79. కాసంతైనసుఖంబొనర్చునొ? మనఃకామంబులీడేర్చునో
వీసంబైనను వెంట వచ్చునొ? జగద్విఖ్యాతిగావించునొ?
దోసంబుల్వెడ( బాపునో? వలసినందోడ్తోమిముంజూపునో
ఛీ! సంసార దురాశ యేలుడుపవో? శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, కాసు అంత- ఐన- కొంచె మైనా, సుఖంబు- సౌఖ్యాన్ని, ఒనర్చును-ఒ- కలిగిస్తుందా?, మనః- మనస్సు నందలి, కామంబులు- కోరికలు, ఈడేర్చును- ఓ- తీరుస్తుందా?, వీసంబు- ఐనను- వీసమెత్తు పదార్థమైనా, వెంట వచ్చును- ఆ- పైలోకాలకి వెంట వస్తుందా?, జగత్- విఖ్యాతిన్- లోకంలో కీర్తిని, కావించును- ఓ- కలిగిస్తుందా?, దోసంబుల్- పాపాలని, పెడన్- పాపును- ఓ- నశింప చేస్తుందా?, వలసినన్- అవసర మైతే, తోడ్తోన్- వెను వెంటనే, మిమున్- మిమ్ములను, చూపును- ఓ- చూప గలుగుతుందా?, సంసారదురాశ- సంసార మందున్న ఈ పేరాశ, ఏల- ఉడుపవు- ఓ- ఎందుకు పోగొట్టవో కదా!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! సంసారంపై నున్న పేరాశ కొంచె మైనా సుఖాన్ని కలిగిస్తుందా? మనసు నందలి కోరికల్ని తీర్చుతుందా? అతి చిన్నభాగ్యమైనా శరీరం వదలిన తరువాత వెంట వస్తుందా? పోనీ, ఇహలోకంలోకీర్తిప్రతిష్ఠలనైనాకలిగిస్తుందా? పాపాలనైనాపోగొడుతుందా? అవసరమైతే మీ దర్శన మైనా కల్పిస్తుందా? (ఏమీ చేయదు కదా) ఆ దూరాశని ఎందుకు పోగొట్టవు?
విశేషం: సంసారమోహం ఇహాన్ని, పరాన్ని కూడా ఇవ్వలేదు. అందువల్ల అది వదల దగినది.
శ్రీ కాళహస్తీశ్వర శతకం
Advertisement
తాజా వార్తలు
Advertisement