Friday, November 22, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

80. ఒక పూటించుక కూడు తక్కువగు నే నోర్వంగలేదెండ కో
పకనీడన్వెదకున్, జలింజడిసికుంపట్లెత్తుకోజూచు; వా
నకునిల్లిల్లునుదూఱు నీ తనువు; దీనన్వచ్చుసౌఖ్యంబు రో
సి, కడాసింపరు గాక మర్త్యులకటా! శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, ఈ తనువు- ఈ శరీరం, ఒకపూట-ఒక్కమారు, ఇంచుక- కొంచెం, కూడు- అన్నం, తక్కువ- వెలితి, అగున్- ఏన్- అయినట్లైతే, ఓర్వంగన్- లేదు- తట్టుకో లేదు, ఎండకు- సూర్యతాపానికి, ఓపక- తట్టుకోలేక, నీడన్- నీడకోసం, వెదకున్- అన్వేషిస్తుంది, చలిన్- చలిలో, జడిసి- భయపడి, కుంపట్లు- నిప్పుల కుంపట్లని, ఎత్తుకోన్- చూచున్- పెట్టుకోటానికి ప్రయత్నిస్తుంది. వానకున్- వర్షం వస్తే, ఇల్లు- ఇల్లును- అన్ని ఇళ్ళూ (ప్రతి ఇల్లు), తూఱును- ప్రవేశిస్తుంది, దీనన్-దీనివల్ల కలిగే, సౌఖ్యంబు- సుఖాన్ని, రోసి- ఏవగించుకొని, మర్త్యులు- మానవులు (మృత్యువు అనే లక్షణం కలవారు), అకటా- అయ్యో! పాపం!, కడ- చివరను ( అనగా, జన్మము యొక్క చివర పొందదగినది, లేక, జన్మలకు చివర అంటే జన్మరాహిత్యం), ఆశింపరు కాక- కోరుకోకుండా ఉంటున్నారు కదా!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా!మరణించటం సహజలక్షణం అయిన మానవుల శరీరం ఒక్కపూట కొద్ది ఆహారం తక్కువైతే తట్టుకో లేదు. ఎండని భరించలేక నీడ కోసం వెతుకుతుంది. చలికి భయపడి, నిప్పుల కుంపటి పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. వాన వస్తే భయపడి, తగిన ప్రదేశం కోసం ప్రతి ఇల్లు వెతుకుతుంది. ఈ శరీరం వల్ల పొందే సౌఖ్యం తాత్కాలికమే ననితెలిసికొని, విరక్తి చెంది, జన్మల అంతాన్ని కోరుకోవటం లేదు మర్త్యులు. అయ్యో! ఎంతటి అజ్ఞానులు!!
విశేషం: మానవులు మర్త్యులు. మృత్యువు లక్షణంగా కలవారు. శరీరమా? ఆకలిదప్పికలకి ఎండకి, చలికి, వానకి కూడా తట్టుకో లేదు. జీవి శరీర సౌఖ్యాన్ని చూడాలే కాని, శరీరం వల్ల జీవికి సుఖం లేదు. ఈ సంగతి తెలిసినవారు జన్మ చివర పొంద దగిన మోక్షాన్ని, లేక, జన్మల యొక్క చివర అనగా జన్మ రాహిత్యాన్ని కోరటం సమంజసం. కాని, మానవులు అటువంటిది కోరటం లేదే అని కవి ఆవేదన.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement