాను, కోరిన- అర్థంబులు- నేను వేడిన వరాలు, నాకు- నాకు, ఏల- ఎందుకని, ఇడవు- ఓ-ఇవ్వ లేదా (చెప్పు).
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! నేను కొంతమంది చెడ్డవారితో కలిసి ఆకార్యాలు చేయబోయి, చీకట్లలో దూరాను. అది కారణంగా నన్ను స్వీకరించను పొమ్మని ఇంటి నుండి తరిమి కొట్టినా, నీ ఇంటిచూరు పట్టుకొని వ్రేలాడుతాను (నిన్ను వదలను). నువ్వు నేను కోరిన కోరిక లెందుకు తీర్చలేదు?
విశేషం: ఈ పద్యంలో కవి తాను చేసిన పనికి పశ్చాత్తాపపడటంతో పాటుగా తన భక్తినిశ్చలత, అనన్యశరణాగతి ప్రకటించాడు. పైగా శివుణ్ణి నిలదీస్తాడు. ఇప్పటికైనా తన కోరికలు ఎందుకు తీర్చవు? అని అడిగాడు. అసలు ముందే తన కోరికలు తీరిస్తే తానా చెడ్డపనులకి పాల్పడేవాడినే కాదని నెపం శివుడి పైనే వేస్తాడు.శివుడు కాదన్నా తాను మాత్రం వదల నన్నాడు. చీకట్లలో దూరటం అంటే పాపకృత్యాలు చేయటం. చీకటి అజ్ఞానానికి, అవిద్యకి, పాపచింతనకి (అన్ని చెడుగుణాలు, అవలక్షణాలకి) ప్రతీక.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement