Tuesday, November 26, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

94. ఆరావంబుదయించె( దారకముగానాత్మాభ్రవీధిన్ మహా
కారోకారమకార యుక్తమగు నోంకారాభిధానంబు, బె
న్మారున్విశ్వమనంగ( దన్మహిమచే, నా నాదబిందుల్ సుఖ
శ్రీ రంజిల్ల( గడంగునీవదెసుమీ!శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, ఆత్మ- అభ్రవీధిన్- హృదయ మందలిదహరాకాశంలో, మహా- గొప్పది అయిన, అకార- ఉకార- మకార- యుక్తము- అగు- అకార, ఉకార, మమకారాలతో కూడిన, ఓంకార- అభిధానంబు్స ఓంకారం అనే పేరున్న, ఆరావంబు- ధ్వని, తారకము- కాన్- జగత్తునితరింపచేసేది అయి, ఉదయించెన్- పుట్టింది, తత్- మహిమ- చేన్- దాని ప్రభావం చేత, విశ్వము- సర్వజగము, చెన్నారున్- ప్రకాశిస్తుంది, అనంగన్- అనేట్టు, ఆ నాద బిందుల్- ఆ నాదం, దాని ఉత్పత్తి స్థానమైన బిందువును, సుఖశ్రీ- సుఖం అనే సంపదచే, రంజిల్ల- ప్రకాశించగా, కడంగున్- పూనుకొనును, నీవు- నువ్వు, అది- ఎ- సుమీ- ఆ ప్రణవమే సుమా!
తాత్పర్యం:శ్రీకాళహస్తీశ్వరా!హృదయ మందలిదహరాకాశంలో అకార, ఉకార, మకారాల తో కూడిన ‘ఓం’కారం అనే పేరుకలగొప్పధ్వనిజగత్తునితరింపచేయటానికి పుట్టింది. దాని ప్రభావం చేతనే జగత్తంతా ఉంది. ఆ నాదం దాని ఉత్పత్తి స్థానమైన బిందువు ఆనందం అనే కాంతితో (సంపదతో), ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ఆనందస్వరూపమైన ప్రణవం నీవే కదా!
విశేషం: 64 వ పద్యంలో మహదాకాశంలోవిశ్వకారణమైన ఓంకారం ఉత్పత్తిని గురించి తెలియ చేశాడు. ఈ పద్యంలో దహరాకాశంలో పుట్టిన ఓంకారం గురించిన వివరణ కొద్దిగా ఉంది. రెండూ అ, ఉ, మ అనే ధ్వనుల కలయికయే. రెండూ జగత్తునితరింపచేసేవే. శివుడు ప్రణవస్వరూపుడు కదా!

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement