65. ఒక యర్థంబును నిన్ను నే నడుగగా యుహింప, నెట్లైన( బొ
మ్ము, కవిత్వంబులు నాకు జెందవని యేమో యంటివా? నాదు జి
హ్వకు నైసర్గికకృత్య మంతియ సుమీ! ప్రార్థించుటే కాదు కో
రికలన్ నిన్నును గాన నాకు వశమా ? శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! ఎట్లు- ఐన్- ఏది ఏమైనా, పొమ్ము- కానియ్యి, ఒక-అర్థంబును- ఒక్క కోరిక కూడా, నిన్ను- నిన్ను, అడగ- కాన్- అడగటానికి (అడగాలని), ఊహింపను- తలచను, కవిత్వంబులు- నీవు చెప్పే కవిత్వాలు , నాకున్- నాకు, చెందవు- అని- సంబంధించినవి కావా అని, ఏమి- ఓ-ఏమేమో, అంటివి- ఆ- అన్నావా? నాదు- నా యొక్క, జిహ్వకు- నాలుకకి, నైసర్గిక కృత్యము- స్వభావసిద్ధమైన పని. అంతియ సుమీ- అంతే సుమా! ప్రార్థించుట- ఏ- నిన్ను ప్రార్థించటమే కాదు, కోరికలన్- కోరికలు కలిగి ఉండి, నిన్ను- నిన్ను, కానన్-చూడటం, నాకు- నాకు, వశమా- శక్యమౌతుందా? ( కాదని భావం)
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! నేను నిన్ను ఒక్క కోరిక కూడా కోర దలచ లేదు. మఱి, ఈ కవిత్వాలు నా గురించే రచించావు కదా! అని అనకు. కవిత్వం చెప్పటం నా నాలికకి సహజలక్షణం. అంతే! కాని, ఈ కవిత్వం నిన్నేదో కోరటానికి కాదు సుమా! ఎందుకంటే, కోరిక లుంటే నిన్ను చూడటానికి వీలు కాదు కదా!
విశేషం: కవిత్వం చెప్పకుండా ఉండ లేడు కనుక, జిహ్వచాపల్యంతో కవిత లల్లాడే కాని, ఏదో ఆశించి కాదు. కోరిక ఎటువంటిది ఉన్నా, భగవంతుడు కనిపించడు. భగవంతుణ్ణి చూడాలనే కోరిక ఉన్నా కాని, భగవంతుడికి, భక్తుడికి మధ్య ఆ కోరిక అన్నది అడ్డు వస్తుంది. చూడాలనే వాంఛ కూడా నశించిన తర్వాతే దర్శనం లభిస్తుంది.
కవిత్వం ధూర్జటి జీవ లక్షణమట!
శ్రీ కాళహస్తీశ్వర శతకం
Advertisement
తాజా వార్తలు
Advertisement