100. జాతుల్సెప్పుట, సేవ చేయుట, మృషల్సంధించుటన్యాయపు
ఖ్యాతింబొందుట, కొండెగాడవుట, హింసారంభకుడౌట, మి
ధ్యా తాత్పర్యము లాడుటన్నియుపరద్రవ్యంబునాశించి, యా
శ్రీ తా నెన్నియుగంబులుండగలదోశ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, జాతుల్- చెప్పుట- జాతకాలు చెప్పటం, సేవ చేయుట- కొలువు చేయటం, మృషల్- అసత్యాలు, సంధించుట- కల్పించటం, అన్యాయము-ఖ్యాతిన్-పొందుట-తనకు చెందని కీర్తిని అన్యాయంగా పొందటం, లేదా అధర్మపరుడనే పేరు తెచ్చుకోవటం, కొండెగాడు- అవుట- చాడీలు చెప్పేవాడుగా మారటం, హింస- ఆరంభకుండు- ఔట- ఇతరులను బాధించే వాడు అవటం, మిథ్యా- లేని, తాత్పర్యములు-విషయాలు, ఆడుట- మాట్లాడటం, అన్నియు-మొదలైన వన్నీ, పరద్రవ్యంబున్- తనది కాని సొమ్ముని, ఆశించి్స కోరి, ఆ శ్రీ- ఆ విధంగా పొందిన సంపద, తాను- తాను, ఎన్ని యుగంబులు- ఎంతటి దీర్ఘకాలం, ఉండన్- కలదో-నిలిచి ఉంటుందో?
తాత్పర్యం:శ్రీకాళహస్తీశ్వరా!మానవులు జాతకాలు చెప్పటం, పరులకు దాస్యం చేయటం, అబద్ధాలు కల్పించటం, అధర్మంగా ప్రవర్తించటం (ఇతరులకి చెందవలసిన కీర్తిప్రతిష్ఠలని అన్యాయంగా తానే పొందటం), చాడీలు చెప్పటం, హింసాపరుడవటం, లేని విషయాలను కల్పించి చెప్పటం మొదలైన వన్నీ కూడ తనది కాని ధనాన్ని ఆశించే చేస్తారు. ఆ విధంగా సంపాదించిన ఐశ్వర్యం ఎంతకాలం ఉంటుంది? (ఎక్కువ కాలం ఉండదు అని భావం)
విశేషం: మానవులలో ఉండే అన్ని చెడులక్షణాలకి మూలకారణం పరద్రవ్యాశ. కాని, మానవుడికి ఎంత అర్హత ఉన్నదో అంతే దక్కుతుంది. పాపకార్యాల వల్ల పొందింది శాశ్వతం కాదు, తాత్కాలికం. నిజానికి పాపిష్టిసంపాదనమాత్రమే అస్థిరం అనుకోకూడదు. అసలు ‘శ్రీ’యే స్థిరం కాదు. లక్ష్మి చంచల కదా! స్థిరమైన, అచంచలమైన లక్ష్మి కూడా ఉంది. అదే మోక్షలక్ష్మి –అదే ‘పర’ద్రవ్యం – అనగా ద్రవ్యమునకు (భౌతిక పదార్థానికి, సృష్టికి) అతీతంగా ఉండేది. కోరదగిన పరద్రవ్యాన్ని కోరక, చంచలమైన పరద్రవ్యాన్నికోరతారు మానవులు అజ్ఞానులై అని ధూర్జటి ఆవేదన.
శ్రీ కాళహస్తీశ్వర శతకం
Advertisement
తాజా వార్తలు
Advertisement