Monday, November 25, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

77. పరిశీలించితిమంత్రతంత్రములు, చెప్పన్వింటిసాంఖ్యాది యో
గరహస్యంబులు, వేదశాస్త్రములువక్కాణించితిన్, శంక వో
దరయన్ గుమ్మడికాయలోని యవగింజంతైన నమ్మించి సు
స్థిర విజ్ఞానము త్రోవ( జూపగదవే శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, మంత్రతంత్రములు- మంత్రాలని, తంత్రాలని, పరిశీలించితిన్- బాగా అధ్యయనం చేశాను, సాంఖ్య- ఆది- సాంఖ్యము మొదలైన, యోగరహస్యంబులు- యోగశాస్త్రాలలో ఉన్న రహస్యాలని, చెప్పన్- చెప్పగా, వింటి- విన్నాను, వేదశాస్త్రములు- నాలుగువేదాలని, ఆరుశాస్త్రాలని, వక్కాణించితిన్- ఏకరవు పెట్టాను, అరయన్- పరిశీలించి చూస్తే, గుమ్మడికాయలోని- గుమ్మడికాయలో, అవగింజ- అంత- ఐన- పూర్తిగా ఏర్పడని తప్ప వలె ఉన్న గింజ అంతటిదైనా, శంక- అనుమానం, పోదు- తీరలేదు, నమ్మించి- నమ్మకం కలిగించి, సుస్థిర- చెక్కు చెదరని / నిత్యమైన, విజ్ఞానము త్రోవల్- జ్ఞానం కలిగే మార్గాన్ని, చూపన్- కదవు- ఏ- చూపించవా?
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! ఎన్నో మంత్రతంత్రాలని బాగా అధ్యయనం చేసాను. సాంఖ్యం మొదలైన యోగరహస్యాలని పెద్దలు చెప్పగా విన్నాను. వేదాలని, శాస్త్రాలని వల్లె వేశాను. అయినా కాని గుమ్మడికాయలోని తప్పగింజ (తాలు) అంత అయినా నా సందేహం తీరలేదు. నాకు విశ్వాసం కలిగించి, చెక్కుచెదరని జ్ఞానం కలిగే దారిని చూపించు.
విశేషం: ఆత్మదర్శనానికి గాని, పరమాత్మదర్శనానికి గాని పాండిత్యప్రకర్ష సరిపోదు. దానికి పరమేశ్వరానుగ్రహం కావాలి.
మంత్రం: “మననాత్త్రాయతేఇతి మంత్రం.” అంటే మననం చేస్తే రక్షించేది.
తంత్రం: “తను విస్తారే” ఆ మంత్రం యొక్క విస్తరణరూపమైనది తంత్రం. నిర్దిష్టమైన పూజాకలాపం, వస్తుసామాగ్రి మొదలైన వాటితో ఉండేది.
సంశయనివారణకుగ్రంథపరిజ్ఞానం చాలదు. అనుభవం, అనుగ్రహం కావాలి. కనుక ఆ మార్గాన్ని చూపించ మని ధూర్జటి ప్రార్థన. నశ్వరమైన ఈశ్వరజ్ఞానానికివేదశాస్త్రపరిజ్ఞానం సహకారి మాత్రమే.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement