Monday, November 18, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

73. అయవారైచరియింప వచ్చు( దమపాదాంభోజ తీర్థము లన్
దయతో( గొమ్మన వచ్చు, సేవకుని యర్థ ప్రాణ దేహాదుల
న్నియు మా సొమ్మన వచ్చు, గాని సిరులన్నిందించి,నిన్నాత్మ ని
ష్క్రియతంగానగ రాదు పండితులకున్శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, అయవారు- ఐ- గురువు అయి, చరియింపవచ్చున్- ప్రవర్తించ వచ్చు, దయతో- కరుణతో, తమ- తమ యొక్క, పాద-అంభోజ- పాదపద్మాలని కడిగిన, తీర్థమ్ములన్- నీటిని, కొమ్ము- అనవచ్చు-తీసుకోమని చెప్పవచ్చు, సేవకుని- బంటు యొక్క, అర్థ- ధనము, ప్రాణ- ప్రాణం, దేహ- ఆదులు్శ అన్నియు- శరీరం మొదలైన వన్నీ, మా సొమ్ము- మా సొత్తు, అనవచ్చున్- అనవచ్చు, కాని, అయినా, పండితులకున్- వేత్తలకు, (అన్నీ తెలిసినవారికి) కూడ, సిరులన్- నిందించి- సంపదలను తప్పు పట్టి, నిష్క్రియతన్- ఏ సేవలు చేయ కుండ, ఆత్మ- హృదయంలో, నిన్ను- నిన్ను, కానగరాదు- చూడశక్యం కాదు.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! పండితులు తమని తాము గురువులుగా ప్రకటించుకొని, సంచరింప వచ్చు, శిష్యులకు దయతో పాదతీర్థాలు ఇవ్వవచ్చు. వారి ధన, ప్రాణ, శరీరాదులన్నీతమ సొత్తే అన వచ్చు. కాని, అన్నీ తెలిసి కూడ సంపదలని నిందిస్తూ, (మాటలతో మాత్రమే. చేతలతో వాటికై ఆశపడుతూ)నీ సేవలు చేయక ఊరకున్నట్లయితే, ఆ పండితులకు తమ ఆత్మలో నిన్ను చూడటం కుదరదు.
విశేషం: ఎంతటి పండితులు, గొప్పవారు అయినా, గురువులుగా చలామణి అయినా, మాటల గారడీ చేసినా, నీ సేవ చేయనిదే నీ దర్శనం కాదు. వట్టి జ్ఞానం కన్న ఆచరణ ముఖ్యం.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement