Saturday, November 23, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

69. జ్ఞాతుల్ ద్రోహులు వారు సేయు కపటేర్ష్యాది క్రియాదోషముల్
మా తండ్రాన సహింపరాదు, ప్రతికర్మం బించు కే( జేయగా (
బోతే దోషముగాన మాని యతినై పో( గోరుదున్ సర్వదా
చేతః క్రోధము మాన దెట్లు నడతున్ శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! జ్ఞాతుల్- దాయాదులు, ద్రోహులు- నమ్మించి మోసం చేసే గుణంకలవారు, వారు- చేయు- వారు చేసే, కపట- మోసం, ఈర్ష్య- అసూయ, ఆది- మొదలైన గుణాలచేత చేసే, క్రియాదోషముల్- పనుల వల్ల కలిగిన క్లేశాలను, సహింపరాదు- భరించలేము, (ఓర్చుకోలేము), మా- తండ్రి- ఆన- మా తండ్రి మీద ఒట్టు, ప్రతి్శ కర్మంబు- ప్రతిక్రియ, ఇంచుక- ఏన్- కొద్దిగా నైనా, చేయగాన్- పోతే- చేయబోయి నట్లయితే, దోషము- తప్పు(పాపం), కాన- అందువలన, మాని- పగతీర్చుకోటం మాని, యతిని- మనస్సంయమనంకల సన్న్యాసిని, ఐపోన్- కోరినన్- కావాలనుకున్నాను, సర్వదా- ఎల్లప్పుడును, చేతః క్రోధము- మనసులో ఉన్న కోపం, మానదు- (ఉపశమించదు) పోదు, ఎట్లు- ఏ విధంగా, (ఎట్లున్- ఏ విధంగా) నడతున్- ప్రవర్తించాలి?(అడతున్- ఉపశమింప చేయగలను?).
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! దాయాదులు నమ్మించి మోసం చేసే గుణం ఉన్న వాళ్ళు. వారి మోసపుబుద్ధి, అసూయ మొదలైన గుణాల నుండి పుట్టిన పనులవల్ల కలిగే కష్టాలు సహించలేమని తండ్రిపై ఒట్టుపెట్టి చెపుతున్నాను. ప్రతీకారం తీర్చుకుందా మనుకుంటే – అది పాపం. అందువల్ల పగతీర్చుకోటం మాని, మనస్సంయమనం సాధించి, ‘యతి’ని కావాలనుకున్నాను. కాని, మనసులో ఉన్న క్రోధం మాత్రం తగ్గటం లేదు. దానిని ఎట్లా పోగొట్టుకోవాలి? నేనెట్లా ప్రవర్తించాలి?
విశేషం: జ్ఞాతివైరం జాతివైరం సహజం. ధూర్జటి అందుకు అపవాదం కాదు. ఈ కారణంతోనే తోబుట్టువులు లేనందుకు శివుణ్ణి అభినందించాడు. (57వ పద్యంలో) ప్రతీకారం తేర్చుకోవాలన్నంత కోపం ఉన్నా బలవంతాన పాపభీతితో ఆగాడు. కాని, కోపం అణచటం వల్ల క్రోధంగా పరిణమించింది. దానిని అణచటానికి మార్గం పరమశివుణ్ణే చూప మని ప్రార్థిస్తున్నాడు. అంటే కోపాన్ని జయించాలనుకుంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఉండగలగటం మొదటి మెట్టు. అసలు కోపమే లేకుండా తుడిచి పెట్టటం తరువాతి మెట్టు. అది సాధిస్తేనే కోపాన్ని జయించి నట్టు. అసలు కోపమే రాని మానసికస్థితికి చేరుకోటం ఆ పైస్థాయి.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement