89.నిన్నంజూడరొ మొన్న జూడరొజనుల్నిత్యంబు( జావంగ నా
పన్నుల్గన్న నిధాన మయ్యెడిధనభ్రాంతిన్విసర్జింప లే
కున్నారెన్నడు నిన్ను గందురికమర్త్యుల్గొల్వరేమోనినున్
జిన్నంబుచ్చకప్రోవకుండునెడలన్శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:శ్రీకాళహస్తీశ్వరా!, ఆపన్నుల్- అపదలలోనున్నవారు, నిత్యంబు- ఎప్పుడు, చావగన్- చనిపోవటానికి, నిన్నన్- చూడరు- ఓ-నిన్న చూడ లేదా? , మొన్నన్- చూడరు- ఓ- మొన్న చూడ లేదా?, కన్నన్- చూచినా కాని, నిధానము- అయ్యెడి- నిధి వంటి, ధన- ధనమందలి, భ్రాంతిన్- భ్రమని, విసర్జింపలేక- ఉన్నారు- వదిలి పెట్ట లేకుండా ఉన్నారు, మర్త్యుల్- మరణం జీవలక్షణంగా ఉన్న మానవులు, ఇక- ఇంక, ఎన్నడు- ఎప్పుడు, నిన్నున్- నిన్ను, కందురు- చూస్తారు?, చిన్నంబుచ్చక- చులకన చేయకుండా, మన్నించి్స క్షమించి, ప్రోవక- రక్షించకుండ, ఉండు- ఎడలన్- ఉన్నట్లయితే, నినున్- నిన్ను, కొల్వరు- ఏమో- సేవింపరేమో!
తాత్పర్యం:శ్రీకాళహస్తీశ్వరా!రోగాదులతో బాధపడుతూ మానవులు మరణించటం నిన్న, మొన్న, అనునిత్యం చూడటం లేదా? అయినా మానవులు ఆశలకు నిలయమైన ధనమందలి భ్రాంతిని వదల లేకపోతున్నారు. ఇక నిన్నెప్పుడుదర్శించగలుగుతారు? (దర్శించలేరని భావం) తెలివితక్కువతనానికి వారిని చులకన చేయక మన్నించి రక్షించక పోతే, నిన్ను మఱచి , ఇంకా అధోగతి పాలై నిన్ను అసలు పూజించరేమో!
విశేషం: మానవుల అజ్ఞానానికి జాలిపడి, వారిని దయదలచ వలసిన అవసరం ఏమి టంటే – వారిని అదేవిధంగా వదిలి వేసినట్లయితే ఇంకా అధోగతిపాలై ఇప్పుడున్న మాత్రపు సద్బుద్ధి కూడ ఉండకపోవచ్చు, నిన్ను పూర్తిగా మరచి పోవచ్చు. అప్పుడు ఈ మాత్రం దయచూపటానికి కూడా అర్హులు కాకపోవచ్చు. కనుక, వారు అధోగతిపాలు కాకుండా ఉండటానికి వారిని మన్నించి, రక్షించవలసి ఉంటుంది. ఇది సాటి మానవులపై ధూర్జటికి ఉన్న ప్రేమకి మరొక్క తార్కాణం.
శ్రీ కాళహస్తీశ్వర శతకం
Advertisement
తాజా వార్తలు
Advertisement